Health Care: 40 ఏళ్ల వయసులోకి వచ్చారా – ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Health Advice to Thrive in Your 40s

సాధారణంగా వయసుపైబడుతున్న వారిని బీపీ, డయాబెటిస్, కీళ్ల నొప్పులు లాంటి అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. వీటన్నింటికీ కారణం మన ఆహారపు అలవాట్లే అంటున్నారు వైద్య నిపుణులు. అన్ని వయసుల వారు ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదని కూడా చెబుతున్నారు.

వయసు పైబడుతున్నకొద్దీ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై మరింత శ్రద్ద అవసరం. ఎందుకంటే వయసు పెరుగుతున్న కారణంగా అనారోగ్య సమస్యలు ఒకదాని వెంట ఒకటి చుట్టుముట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరినివెంబడించే అతి పెద్ద సమస్య హార్ట్ ఎటాక్. ఏటా ఈ గుండె జబ్బు ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల 35 వేలమంది మరణిస్తున్నారంటే ఇది ప్రధానమైన అనారోగ్య సమస్యో అర్థం చేసుకోవచ్చు. అందుకే దీనిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వెన్నెముకలో నొప్పి, చెమట పట్టినట్టుగా అనిపించడం , నీరసంగా ఉండడం లాంటి సంకేతాలు కనిపిస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని గుర్తు పెట్టుకోవాలి. అలాగే గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే కచ్చితంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. పొగ తాగడం, మద్యం తాగడానికి దూరంగా ఉండాలి. రోజూ తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంది.

హార్ట్ స్ట్రోక్ కు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. మెదడులోని రెండు భాగాలకు సాధారణంగా రక్తప్రసరణ జరుగుతుంది. ఐతే మెదడులో కణాలు చనిపోయినప్పుడు రక్తప్రసరణ ఆగిపోతుంది. దీనివల్ల అకస్మాత్తుగా నీరసం ఆవహించి మాట పడిపోయి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవాలి. స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే మానేయాలి. వయసు పెరుగుతున్నకొద్దీ మూత్రపిండాల పనితీరులోనూ మార్పులు వస్తాయి. కిడ్నీల పనితీరు సరిగ్గా లేకుండా వాటిలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలావరకు వాటిలో క్యాల్షియం స్టోన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కిడ్నీ స్టోన్స్ వల్ల ఎక్కువ నొప్పి ఉంటుంది. పైగా కొన్ని రాళ్లు మూత్ర నాళాల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. దీంతోపాటు మూత్రాన్ని బయటకు రాకుండా ఆపేస్తాయి. అందుకే వృద్ధాప్యంలో ఉన్నవారు కిడ్నీల పనితీరు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వరకు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగాలి.

వృద్ధాప్యంలో ఉన్న వారికి రోగ నిరోధక శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియాలు, వైరస్ లు శరీరంపై దాడి చేస్తే వారు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. న్యూమోకోకల్ న్యూమెనియా బ్యాక్టీరియా కారణంగా న్యూమెనియాకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. కానీ దీని నుంచి బయట పడేందుకు ఇప్పుడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. నడి వయసు దాటి వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నవారి ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి. ఎముకలు బలహీనంగా తయారై పెళుసుగా తయారయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు దృఢత్వాన్ని కోల్పోవడం వల్ల ఆస్టియో పోరోసిస్ కు దారి తీయవచ్చు. కాబట్టి క్యాల్షియం, విటమిన్ D శరీరానికి అధికంగా అందేలా చూసుకోవాలి.

వయసు 50 దాటిన వారిలో పల్మినరీ ఎంబోలిజమ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అంటే ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఉత్పన్నమైన వారికి ఛాతీలో నొప్పి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దగ్గు, నీరసం ఉంటుంది. ఇది క్రమంగా హార్ట్ డిసీస్ కు కూడా దారి తీస్తుంది. వయసు పైబడుతున్నకొద్దీ . . కంటి చూపులోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రెటీనా భాగం కంటి నుంచి కాస్త దూరమవుతుంది. ఫలితంగా రెటీనాకు ఆక్సిజన్ అందక కంటి చూపు తగ్గిపోతుంది. కాబట్టి వయసుపైబడుతున్నకొద్దీ ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే సమీపంలో ఉన్న వైద్యున్ని సంప్రదించాలి.

Leave a Comment