Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ

By manavaradhi.com

Published on:

Follow Us
Janasena 30 Day Plan For Local Body Elections

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలవుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. రాబోయే ఎన్నికల కోసం 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే అంశంపై పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని నేతలు పేర్కొన్నారు.

యువత, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ స్థానిక స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని మరోసారి నిరూపించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.

2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వ్యవస్థలను ఉపయోగించి జనసేనను లక్ష్యంగా చేసుకున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో జనసేన గణనీయమైన ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. అప్పటి ఎన్నికల్లో పార్టీ 2 జడ్పీటీసీలు, 177 ఎంపీటీసీలు, 1,209 మంది సర్పంచులు, 1,576 మంది ఉప సర్పంచులు, 4,456 మంది వార్డు సభ్యులను గెలుచుకున్నట్లు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తీవ్ర పోటీ మధ్య పోరాడిన జనసేనకు ప్రజలు విశేష మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి పార్టీ సత్తా చాటాలని నేతలు నిర్ణయించారు.

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా భాగస్వాములను చేయడంతో పాటు, స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.

Leave a Comment