Bed Basics : రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదా.. బెడ్ రూమ్ ని ఇలా అమర్చుకోండి

By manavaradhi.com

Published on:

Follow Us
Bed Basics

రోజురోజుకు జీవన విధానంలో మార్పుల‌తో మనలో చాలామంది రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడంతో దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై పడుతుంది. ప్రతి ఒక్కరూ పడక గదిని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా రూమ్ క్లైమేట్.. చక్కగా ఉంటే హాయిగా పడుకోవడానికి బాగా సాయపడుతుంది. మీరు బెడ్‌ రూమ్‌లో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా, నిద్ర పోవడానికి సాయపడుతుంది.

ప్రతి మనిషికి రోజూ కనీసం 8గంటల నిద్ర అవసరం. నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిద్రలేమి కారణంగా .. స్థూలకాయం సహా రక్తపోటు , గుండె సమస్యలు, మధుమేహ, అజీర్ణం, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి శారీరక, మానసిక ఒత్తిడికి తగిన విధంగా తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. పగటి నిద్ర కంటే రాత్రి పూట తీసుకునే విశ్రాంతి చాలా ముఖ్యమైనది. ఐతే పడుకోవడం కోసం పడక గదిలో కొన్ని సూత్రాలు పాటిస్తే కంటి నిండా సుఖంగా నిద్ర దొరుకుతుంది.

పడక గదిలో అన్నింటికంటే ముఖ్యమైనవి మంచం, పరుపు.ఈ రెండింటిని సరిగ్గా ఎంపిక చేసుకోవాలి. పడుకునే పరుపును 90 శాతం ఆర్గానిక్ మెటీరియల్ తో తయారుచేసిన వాటిని ఎంచుకోవడం మేలు. ఎలాంటి రసాయన వస్తువులు వాడని వాటిని ఎంపిక చేసుకోవాలి. వీలైనంత వరకు యాంటీ మైక్రోబయల్ పరుపులను ఎంపిక చేసుకుంటే మంచిది. పడకగదిని వీలున్నంత వరకు అతి శీతలంగా కాకుండా..అతి వేడిగా కాకుండా సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి.

పడక గదిలో దుమ్ము, ధూళి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కిటికీల ద్వారా దుమ్ము ధూళి రాకుండా కర్టెన్లు కట్టి ఉంచుకోవాలి. అలాగే కప్పుకునే దుప్పట్లు, రగ్గుల్లో ఎక్కువగా దుమ్ము చేరుతుంది. కాబట్టి వాటిని వారానికి ఓసారి శుభ్రపరుచుకోవాలి. అలాగే బెడ్ రూమ్ లో నేల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైతే కార్పెట్లు వాడుకుంటే మంచిది. ఇవి అలర్జీలు రాకుండా నిరోధిస్తాయి. అంతే కాదు శుభ్రం చేయడం కూడా సులువవుతుంది. పడకగదిలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తీసుకుని వెళ్లకుండా చూసుకోవడం చాలా ముఖ్య .

పడుకునేందుకు బెడ్ ఎక్కే 2 గంటల ముందు.. టీవీ, స్మార్ట్ ఫోన్ , ట్యాబ్లెట్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. వాటిలో ఉండే బ్లూ లైట్ నిద్ర వచ్చేందుకు ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీనివల్ల నిద్ర పట్టక నిద్రలేమి సమస్య కు దారితీస్తుంది. కాబట్టి పడుకునే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు చూడడానికి స్వస్తి పలకాలి. పడక గదిలో వీలైనంత వరకు డిమ్ లైట్లను ఉపయోగించాలి. లైటింగ్ తక్కువగా ఉంటే నిద్ర సరిగ్గా పడుతుంది. అలాగే కిటికీల నుంచి బయట నుంచి వెలుతురు పడకుండా చూసుకోవాలి. వెలుతురు రాని కర్టెన్లను ఉపయోగించుకుంటే మంచిది. బయటి నుంచి వచ్చే వెలుతురు వల్ల కూడా శరీరం అయోమయానికి గురవుతుంది. అంతేకాదు మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది.

జంతు ప్రేమికులు ప్రత్యేకంగా ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. పడక గదిలోకి ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకురావడం మంచిది కాదు. ఎందుకంటే వాటి వల్ల కొన్ని రకాల ఎలర్జీలు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వాటికి ప్రత్యేకంగా బెడ్ లను కేటాయించాలి. అలాగే పెంపుడు జంతువులు .. పడకపై ఉండడాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఒకవేళ అవి పడకగదిలోకి వచ్చినా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలి. పడక గదిలో వీలైనంత వరకు ఎలాంటి ధ్వనులు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీటి వల్ల నిద్ర చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పట్టణప్రాంతాల్లో నివసించే వారు .. బయట ట్రాఫిక్, చుట్టు పక్కల ఇళ్ల నుంచి వచ్చే శబ్దాలను నిరోధించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.అలాగే ఫ్యాన్లు, ఏసీల ద్వారా వచ్చే శబ్దాలను నిరోధించేందుకు పాత వాటి స్థానంలో కొత్తవి ఉపయోగించుకోవాలి.

పడక గది దుర్వాసన వస్తూ చిందర వందరగా వుంటే నిద్ర పట్టకపోగా చికాకుతో నిద్ర మరింత దూరం అవుతుంది. కాబట్టి బెడ్ రూమ్ ను ఎల్లప్పుడుశుభ్రంగా ఉంచుకోవాలి. దీని వల్ల మానసికింగా, శారీరకంగానూ హ్యాపీగా ఉంటారు. నిద్రించే విషయంలో అన్ని పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

Leave a Comment