Obesity – ఊబ‌కాయం త‌గ్గించుకొనే మార్గాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Obesity: Definition, Causes, Diagnosis, Treatment

ఒక వ్యక్తి వయస్సు , ఎత్తును పరిగణనలోకి తీసుకొని సాధారణ బరువుకన్నా అధికంగా బరువు ఉండడాన్ని ఊబ‌కాయులుగా పేర్కొంటారు. వీరు సాధారణంగా 20 శాతం అధికంగా బరువు క‌లిగి ఉంటారు. మనదేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని జాతీయ పోషకాహార సంస్థ త‌న‌ సర్వేలో వెల్ల‌డించింది. అధిక బరువు, స్థూలకాయం వివిధ జబ్బులకు దారితీస్తుండటంతో వీటిని తగ్గించుకోవాలని వైద్యులు నొక్కి చెప్తున్నారు. ఊబ‌కాయుల్లో శ్వాస‌తీసుకొన్న‌ప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా తెరుచుకోక శ్వాస కండ‌రాలు స‌క్ర‌మంగా ప‌నిచేయ‌వు. ఫ‌లితంగా శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మై అవ‌య‌వాలకు ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా అంద‌దు. అలాగే ఆస్త‌మా, సీఓపీడీకి కూడా దారితీస్తుంది.

శ‌రీరం ఎక్కువ‌గా బ‌రువు ఉండ‌టం మోకాళ్ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంది. ఎముక‌లను ర‌క్షించే మృధులాస్తిపై ఒత్తిడి క‌లుగ‌జేస్తూ నొప్పితో పాటు ఎముక‌లు గ‌ట్టిప‌డతాయి. ఫ‌లితంగా ఆస్టియో ఆర్థ‌రైటీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. శ‌రీరానికి మేలుచేయ‌ని ఆహారాలు తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలతోపాటు ట్రైగ్లిజ‌రాయిడ్స్ స్థాయిలు పెరిగిపోతాయి. అందుక‌ని తృణధాన్యాలు, బీన్స్, ఆపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు ఎక్కువ‌గా తీసుకోవ‌డం మంచిది. ఊబ‌కాయం ఉన్న‌వారిలోని పిత్తాశ‌యంలో రాళ్లు త‌యారై తీవ్రంగా బాధిస్తాయి. ఊబ‌కాయం ఉన్న‌వారిలో టైప్ 2 డ‌యాబెటిస్ ఎక్కువ‌గా వేధిస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఇన్సూలిన్ త‌యారుకాకుండా అడ్డుకుంటుంది. శ‌రీరంలోని యూరిక్ ఆసిడ్ సూదుల‌మాదిరిగా త‌యారై గౌట్ స‌మ‌స్య‌ను అధికం చేస్తుంది. కాలి పెద్ద వేలు, మ‌డ‌మ‌, మోకాలు కీళ్ల వ‌ద్ద నొప్పి తీవ్రంగా ఉంటుంది.

శ‌రీరం పెద్దగా ఉన్న‌ప్పుడు అన్ని మూల‌ల‌కు స‌మానంగా ర‌క్తాన్ని పంపింగ్ చేయ‌డం గుండెకు స‌మ‌స్య‌గా త‌యార‌వుతుంది. అన్నిఅవ‌య‌వాల‌కు అందేలా ఎక్కువ ఒత్తిడితో పంపింగ్ చేయ‌డం వ‌ల్ల ధ‌మ‌నులు నాశ‌న‌మ‌య్యే ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. ధ‌మ‌న‌లు గ‌ట్టిగా త‌యారై ర‌క్తం పంపింగ్ కావ‌డంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌, హార్ట్ ఫెయిల్యూర్‌, స్ట్రోక్‌కు దారితీసే ప్ర‌మాద‌ముంటుంది. ర‌క్తాన్ని బ‌డ‌బోసి ర‌క్త‌పోటును కంట్రోల్ లో ఉంచే మూత్ర‌పిండాలు ఊబ‌కాయుల్లో స‌క్ర‌మంగా ప‌నిచేయ‌లేక చ‌తికిల‌బ‌డ‌తాయి. ఫ‌లితంగా డ‌యాబెటిస్‌, మూత్ర‌పిండాల వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. జీవన విధానంలో ఆహార నియమాలు పాటించటం.. ముఖ్యంగా కొవ్వులు, నూనె పదార్థాలను తగ్గించి సమతులాహారం తీసుకోవటంపై దృష్టి సారించాలి. సిగరెట్, బీడీలు తాగడం వెంటనే మానుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులను మితంగా తీసుకోవాలి. అధికంగా పీచు ఉండే కూర‌గాయ‌లు, పండ్లు తీసుకోవాలి. ఆక‌లిని అదుపులో పెట్టుకోవాలి. వీలైనంత ఎక్కువ మంచినీరు తాగాలి. నిత్యం క‌నీసం 30 నిమిషాల‌పాటైనా వ్యాయామం చేయాలి.

ఆహారంలో మార్పులతో పాటు శరీరం బరువును అదుపులో పెట్టుకోవడం ద్వారా ఊబకాయం దరిచేరకుండా చూసుకోవచ్చు. నేటి నుంచే మంచి జీవనశైలిని అలవర్చుకొండి. ఊబ‌కాయం రాకుండా చూసుకోండి.

Leave a Comment