చిరంజీవి సినిమాల మధ్య సంక్రాంతి పోటీ..? ‘విశ్వంభర’పై దర్శకుడి పోస్ట్ వైరల్

By manavaradhi.com

Published on:

Follow Us
Chiranjeevi VS Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాలు ఒకేసారి సంక్రాంతి బరిలోకి దిగనున్నాయా? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘కాకా’ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు ‘విశ్వంభర’ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గతంలో వార్తలు వచ్చినప్పటికీ.. విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శివుడికి సంబంధించిన ఓ ప్రవచన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దానికి ‘‘శ్వాస నాది, శాసనం నీది.. ఆశ నాది, పాశం నీది.. ఆత్మ నాది, ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా! ఇందుకేనా నిన్ను ‘విశ్వంభరుడు’ అని పిలిచేది?’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

‘విశ్వంభర’ విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో దర్శకుడు వశిష్ఠ ఈ పోస్ట్ చేయడంతో.. సినిమా రిలీజ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ పోస్ట్ విడుదల తేదీకి సంబంధించినదేనా? అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.

విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యమున్న ఫాంటసీ కథాంశంతో ‘విశ్వంభర’ తెరకెక్కింది. చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. నిర్మాణానంతర పనుల్లో జాప్యం కారణంగా ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

మరోవైపు ‘కాకా’ చిత్రబృందం మాత్రం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె పాత్రలో అనస్వర రాజన్ నటిస్తున్నారు.

‘కాకా’ ఇప్పటికే జనవరి 13న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో.. ‘విశ్వంభర’ కూడా అదే సంక్రాంతి సమయంలో వస్తుందా? లేదా విడుదల తేదీలో మార్పు ఉంటుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.

Leave a Comment