చిత్రం: ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి, కల్యాణ్ శంకర్, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫీ: అజీమ్ మహ్మద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్
విడుదల తేదీ: 11-09-2026
‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) చుట్టూ ఈ కథ సాగుతుంది. సినిమా దర్శకుడు కావాలనేది అతని కల. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే మధ్యతరగతి కుటుంబాల్లో సహజంగా ఉండే ‘ప్లాన్ బి’ ఆలోచనలో భాగంగా ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్తాడు.
లండన్ వెళ్లినా అతని మనసంతా సినిమాలపైనే ఉంటుంది. తాను చేరిన విశ్వవిద్యాలయంలోనే తెలుగు అమ్మాయి కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. తొలి పరిచయంలోనే ఇద్దరూ దగ్గరవుతారు. ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభిస్తారు.
వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఆదిత్య, కడలి మధ్య బంధం ఎక్కడి వరకు వెళ్లింది? జీవితంలో ఇంకా స్థిరపడని ఆదిత్య ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? పెళ్లి చేసుకోవాలన్న తల్లిదండ్రుల ఒత్తిడికి కడలి తలొగ్గిందా? వారి జీవితాల్లో ఎదురైన సంఘర్షణలు ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ నవతరం ఆధునిక జీవనశైలి, యువత మధ్య సంబంధాలు, వారి జీవితాల్లోని గందరగోళాలు, కుటుంబం మరియు సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.
దీనిని పూర్తిస్థాయి ప్రేమకథగా చెప్పడం కంటే.. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జీవిత ప్రయాణంగా చెప్పడం సరైనది. చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు యువకుల జీవితాలను దర్శకుడు తనదైన కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు తమ జీవితాలను, అనుభవాలను గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రధాన పాత్రలు తీసుకునే నిర్ణయాలు, వారి మనసులోని సంఘర్షణలతో ప్రతి ఒక్కరూ పూర్తిగా కనెక్ట్ అవ్వడం మాత్రం కష్టమే.
దర్శకుడు ఈ చిత్రాన్ని కేవలం ప్రేమకథగానో, సహజీవనం నేపథ్యంలో తెరకెక్కిన కథగానో కాకుండా.. ఓ జంట జీవితంలో ఎదురైన వాస్తవ పరిస్థితులుగా మలిచారు. అందుకే సాధారణ ప్రేమకథల్లో కనిపించే ఆసక్తికరమైన మలుపులు, బలమైన ఇంటర్వెల్ బ్యాంగ్, సుఖాంతమైన ముగింపు వంటి అంశాలు ఇందులో పెద్దగా కనిపించవు.
ప్రధాన జంట ప్రయాణంతో మమేకమై సినిమాను చూస్తేనే ఈ కథలోని భావోద్వేగాలను ఆస్వాదించగలం. అదే సమయంలో దీనిని సంప్రదాయ కథా కోణంలో చూడటం ప్రారంభిస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో సాగదీతగా అనిపిస్తుంది.
అయితే దర్శకుడు సినిమాలో ప్రస్తావించిన అంశాలు మాత్రం తక్కువేమీ కావు. సమాజంలోని కులపరమైన ఆలోచనల నుంచి అమ్మాయిలు శారీరకంగా, సామాజికంగా ఎదుర్కొనే సమస్యలు, అబ్బాయిలపై ఉండే కుటుంబ, సామాజిక ఒత్తిళ్ల వరకు పలు అంశాలను సినిమాలో స్పృశించారు. అయితే వాటిలో చాలా అంశాలను దర్శకుడు పైపైనే ప్రస్తావించి ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు. వాటి లోతుల్లోకి వెళ్లలేదు.
‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ప్రపంచం నుంచే ఈ సినిమా కథ మొదలవుతుంది. లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ కుటుంబం, మధ్యతరగతి జీవితంలోని కష్టాలను పరిచయం చేస్తూనే ఆదిత్య కథలోకి తీసుకెళ్తుంది. దర్శకుడు కావాలనుకునే ఆదిత్యను తండ్రి మందలించడం, మరోవైపు అతని స్నేహితులు ప్రోత్సహించడం వంటి సన్నివేశాలతో తొలి భాగం సరదాగా సాగుతుంది.
ఆదిత్య లండన్‌లో అడుగుపెట్టిన తర్వాత కథలో మరింత సందడి మొదలవుతుంది. నాయకానాయికల పరిచయం, తొలి రోజే ఒకే గదిని పంచుకోవడం, ఆ గదిని వారికి ఇచ్చిన స్నేహితుడు ఆశ్చర్యపోవడం వంటి సన్నివేశాలు, సంభాషణలు మంచి హాస్యాన్ని పంచుతాయి. ముఖ్యంగా స్వగ్రామంలో ఉన్న స్నేహితుడితో కథానాయకుడు మాట్లాడే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.
తొలి భాగంలో అమ్మాయిలకు సొంత ఇంటి నుంచే ఎదురయ్యే ఒత్తిళ్లను ప్రస్తావించిన దర్శకుడు, ద్వితీయార్ధంలో అబ్బాయిల 24 ఏళ్ల వయసు, అమ్మాయిల 24 ఏళ్ల వయసు ఒకేలా చూడబడదనే అంశంతో యువకుల సంఘర్షణను చూపించారు. ఈ కోణం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.
తొలి భాగంలో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండగా, ద్వితీయార్ధంలో భావోద్వేగాల మోతాదు పెరుగుతుంది. అయితే నాయకానాయికల ప్రేమ ప్రయాణం, కథానాయకుడు తన తల్లిదండ్రులు, స్నేహితుడితో జరిపే సంభాషణలు మినహా పెద్దగా మరో కథాంశం కనిపించదు. దీంతో కథ కొన్ని సందర్భాల్లో పలుచగా, అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.
‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ను కుటుంబ సమేతంగా చూసేలా రూపొందించినప్పటికీ, ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’లో పెద్దలకు మాత్రమే పరిమితమయ్యే అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ కూడా కథను పూర్తిగా ముగించకుండా అసంపూర్ణంగా వదిలేసిన భావన కలిగిస్తుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ‘సఖి’, ‘ఓకే బంగారం’ వంటి చిత్రాలను గుర్తు చేస్తాయి.
ఎవరెలా చేశారంటే..
ఆదిత్య, కడలి పాత్రల్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇద్దరి నటనలోనూ పరిణతి కనిపిస్తుంది. సహజంగానే అమాయకత్వం నిండిన పాత్రల్లో కనిపించే ఆనంద్ దేవరకొండ.. ఈ సినిమాలోనూ అదే తరహా పాత్రలో కనిపించాడు. ప్రతి సన్నివేశంలోనూ సహజమైన నటనను ప్రదర్శించాడు.
‘బేబీ’ తర్వాత మరింత గాఢత ఉన్న కడలి పాత్రలో వైష్ణవి చైతన్య ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆమె మరింత అందంగా కనిపించడంతో పాటు, భావోద్వేగ సన్నివేశాల్లోనూ మెప్పించింది. కథానాయకుడి తల్లిదండ్రులుగా శివాజీ, వాసుకి కీలక పాత్రలు పోషించారు. వారి పాత్రలకు సన్నివేశాలు పరిమితంగానే ఉన్నప్పటికీ, కథపై బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
కథానాయకుడి స్నేహితుడు సింజిత్ పాత్రలో దర్శకుడు కల్యాణ్ శంకర్ కనిపించారు. ఆయన పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ నవ్వులు పూయిస్తాయి. మనోజ్ పాత్రలో శ్రీనివాస్ గవిరెడ్డి కూడా తనదైన శైలిలో నవ్వించారు.
సాంకేతిక విభాగాలు
సాంకేతికంగా సినిమా మంచి స్థాయిలో ఉంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. లండన్ నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలను విజువల్‌గా అందంగా చూపించారు.
నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ కథను నడిపించిన తీరు, సన్నివేశాలను మలిచిన విధానం బాగున్నప్పటికీ.. సినిమాకు అవసరమైన వేగం మాత్రం అన్ని సందర్భాల్లో కనిపించదు.
కథను రెండు సెమిస్టర్లుగా చెప్పాలనే ప్రయత్నంలో కథను పూర్తిగా, బలంగా చెప్పలేకపోయారేమో అనిపిస్తుంది. అయితే ఆయన రాసిన సంభాషణలు మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
బలాలు
❤️ ప్రథమార్ధం
❤️ హాస్యం
❤️ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటన
❤️ సంభాషణలు
❤️ సాంకేతిక విలువలు
బలహీనతలు
💔 కొన్ని చోట్ల సాగదీత
💔 కథనం పలుచగా అనిపించడం
💔 కొన్ని అంశాలను లోతుగా చూపించకపోవడం
💔 అసంపూర్ణంగా అనిపించే ముగింపు
‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’.. వినూత్నమైన అంశంతో రూపొందిన యువత కథ. ఆధునిక జీవనశైలి, సంబంధాలు, కుటుంబం-సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను దర్శకుడు తనదైన కోణంలో చూపించారు. హాస్యం, నటీనటుల సహజమైన నటన ఆకట్టుకున్నప్పటికీ.. కథనం అక్కడక్కడా నెమ్మదించడం, కథ అసంపూర్ణంగా అనిపించడం ప్రతికూల అంశాలుగా నిలుస్తాయి.
రేటింగ్: ⭐⭐⭐/5






