‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాని జులై 24న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం శనివారం ఉదయం ప్రకటించింది. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ నెల 12న బాక్సాఫీసు ముందుకు రావాల్సి ఉండగా మరోసారి పోస్ట్‌పోన్ అయింది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో రానుంది.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం తదితర కారణాలతో ఈ మూవీ షూటింగ్ వాయిదా ఆలస్యమవుతూ వచ్చింది. క్రిష్ కొంతభాగం తెరకెక్కించిన తర్వాత నిర్మాత ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పవన్ ఇందులో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేయడం విశేషం. కొన్నాళ్ల పాటు సినిమా సెట్స్‌పైనే ఉండటంతో నిర్మాతపై ఆర్థికంగా అదనపు భారం పడిందని భావించిన పవన్.తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. ‘అసుర హననం’ పాటలోని ఫైట్స్ అన్నీ పవన్ కల్యాణే డిజైన్ చేశారని జ్యోతికృష్ణ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారు.