ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా అనుకోని అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు వైద్యుడు అందుబాటులో లేనప్పుడు అందించే తాత్కాలిక చికిత్సే ప్రథమ చికిత్స. తాత్కాలిక ఉపశమనం కోసం లేదా పరిస్థితి మరింత జటిలం కాకుండా ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రథమ చికిత్సకు కీలకమైన అంశాలు ఏమిటో తెలుసుకుందామా.
మనం ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఏదైనా ఆపీసులకు వెళ్ళినప్పుడు గానీ అక్కడ ప్లస్ గుర్తు కలిగిన ఓ తెల్లని పెట్టె ఉంటుంది. అదే ప్రథమ చికిత్స పెట్టె. జఠిలమైన సమస్య ఎదురైన వెంటనే వైద్యుని వద్దకు చేరే లోపు పరిస్థితి చేయిదాటి పోకుండా చేసేదే ప్రథమ చికిత్స. ఇది అందించడం తప్పనిసరి. అయితే ప్రథమ చికిత్సనే గంటల తరబడి చేస్తూ, ఆస్పత్రిని తీసుకెళ్ళడంలో జాప్యం జరిగితే కొన్ని సమయాల్లో వైద్యులు కూడా కాపాడలేరు. సత్వరమే ప్రథమ చికిత్స అందించి, సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్ళడం అత్యంత ఆవశ్యకం. అయితే ఈ ప్రథమ చికిత్స విషయంలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రథమ చికిత్స వైద్యులు అందించేంది కాదు, సాధారణ వ్యక్తులు కూడా అందించగలిగేది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రథమ చికిత్స కూడా కీలకమైన నైపుణ్యం. ఏ తరహా ప్రమాదం విషయంలో ఎలా స్పందించాలో తెలిస్తే చాలు ఎవరైనా ప్రథమ చికిత్స చేయగలరు.
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో తప్పనిసరిగా ట్వీజర్స్ ఉండాలి. మన శరీరంపై ఏవైనా పదునైన వస్తువులు గుచ్చుకున్నప్పుడు వీటి సహాయంతో తీయవచ్చు. వీటిని అంటుకున్న ఇన్ఫెక్షన్లను పోగొట్టేందుకు వీటిని ఉపయోగించేముందు, ఉపయోగించిన తర్వాత ఆల్కహాల్ తో కడగాలి. కీటకాలు కుట్టినపుడు వచ్చే వాపు మరియు దురదను పోగొట్టేందుకు సహకరించే హైడ్రోకార్టిసోన్ క్రీమును వాడాలి. మిత్రులెవరైనా ప్రమాదవశాత్తూ గాయపడితే చేతికి గ్లవ్స్ ధరించి సానిటైజర్ తో శుభ్రం చేయాలి. అలాగే ఫర్ట్ ఎయిడ్ కిట్ లో తప్పనిసరిగా నొప్పి నివారణ మందులను ఉండేలా చూసుకోవాలి. వీటితోపాటు కొద్దిగా కాటన్, మరియు టేప్ ను కూడా ఉండేలా జాగ్రత్తపడాలి. గాయాలైనపుడు వీటి సహాయంతో గాయంపై రక్తస్రావం జరక్కుండా కట్టుకట్టవచ్చు. ఇవేకాక స్టెరైల్ సొల్యూషన్, స్టెరైల్ వాటర్ ను కిట్ లో భద్రపర్చుకోవాలి. అలాగే చిన్న చిన్న గాయాలను తగ్గించుకునే యాంటీబయాటిక్ క్రీమ్ కూడా ఉండాలి. అలర్జీ మందులను కూడా మన ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉంచుకోవడం వల్ల తీవ్రమైన అలర్జీ సమస్యలతో బాధపడుతున్నవారికి చక్కని ఉపశమనం లభిస్తుంది.
అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ప్రథమ చికిత్స ఒకేలా ఉండదు. ఎవరికైనా తలకు గాయం అయ్యి, అపస్మారక స్థితిలోకి వెళితే వెంటనే అత్యవసర సహాయానికి సమాచారం అందించాలి. ఈ సమయంలో మరింత రక్తం పోకుండా చూడాలి. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నొప్పి నివారణ మాత్రలు ఇవ్వకూడదు. తీవ్ర గాయాల పాలయ్యి తీవ్రమైన రక్త స్రావం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువెళుతున్నప్పుడు మధ్యలో గాయాల మీద గుడ్డతో బలంగా అదిమి ఉంచడం ద్వారా రక్తస్రావాన్ని అదుపు చేయవచ్చు. అదే విధంగా కొన్ని ప్రమాదాల్లో ముక్కు లోపలి రక్త నాళాలు చిట్లి రక్తం కారుతూ ఉంటే, తలను వెనక్కు వాలకుండా చూసుకోవాలి. వెనక్కు వాలితే రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అలాగే ముక్కు రంథ్రాల నుంచి రక్తం కారుతున్నట్లు కనిపిస్తే ముక్కు పై భాగంలో ఎముకను తాకకుండా, పక్క నుంచి రెండు వెళ్ళతో పట్టుకోవడం చేయాలి. ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునేలా సలహా ఇవ్వాలి. వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి. అలాగే శరీరం కాలిపోయి గాయాలు అయితే కాలిన గాయాలున్న భాగాన్ని వెంటనే చల్లని నీటి ధార కింద ఉంచాలి. ఐస్ పెట్టకూడదు. అలాగే ఎలాంటి ప్లాస్టర్లు బ్యాండేజ్ లు కట్ట కూడదు. ఆ భాగాన్ని శుభ్రమైన పాలిథిన్ బ్యాగ్ తో కప్పడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడవచ్చు. అలాగే విషవాయులు పీల్చినప్పుడు అక్కడ నుంచి తీసుకు వచ్చి, వెల్లికిలా పడుకోబెట్టి దుస్తులు వదులు చేయాలి. తొలుత శ్వాస ను పరీక్షించి, నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేయాలి.
గుండెకు సంబంధించిన కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్ లాంటి సందర్భాల్లో గుండె పై భాగంలో రెండు చేతులు ఉంచి వెంట వెంటనే కదుపుతూ ఉండాలి. బాధితుడి ముక్కును మూసి నోటి ద్వారా గాలిని అందించాలి. రక్త ప్రసరణ, శ్వాస ప్రారంభం అయ్యే వరకూ ఇలా చేస్తూనే ఉండాలి. శరీరం చల్లబడినట్లు అనిపిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా రక్త ప్రసరణ పూర్తిగా జరిగేలా చూడాలి. డయేరియా లాంటి ఇబ్బందులు ఎదురైతే బాధితులకు ద్రవ పదార్థాలు అందిస్తూ, ఓఆర్ ఎస్ ద్రావణాన్ని అందిస్తూ వైద్యుల వద్దకు తీసుకువెళ్ళాలి.
వడదెబ్బకు ఇదే మార్గాన్ని అనుసరించాలి. విద్యుత్ షాక్ లాంటివి తగిలినప్పుడు గాలి ఆడే చోట బోర్లా పడుకోబెట్టి వీపుపై నిదానంగా ఒత్తాలి. అనంతరం వీపు మీద ఒత్తిడి తగ్గిస్తూ, మోచేతి వద్ద పట్టుకుని వెనుకకు లాగాలి. నిముషానికి 12 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రమాదాలు ముందే చెప్పి రావు గనుక ప్రతి ఇంట్లో ప్రథమ చికిత్స కిట్ ను ఉంచుకోవాలి. పరిశ్రములు, నిర్మాణ ప్రదేశాల్లో, పనులు జరిగే చోట కూడా తప్పనిసరి. ఇందులో గాజు గుడ్డ, రోలర్ బ్యాండేజ్, బ్యాండేజ్, కత్తెర, ట్విజర్, యాంటీ సెప్టిక్ పైపులు, ఇన్ఫెక్షన్లను నివారించే డెటాల్, నొప్పి నివారణ మాత్రులు, ఆయోడిన్, హైడ్రోజన్ పెరాక్సైజ్, స్పిరిట్, థర్మామీటర్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే డ తగలని, పొడిగా ఉండే చల్లని ప్రదేశంలో కిట్ ను ఉంచాలి. వాటి తుది తేదీని ఎప్పటికప్పుడు గమనించి, కొత్త వాటిని అందుబాటులో ఉంచుకోవాలి.








