Stomach Gas : కడుపులో గ్యాస్ పడితే పొరపాటున కూడా ఇవి తినకండి

By manavaradhi.com

Updated on:

Follow Us

గ్యాస్‌ట్రబుల్‌కు ముఖ్య కారణాలు ఏంటి..?

కడుపులో గ్యాస్, ఉబ్బరం అనే సమస్య మనిషిని చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనినే గ్యాస్‌ట్రబుల్‌ అంటారు. కడుపులో గ్యాస్ అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఒక సాదారణ విషయం. కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఇది తలెత్తుతుంది. జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో ఇది ప్రధానమైంది.

మారిన జీవనశైలి నేపథ్యంలో వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడం, ఆందోళన, రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోవడం, కదలకుండా ఎక్కువ సేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం, మసాలా ధినుసులు ఎక్కువగా తీసుకోవడం గ్యాస్‌ట్రబుల్‌కు ముఖ్య కారణాలు.

కడుపులో మంట..అజీర్తి..గ్యాస్ నొప్పి లాంటివి రావడం జరుగుతుంది. కొన్ని సార్లు మనం తీసుకొనే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారంనకు దారితీస్తుంది..గ్యాస్ నొప్పిని కొన్ని సార్లు గుండె నొప్పిగా భావించవచ్చు. అది ఉదర ప్రాంతంలో ఏర్పడే గ్యాస్ కారణంగా అన్పిస్తుంది.

చిన్న ప్రేగులలో జీర్ణము చెయ్యబడని కార్బోహైడ్రేట్ల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది. పలు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తిన్నప్పుడు మాత్రమే వస్తుంది. మనం తినే అన్ని రకాల ఆహారాల వల్ల గ్యాస్, అసిడిటీ రావు. కేవలం కొన్నింటి వల్లే ఆ సమస్య వస్తుంటుంది. వాటకి దూరంగా ఉండడం ద్వార గ్యాస్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

కడుపులో గ్యాస్ ను కలిగించే ఆహారాలు ఏంటి…?

ఈ మద్య మనం తింటున్న ఆహారంలో ఎక్కువగా గ్యాస్ కలిగించే ఉంటున్నాయి. కాబట్టి మనం తీసుకోనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాకొలెట్‌లలో అధికంగా ఉండే కెఫీన్, థియోబ్రొమైన్, ఫ్యాట్ పదార్థాలు అసిడిటీని కలిగిస్తాయి. ఇక వీటిలో అధికంగా ఉండే కొకొవా గ్యాస్ వచ్చేందుకు కారణమవుతుంది. కనుక చాకొలెట్‌ను తినడం తగ్గిస్తే మంచిది. లేదంటే అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సోడా, ఇతర కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో కెఫీన్ ఉంటుంది. దీంతోపాటు వీటిలో ఉండే ఎయిర్ బబుల్స్ జీర్ణాశయంలోకి వెళ్లి దాన్ని సాగదీసే పనిచేస్తాయి. అందువల్ల పొట్ట ఉబ్బుతుంది. ఫలితంగా గ్యాస్, అసిడిటీ వస్తాయి. కనుక వీటిని తీసుకోవడం కూడా మానేయాల్సి ఉంటుంది.

రోజుకు ఒకటి, రెండు కప్పుల కాఫీ లేదా టీ తాగితే ఫరవాలేదు. కానీ అదే పనిగా వీటిని తాగితే వీటిలో ఉండే కెఫీన్ జీర్ణాశయం గోడలను నాశనం చేస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. దీంతోపాటు గ్యాస్ట్రిక్ యాసిడ్‌లను ఇవి ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. అది మంచిది కాదు. కాబట్టి రోజూ కాఫీ, టీలను తక్కువగా తీసుకుంటే మంచిది.

కారం, మసాలాలు సహజంగానే అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక ఇవి ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ యాసిడ్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా ఈ ఆహారాలను తీసుకుంటూ పోతే అది అల్సర్లకు దారి తీయవచ్చు. కనుక నిత్యం తీసుకునే ఆహారాల్లో కారం, మసాలాలను బాగా తగ్గించాలి. బీర్, వైన్‌లలో ఉండే పలు పదార్థాలు జీర్ణాశయం లోపల గ్యాస్ట్రిక్ యాసిడ్లను పెంచుతాయి. దీంతో గ్యాస్, అసిడిటీ వస్తాయి. కనుక వీటిని తీసుకోవడం తగ్గించాలి.

కడుపులో గ్యాస్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?

అత్యధిక ఫైబర్ ఆహారాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాలు జీర్ణం కాకపోవటం వలన గ్యాస్ ఏర్పడుతుంది. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి, విషాలను తొలగించటానికి సహాయపడుతుంది. అయితే ఫైబర్ గ్యాస్ ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది.

కొవ్వు ఎక్కువగా ఉండే వేపుళ్లు, మాంసాహారం, ఆయిల్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ మన జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఉంటాయి. ఎందుకంటే అవి ఒక పట్టాన జీర్ణం కావు. దీని వల్ల జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ యాసిడ్లు పెరుగుతాయి. ఫలితంగా గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. కాబట్టి కొవ్వు ఉన్న ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది.

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్, నిమ్మ, టమాటా, ఇతర బెర్రీలు మన ఆరోగ్యానికి మంచి చేసేవే. కాకపోతే వీటిని పరగడుపున తినరాదు. తింటే జీర్ణాశయంలో యాసిడ్లు పెరుగుతాయి. ఫలితంగా గ్యాస్, అసిడిటీ వస్తాయి. కనుక వీటిని పరగడుపున తినకపోవడమే ఉత్తమం.

మసాలాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను సేవించడం వల్ల, జంక్‌ ఫుడ్‌ అధికంగా తినేవారిలోనూ గ్యాస్‌ ట్రబుల్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది. అలాగే క్రమ పద్ధతి పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారాన్ని తినడం వల్ల ఈ సమస్య ఉద్భవిస్తుంటుంది. హితముగా, మితముగా సమయానికి సరిగ్గా ఆహారం తీసుకునే వారిలో ఈ సమస్య పెద్దగా కనిపిచందని వైద్యనిపుణులు అంటున్నారు.

అల్పాహారమైనా, భోజనమైనా ప్రతిరోజూ నియమిత వేళల్లోనే స్వీకరించాలి. రంగులు, కృత్రిమ తీపి పదార్థాలు, కృత్రిమ సుగంధ ద్రవ్యాలు కూడా ఈ పరిస్థితిని తేవచ్చు. నిల్వ వుండేందుకు కలిపే యాసిడ్లు కూడా చెడు చేస్తాయి. కాబట్టి మనం తీసుకోనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుందాం.. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

Leave a Comment