Kidney Health: కిడ్నీ సమస్యలు – ఆహారపు అలవాట్లు(పథ్యం) ఉండాల్సిందేనా..!

By manavaradhi.com

Published on:

Follow Us
Kidney Health

కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వారు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారు పత్యం విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ భయాల్లో నిజాలకంటే అపోహలే ఎక్కువగా ఉంటాయి. ఏది తినాలి, ఏది తినకూడదు లాంటి ప్రశ్నలతో సతమతమై పోతుంటారు. ఏది తినడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటే ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు.

నిజానికి క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, పోషకాహారం తీసుకుంటూ బరువు అదుపులో పెట్టుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు ఆరోగ్యాన్ని అనేక రకాలుగా కాపాడుతుంటాయి. వీటిలో చేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం తగినన్ని నీళ్లు తాగడం కూడా. రోజుకు కనీసం 4-6 లీటర్ల నీళ్లు తాగాలి. కానీ మనలో చాలా మంది ఇంత మొత్తంలో నీళ్లు తాగరని చెబితే ఆశ్చర్యం ఏమీ లేదు. అందరూ ఒకటి రెండు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగరు. ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగితే కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇలా ఒత్తిడి పెరిగితే కిడ్నీల్లో సమస్యలు రావచ్చు.

కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టి బయటికి పంపేసే పని చేస్తాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో మలినాలు పేరుకొని పోయి విషతుల్యమవుతుంది. ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు. ప్రస్తుతం వైద్యపరిజ్ఞానం పెరిగాక… కిడ్నీ ఇబ్బందులు కొంతలో కొంత అదుపు అవుతున్నాయి. ఆ తర్వాత అసలు సమస్య మొదలౌతుంది. కిడ్నీ పేషెంట్లు చాలా పథ్యం పాటించాల్సి ఉంటుందని అనుకుంటూ ఉంటారు. నిజానికి అంత ఎక్కువ పథ్యమేమీ అవసరం లేదు. డయాలసిస్ చేయించుకుంటున్నవారు ఎక్కువగా ద్రవాహారం తీసుకోకూడదని అనుకుంటారు. కానీ నెలలో ఒకరోజు మొత్తం ఎంత మొత్తంలో మూత్రం విసర్జితమవుతుందో దానికి సమాన స్థాయిలో ద్రవాహారం తీసుకోవచ్చు.

చక్కెర, బెల్లం, స్వీట్ల వంటి తీపి పదార్థాలు తక్కువగా తినాలి. బియ్యం, గోధుమల వంటి తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే… సంక్లిష్ట పిండి పదార్థాలతో కూడిన తృణ ధాన్యాలు ఆలస్యంగా జీర్ణమవుతాయి. శక్తి కూడా నెమ్మదిగా విడుదల కావటం వల్ల దాన్ని శరీరం వెంటనే వినియోగించుకుంటుంది. చక్కెర, స్వీట్ల వంటి తీపి పదార్థాలు తినటం వల్ల ఒక్కసారిగా శక్తి విడుదల అవుతుంది. దాన్ని శరీరం వెంటనే ఖర్చు పెట్టుకోలేదు. అప్పుడది కొవ్వు రూపంలోకి మారి, నిల్వ ఉండిపోతుంది. దీంతో బరువు పెరగటం, స్థూలకాయం రావటం జరుగుతాయి. ఇది కిడ్నీలకు మంచిది కాదు.

మాంసాహారం తగ్గించాలి. కూరగాయలు ఎక్కువగా తినాలి. ఎందుకంటే కిడ్నీ జబ్బు బాధితుల్లో ప్రోటీన్ల నియంత్రణ చాలా కీలకం. కూరగాయల కన్నా మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు ఎక్కువ ప్రమాదకరం. ఈ ప్రోటీన్లు జీర్ణమయ్యాక మిగిలిపోయే పదార్థాలను బయటికి పంపిచేందుకు మూత్రపిండాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అదే కూరగాయల నుంచి లభించే ప్రోటీన్లతో అంత భారం ఉండదు. డయాలసిస్‌ చేయించుకునే వారికి ప్రోటీన్ల అవసరం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారికి ప్రోటీన్ల నియంత్రణ పనికిరాదు.

వెన్న, నెయ్యి వంటివి తక్కువగా తినాలి. ఆలివ్‌ నూనె, చేప నూనె, అవిసె నూనె ఎక్కువగా తినాలి. ఎందుకంటే… కిడ్నీ జబ్బు గలవారిలో, మధుమేహుల్లో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది కూడా. అందువల్ల వీళ్లు వెన్న, నెయ్యి వంటి సంతృప్త కొవ్వులను బాగా తగ్గించాలి. పాలీ, ఒమేగా-3 అసంతృప్త కొవ్వులు గల ఆలివ్‌ నూనె వంటివి తింటే మంచిది. మాంసాహారులైతే చేపనూనె తీసుకోవచ్చు.

అరటి, పుచ్చ, నారింజ, కమలా, బత్తాయి పండ్ల వంటివి పరిమితంగా తినాలి. ఎందుకంటే… వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి తగ్గించి తినాలి. జీఎఫ్‌ఆర్‌ తగ్గిపోయినపుడు ఒంట్లో అధికంగా ఉన్న పొటాషియంను మూత్రపిండాలు సరిగా బయటకు పంపించలేవు. దాదాపు అన్ని కూరగాయల్లోనూ పొటాషియం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వాటిని ముక్కలుగా తరిగిన తర్వాత గంటసేపు నీటిలో నానేసి ఉంచిన తర్వాతే వాటిని వండాలి. అలాగే బేకరి పదార్థాల్లో ఉప్పుతో పాటు పోటాషియం ఎక్కువగా ఉంటుంది గనకు వాటికి దూరంగా ఉండాలి.

పాలు, పెరుగు వంటి పాల పదార్థాలు పరిమితంగానే తీసుకోవాలి. ఎందుకంటే… పాలు, పెరుగు వంటి వాటితో క్యాల్షియం లభిస్తుంది కానీ దాంతో పాటే ఫాస్ఫరస్‌ కూడా ఎక్కువగా లభించే అవకాశముంది. అందువల్ల వెన్న తీసిన పాలు, పెరుగు తీసుకోవాలి. అదీ పరిమితంగానే వాడుకోవాలి. పల్చటి మజ్జిగ తీసుకుంటే అంత ప్రమాదమేమీ ఉండదు. అలాగే కొలెస్ట్రాలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే గుడ్డులో పచ్చసొన లాంటి వాటికి దూరంగా ఉండాలి.

నీరు తాగే మోతాదు మరీ ఎక్కువ, తక్కువ కాకూడద. అదే విధంగా కాఫీ, టీల వంటివి ఎక్కువగా తాగరాదు. మూత్రం ఎంత మోతాదులో వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని దానికి తగిన విధంగా నీరు తీసుకోవాలి. కెఫిన్ మూలంగా ఒంట్లో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి. అదే విధంగా ఇన్ స్టంట్ కాఫీలో పొటాషియం మోతాదు ఎక్కువ. అందుకే టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

ఆగ్జలైట్స్ ఎక్కువగా ఉండే చింతపండు తక్కువగా తినాలి. చింత పండు బదులు నిమ్మరసం పరిమితంగా వాడుకోవచ్చు. పొగ తాగే అలవాటు ఉన్న వారు కచ్చితంగా మానెయ్యాలి. అదే విదంగా నేరుగా కిడ్నీలను దెబ్బతీసే మద్యానికి దూరంగా ఉండాలి. ఆల్కలాయిడ్లు, పొటాషియం ఎక్కువ ఉండే వక్కపొడి మంచిది కాదు. పాస్ఫేట్ అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి.

Leave a Comment