Botsa Anusha: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసురాలిపై కీలక ప్రకటన చేశారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన కుమార్తె బొత్స అనూష పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఆమె బరిలో నిలవనున్నట్లు తెలిపారు. దీంతో బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమైనట్లు స్పష్టమైంది.
మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో బొత్స సత్యనారాయణ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. బొత్స అనూష రాజకీయ అరంగేట్రానికి రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు వేదిక కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే బొత్స కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో, అనూష ఎంట్రీపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
వైద్య విద్యను అభ్యసించిన బొత్స అనూష డాక్టర్‌గా అర్హత సాధించారు. ప్రస్తుతం ప్రజా జీవితంలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలతో పాటు ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొంటూ వచ్చారు. అప్పటి నుంచే ఆమె రాజకీయ ప్రవేశంపై ప్రచారం సాగుతుండగా, తాజాగా బొత్స సత్యనారాయణ ప్రకటనతో ఆ ఊహాగానాలకు తెరపడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు నవ్యాంధ్ర రాజకీయాల్లోనూ బొత్స సత్యనారాయణ సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలందించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేసిన కీలక నేతల్లో ఆయన ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
బొత్స కుటుంబానికి రాజకీయాలు కొత్తేమీ కాదు. విజయనగరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈ కుటుంబానికి ఇప్పటికీ బలమైన రాజకీయ పట్టు ఉందని చెబుతుంటారు. బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ కూడా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.
ఇప్పుడు తల్లిదండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని బొత్స అనూష తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి లక్ష్యంగా ఆమె బరిలోకి దిగనున్నట్లు బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో, రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీ విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.










