Gall Bladder : గాల్ బ్లాడర్ ఆరోగ్యం కోసం! ఇలా చేయండి చాలు

By manavaradhi.com

Published on:

Follow Us

పొట్టకు కుడివైపున, లివర్ కు కింది బాగంలో పిత్తాశయం ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ బైల్ అనే రసాయనాన్ని తనలో నింపుకుని ఉంటుంది. శరీరంలో జీర్ణమైన ఆహారంలో ఉండే విటమిన్స్ ను శరీరానికి అందించడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. మనం ఆహారం తినే సమయంలోనే పిత్తాశయానికి ఈ రసాన్ని విడుదల చేయాల్సిందిగా శరీరం నుంచి సిగ్నల్స్ అందుతాయి. ఫలితంగా ఆహారం శరీరంలోకి ప్రవేశించిన వెంటనే పిత్తాశయం తన పని తాను చేస్తుంది.

శరీరంలో జీర్ణవ్యవస్థలో ఇంత కీలకమైన పిత్తాశయానికి ఏర్పడే ప్రధాన సమస్యల్లో ఒకటి గాల్ స్టోన్స్. ఇవి శరీరంలో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందిలో ఇది ఒక్కటే ఏర్పడితే, మరికొందరిలో ఎక్కువ రాళ్ళు ఏర్పడే ప్రమాదమూ ఉంది. పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళు ఎక్కువగా కొలస్ట్రాల్ గట్టిగా తయారు కావడం వల్ల ఏర్పడేవే. గాల్ స్టోన్స్ అధికంగా పెరగడం వల్ల పిత్తాశయంలో ఉండే రసాయనాలు బయటకు వస్తాయి. ఈ సమయంలో వాపు లాంటి సమస్య రావచ్చు. దీన్నే కొలేసిస్టిసిస్ గా వ్యవహరిస్తారు. దీని వల్ల వాంతులు, కడుపునొప్పి, వికారం లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. బ్యాక్టీరియా కూడా దీని కారణం కావచ్చు.

పిత్తా శయ సమస్యలు స్త్రీల విషయంలో అనేక ఇతర ఇబ్బందులు సృష్టిస్తాయి. గర్భం ధరించిన సమయంలో ఈ సమస్యలకు ఆస్కారం ఎక్కువే. అలాగే కుటుంబంలో ఎవరికైనా గతంలో పిత్తాశయ సమస్యలు ఉంటే కుటుంబంలోని వారికి ఇవి వచ్చే ఆస్కారం ఎక్కువే. అందుకే కుటుంబంలో ఎవరికైనా గతంలో ఈ సమస్య ఉండి ఉంటే, పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒబేసిటి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో కూడా ఈ సమస్యలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య ఏర్పడవచ్చు. అందుకే ఒబేసిటీ ఉన్న వారు మరింత జాగ్రత్త వహించాలి. త్వరగా బరువు తగ్గించుకోవడం లేదా హఠాత్తుగా బరువు పెరగడం లాంటివి కూడా పిత్తాశయం మీద ప్రభావాన్ని చూపుతాయి. అందుకే బరువు పెరిగినా, తగ్గినా ఓ పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి.

ఆహారం విషయంలో జాగ్రత్తలు మాత్రం చాలా అవసరం. మీరేం తింటున్నారనేది కూడా ఈ సమస్య విషయంలో కీలక ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యుని సూచనల మేరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుని తీసుకోవడం ఉత్తమం. మనం తెలియకుండా తీసుకునే మందులు సైతం పిత్తాశయం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఏ మందులు పడితే వాటిని తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. అందుకే ఔషధాల విషయంలో వైద్యుల సలహా తప్పనిసరి.

పిత్తాశయానికి వచ్చే ఏ సమస్యకైనా నొప్పి ఏ ప్రదేశంలో ఉందనే దాన్ని బట్టి, సమస్య ఏమిటనే విషయాన్ని గుర్తించి, చికిత్స అందిస్తారు. సాధారణంగా పొత్తి కడుపు మొత్తం నొప్పి ఉంటే రాళ్ళు ఏర్పడాయనే విషయాన్ని గమనించవచ్చు. సాధారణంగా మన శరీరంలో ఉండే తెల్లరక్త కణాలు… మనలోకి చొరబడే ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. అందు వల్ల రక్త పరీక్ష ద్వారా సమస్యను గుర్తించవచ్చు. అలాగే అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా కూడా సమస్యలను గుర్తించే మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

కొన్ని సమయాల్లో పొట్టకు ఎక్స్ రే కూడా ఉపయోగపడుతుంది.40 ఏళ్ళ తర్వాత పిత్తాశయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది గనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో శ్రద్ద పాటించడం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం చేస్తూ ఉండాలి. ఆహారాన్ని అధికంగా తీసుకోవడం కూడా ప్రమాదమే. అందుకే సరైన విధంగా ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మన తినే ఆహారం, జాగ్రత్తలే పిత్తాశయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే ఆహారం విషయంలో శ్రద్ద చూపడం, సమస్య వచ్చినప్పుడు వైద్యుని సలహాలు పాటించడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, పిత్తాశయం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించి.. సంరక్షించుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

Leave a Comment