Pawan Kalyan: కనీసం ప్రెస్‌మీట్‌కైనా అనుమతిస్తారా? – పవన్ కళ్యాణ్

By manavaradhi.com

Published on:

Follow Us
Pawan Kalyan Press Meet

Pawan Kalyan Press Meet: తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొన్నారు. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నదని చెప్పారు. తెలంగాణ సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

‘‘అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. ఆ లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను అని పవన్ ఎక్స్ వేదికగా తెలిపారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పోలీసుల అనుమతుల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పవన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించనున్న మీడియా సమావేశానికి అయినా అనుమతి ఇస్తారా లేదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో మంగళవారం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటానని తెలిపారు. ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు అయినా తెలంగాణ పోలీసు శాఖ అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నానంటూ పవన్ సెటైరికల్ కామెంట్ చేశారు. ‘ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా? లేదా? చూద్దాం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Leave a Comment