Spirit :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘స్పిరిట్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్రబృందం కీలక స్పష్టత ఇచ్చింది.
‘స్పిరిట్’ విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను చిత్రబృందం ఖండించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2027 మార్చి 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. షూటింగ్ కూడా అనుకున్న ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పోలీస్ పాత్రలో డార్లింగ్ నటిస్తుండటంతో ఈ క్యారెక్టర్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రభాస్ లుక్, మేకోవర్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో ‘స్పిరిట్’ను హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌లతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ‘స్పిరిట్’ 2027 మార్చి 5న థియేటర్లలోకి రానుందని మేకర్స్ స్పష్టం చేయడంతో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.






