నయం చేయడం కంటే ముందుగానే నిరోధించడం చాలా మంచిదని చాలా మంది చెబుతుంటారు. అదే ముందు జాగ్రత్త పాటిస్తే ఎలాంటి సమస్య దరిచేరదు. అలాంటి వాటిలో ముంగా చెప్పుకోవల్సింది లో బీపీ గురించే … సకాలంలో లోబీపీని గుర్తించడం ద్వారా దీని నుంచి సులభంగా బయటపడవచ్చు . ఎలాంటి లక్షణాల ద్వారా లోబీపీని గుర్తించవచ్చు..లోబీపీ ఉంటే… ఏంచేయాలి…? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మన శరీరంలో రక్తపోటు ఉండవలసిన స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉండటాన్ని అల్ప రక్తపోటు లేదా లో బీపీ అంటారు. లో బీపీ మూలంగా గుండె, మెదడు, మూత్రపిండాలు తదితర ప్రధాన అవయవాలకు ఆక్సిజన్, ఆహార సరఫరా తగిన పాళ్లలో జరగదు. రక్తం అనేది రక్తపు నాళాలపైన ఒక ఫోర్స్‌తో ప్రవహిస్తుంది. దీన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. దీన్ని బట్టే గుండె వేగం, శ్వాస, శరీర ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. బీపీని సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీగా కొలుస్తారు. సిస్టోలిక్ బీపీ ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో 90 నుంచి 120 ఉండాలి. అదే డయాస్టోలిక్ బీపీ 60- 80 మధ్యలో ఉంటే సరిపోతుంది. సాధారణ బీపీ అంటే 120/80 గా ఉంటే చాలు. లో బీపీలో ఈ సంఖ్యల కన్నా లక్షణాలను బట్టే నిర్ధారిస్తారు. అయితే 100/60 కన్నా తక్కువ ఉంటే లో బీపీగా వ్యవహరించవచ్చు. కాబట్టి డాక్టర్ వద్దకు వెళ్లిన ప్రతిసారి బీపీని పరీక్ష చేయించుకుని రికార్డు చేసుకోవడం మంచిది.
గుండె, రక్తనాళాలలో లోపాల్లేని కొందరు ఆరోగ్యవంతులకు కూడా కొన్ని పరిస్థితుల్లో బీపీ పడిపోతుంటుంది. బీపీ పడిపోయి, మెదడుకు వెళ్లే రక్తం తగ్గిపోయి, కళ్లు తిరగడం, స్పృహ తప్పిపోవడం వంటివి జరిగినప్పుడు మాత్రమే దానిని హైపోటెన్షన్‌గా పేర్కొంటారు. బీపీ రేంజ్ మనిషినుంచి మనిషికి మారుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మారుతుంటుంది. స్త్రీల పురుషుల మధ్య కూడా తేడా కనిపిస్తుంది. లో బీపీ వచ్చేందుకు చాల రకాల కారణాలు ఉన్నాయి. గర్భం దాల్చిన స్త్రీలలో రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు వస్తాయి. దీంతో సహజంగానే బీపీ తగ్గుతుంది. కానీ బిడ్డకు జన్మనిచ్చాక చాలా మందిలో ఈ సమస్య దానంతట అదే పోతుంది. కానీ కొందరిలో అలా పోదు. సమస్య అలాగే ఉంటుంది.
గుండె కవాటాల్లో సమస్యలు, గుండె సమస్యలు ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగ్గా అవదు. అది లో బీపీకి కారణమవుతుంది. ఎండోక్రిన్ గ్రంథి సమస్యలు ఉంటే లో బీపీ వస్తుంది. థైరాయిడ్, లో బ్లడ్ షుగర్ కూడా ఇందుకు కారణమవుతాయి. నీళ్లను ఎంత తాగినప్పటికీ తీవ్రమైన డీహైడ్రేషన్ సమస్య ఉంటే అది లో బీపీకి దారి తీయవచ్చు. శరీరం లోపల ఎక్కడైనా అంతర్గతంగా గాయమైన రక్త స్రావం ఎక్కువగా ఉంటే అది లో బీపీ వచ్చేందుకు కారణమవుతుంది.
లో బీపీ గురించి పెద్దగా భయపడాల్సిన పని కూడా లేదు. నిజానికి వాళ్లను హైబీపీ కలవాళ్ల కంటే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కళ్లు బైర్లు కమ్మడం, కళ్లు తిరగడం, చెమటలు పోయడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు దానిని లో- బిపి లేదా హైపోటెన్షన్‌గా చెప్పుకోవచ్చు. లోబీపీని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కూర్చుని ఉన్న పోజిషన్ నుంచి సడన్ గా లేచి నిలబడ్డప్పుడు కళ్ళు బైర్లు కమ్మటం, స్పృహ తప్పటం లాంటివేమీ లేన ప్పుడు కూడా దానిని సాధారణం కింద తీసుకోవచ్చు.
కళ్లు తిరగడం, నీరసంగా, అలసటగా అనిపించడం వంటివి కనిపిస్తే బీపీ చెక్ చేయించుకోవడం మంచిది. శరీరం డీ హెడ్రేట్ అయినప్పుడు రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అందుకని రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. లోబీపీ ఉన్నవారు నిద్రించినప్పుడు సడెన్‌గా లేస్తే తల తిరగడం, గుండెదడగా అనిపించడం జరుగుతుంది. అందుకని నెమ్మదిగా లేవాలి. లోబీపీ ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవిడం వల్ల యూరియా, క్రియాటినిక్ లాంటి పదార్థాలు రక్తంలో అధికమై ప్రాణాపాయం కలిగిస్తాయి. లోబీపీ లక్షణాలు కనిపించగానే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.
బీపీని ఎప్పుడు సాధారణ స్థాయిలో ఉండేలా చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. లో బీపీ సమస్య తరచు ఎదుర్కోంటుంటే దాన్ని సాధారణ స్థాయికి తీసుకురావడం అనివార్యం. ఏదైమైనా లోబీపీ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకూడదు వేంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చిక్సిత చేయించుకోవాలి.









