భక్తుల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతిచెందింది.
కోటప్పకొండ ఆలయం చరిత్ర
ఈ ఆలయాన్ని క్రీ.శ 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు భూరి విరాళాలు ఇచ్చారని శాసనాలు తెలుపుతున్నాయి. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసిన మూడు శిఖరాలు కనబడుతుంటాయి. అందుకే దీనికి త్రికూటాచలమనే పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.
పురాణ కథనం ప్రకారం
శివుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత బాలదక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సును ఆచరిస్తూంటాడు. ఆ సమయంలో బ్రహ్మ దేవతలందరితోను కలిసి దక్షిణామూర్తిని సందరిస్తాడు. స్వామి వారిని మాకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరు కూడా త్రికూటాచలానికి వస్తారు అప్పుడు శివుడు త్రికూట కొండపైనే వెలసి వారందరికి జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు. ఆ ప్రదేశంలో ఉన్న గుడికే పాత కోటప్పగుడి అని పేరు. ఆలయం లోపలి లింగం కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది. గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరమని, పక్కన ఉన్న శిఖరాన్ని విష్ణు శిఖరమని అంటారు.
దక్ష యజ్ఞం సమయంలో హవిస్సును స్వీకరించిన పాపం పోవడానికి విష్ణువు ఈ శిఖరం పై తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో నేల మీద పొడుస్తాడు. అలా పొడిచినప్పుడు ఏర్పడ్డ రంధ్రాల నుంచి వచ్చిన జలాన్ని స్వీకరించి స్నానమాచరిస్తే సకల పాపాలు తొలుగుతాయని చెప్తాడు. విష్ణువు శివుడు చెప్పిన విధంగా చేసి తన పాపాలను పోగొట్టుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ వెలసిన శివున్ని పాపవినాశనేశ్వరుడనే పేరుంది.
రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరాలపై స్వయంభువుగా లింగాలు వెలిశాయి. కానీ బ్రహ్మ శిఖరం పై ఏమి లేకపోవడంతో బాధపడిన బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసి లింగావిర్భవం అయ్యేటట్లు చేస్తాడు.ఈ ప్రదేశానికి తూర్పున మునిమంద/ ఎల్లమంద అనే పేర్లు గల చిన్న పల్లెటూరు ఉంది. ముందుగా బ్రహ్మదిదేవతలంతా ఈ ప్రదేశంలో ఉన్నారని అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ప్రశస్తి.బ్రహ్మ శిఖరం మీద ఉన్న లింగానికే కొత్త కోటప్పకొండ అని పేరు.