Kalki 2: ‘కల్కి 2’ రిలీజ్‌ ఎప్పుడంటే..?

By manavaradhi.com

Published on:

Follow Us
Kalki 2 Shooting Update

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. దీనికి సీక్వెల్‌ ఉన్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండో పార్ట్‌లోనూ కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. అయితే మిగతా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారు. రిలీజ్‌ ఎప్పుడు చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై నాగ్‌ అశ్విన్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.

‘‘కల్కి2 షూటింగ్‌ చాలా అంశాలతో ముడిపడిఉంది. అందులో నటీనటులందరికీ కాంబినేషన్‌ సన్నివేశాలు ఉన్నాయి. అందుకే వారందరికీ కుదిరినప్పుడే చిత్రీకరించాలి. యాక్షన్‌ సన్నివేశాలు కూడా భారీగా ఉంటాయి. వీటిని చిత్రీకరించడానికి చాలా సమయం పడుతుంది. దీని రిలీజ్‌పై నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు. ప్రస్తుతం కల్కిలో నటించిన స్టార్స్ అందరూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో మేం దీని షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నాం. షూటింగ్‌కు తక్కువ సమయం పట్టినప్పటికీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎక్కువ సమయం పడుతుంది. మరో రెండు సంవత్సరాల్లో దీన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తా’’ అన్నారు.

గతంలో నిర్మాత అశ్వనీదత్‌ ఓ ఇంటర్వ్యూలో ‘కల్కి 2’గురించి మాట్లాడుతూ.. ‘‘రెండో పార్ట్‌ మొత్తం కమల్‌హాసనే ఉంటారు. ప్రభాస్‌ , కమల్‌ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్‌. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది’’ దీంతో దీనిపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఇక ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’, ‘ఫౌజీ’లతో బిజీగా ఉన్నారు. ఈ నెలలో రాజాసాబ్‌ షూటింగ్‌ పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత ‘ఫౌజీ’ సెట్‌లోకి అడుగుపెడతారు. దీనితో పాటు సందీప్‌ వంగా ‘స్పిరిట్‌’ కూడా లైన్‌లో ఉంది. అక్టోబర్‌లో దీని షూటింగ్‌ ప్రారంభించాలని దర్శకుడు భావిస్తున్నారు. వీటి తర్వాత ‘కల్కి 2’లో జాయిన్‌ అవుతారు.

Leave a Comment