హేమంత్‌ తొలగించిన కాలును భద్రపరచాలి.. అనంతపురం ఆసుపత్రి, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

By manavaradhi.com

Published on:

Follow Us

AP HC on Raptadu Victim Leg : అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై పోలీసులు జరిపిన కాల్పుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల కారణంగా తొలగించిన హేమంత్‌ కాలును భద్రపరచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు పోలీసులను ఆదేశించింది.

తొలగించిన కాలును భద్రపరచాలని కోరుతూ పిటిషనర్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో విద్యాశాఖ అధికారులను ప్రతివాదులుగా చేర్చాలంటూ పిటిషనర్‌ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌ మోకాళ్ల కింది భాగంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనపై పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ, వారిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపికృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Leave a Comment