Kalaimamani | స్టార్ నటి సాయి పల్లవి మరో అరుదైన ఘనతను అందుకుంది. కళారంగంలో విశేష కృషి చేసిన వారికి తమిళనాడు ప్రభుత్వం అందించే ‘కలైమామణి’ అవార్డును సాయి పల్లవి అందుకుంది. తమిళనాడులోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డును 2021 సంవత్సరానికి గానూ సాయి పల్లవి అందుకోంది.
తన సహజ నటన, డ్యాన్స్, ఫిట్‌నెస్ మరియు భావాలను చక్కగా చూపే ప్రతిభతో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించిన సాయిపల్లవికి, తాజా ఘనతగా తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కలైమామణి అవార్డు అందింది. శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ చేతులమీదుగా ఈ అవార్డును సాయిపల్లవి స్వీకరించారు. ఈ అవార్డు ఆమె కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలుస్తుంది. ఈ గౌరవాన్ని 2021, 2022, 2023 సంవత్సరాలకుగాను మొత్తం 90 మంది కళాకారులు పొందారు. ఇందులో ఎస్.జె. సూర్య, విక్రమ్ ప్రభు వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. అభిమానులు మరియు సినీ రంగంలోని వారు ఆమెకు అభినందనలు తెలిపారు, ఇది ఆమె ప్రతిభకు అందిన మరొక గుర్తింపు అని చెప్పవచ్చు.










