కడుపులో నుంచి ఛాతీ, గొంతు వరకు మంటగా ఉంటే దాన్నే ఎసిడిటీ లేదా హార్ట్ బర్న్ అంటారు. హార్ట్ బర్న్ రావడానికి కొన్ని ఆహార పదార్థాలు కారణమైతే.. అది రాకుండా ఉండడానికీ కొన్ని ఆహార పదార్దాలు ఉన్నాయి. అంటే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ దరి చేరే అవకాశం లేదు.
సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు కొన్ని ఆమ్లాలు శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోనూ కొన్ని ఆమ్ల లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైతే కడుపు నుంచి ఎసోఫేజల్ వాయువులు రివర్స్ గా కడుపులో నుంచి ఛాతీ వరకు ఎగిసిపడతాయో దాన్నే యాసిడ్ రిఫ్లక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ గా వ్యవహరిస్తారు. ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. ఏం తినాలని అనిపించదు. ఓ వైపు పొట్ట ఉబ్బరంగా ఉన్నట్లు ఉంటుంది… మరోవైపు ఆకలి వేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కడుపులో ఉన్న లోవర్ ఈసోఫేజల్ స్పింక్టర్ లోపలికి ఆహారాన్ని పంపేందుకు ఉపయోగపడుతుంది. ఆహారం లోపలికి వెళ్లగానే మూసుకుపోతుంది. కానీ యాసిడ్ రిఫ్లెక్షన్ ఉన్న వారిలో ఇది మూసుకోవడం జరగదు. తద్వారా కడుపులోని ఆమ్లాలు బయటకు రావడంతో ఛాతీలో మంట కలుగుతుంది.
ఈ సమస్య అందరిలోనూ సాధారణంగా ఉండే సమస్యే. ప్రపంచవ్యాప్తంగా ఇది 60 శాతం మందికి ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఐతే 20 నుంచి 30 శాతం మందికి మాత్రం ఇది తీవ్రమైన సమస్యగా ఉందని తెలుస్తోంది…కడుపుబ్బరానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. అంటే ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఎసిడిటీ సమస్య అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే టీ, కాఫీ, శీతలపానీయాలు, చాక్లెట్లు, ఉల్లిపాయలు, పులుపు పదార్థాలు, టమోటాలతోపాటు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి.
తిన్న వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. దీంతోపాటు ఆమ్లత్వం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే సమస్య తగ్గుతుంది. మరి అలాంటి ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఓట్స్.. దీంతో చేసిన ఆహారం కడుపులో యాసిడ్స్ అధికంగా ఉత్పత్తి కాకుండా చూస్తుంది. దీనిలో ఉన్న ఫైబర్ శరీరానికి మేలు చేస్తుంది. అందుకే ఓట్స్ తో చేసిన అల్పాహారం ఉదయం పూట తీసుకోవడం మంచిది.
ఊదారంగులో ఉన్న క్యాబేజీ కూడా ఎసిడిటీని తగ్గిస్తాయి. కాలే ఆకు కూరలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని సలాడ్ లా తీసుకోవచ్చు. ఐతే టమోటా, ఉల్లిపాయతో గార్నిష్ చేసుకోకుండా సలాడ్ తయారు చేసుకోవాలి. ఇక ఊదా రంగు క్యాబేజీ.. శరీరంలోని పీహెచ్ శాతాన్ని క్రమబద్దీకరించి జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. దీనితోపాటు బ్రకోలీ, పచ్చని చిక్కుడులు, కాలిఫ్లవర్ తీసుకోవడం కూడా మంచిదే. వీటిలో ఆమ్లత్వ లక్షణాలు తక్కువగా ఉంటాయి. సాధారణం బియ్యం కాకుండా ముతక బియ్యం తీసుకుంటే .. అందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ బర్న్ సమస్య తలెత్తే అవకాశం లేదు.
ప్రొటీన్ కోసం చికెన్ తీసుకునేటప్పుడు .. ఫ్రై చేసింది కాకుండా ఎక్కువగా ఉడికించింది తీసుకునేలా చూసుకోవాలి. కోడిగుడ్లు కూడా ఆమ్లెట్ రూపంలో కాకుండా ఉడికించి తీసుకోవడం మంచిది. .. అరటి పండ్లు, తర్భూజ పండ్లలో ఉండే మెగ్నీషియం కారణంగా ఎసిడిటీ సమస్య తలెత్తే అవకాశం లేదు. కాబట్టి రోజూ ఈ పండ్లను తీసుకోవడం మేలు చేస్తుంది. .. ఈ సమస్య ఉన్న వారు .. అల్లం తీసుకుంటే సమస్య నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. అల్లం.. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేస్తుంది. అల్లం రసం లేదా టీ రూపంలో తీసుకోవచ్చు…
ఆహారపదార్ధాలు సరైన సమయానికి సరైన విధంగా తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్ ను నివారించుకోవచ్చు. దీనితోపాటు పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకునేందుకు పొగ తాగడం, మద్యం తీసుకోవడం మానేస్తే మంచిది. అతి ఎక్కువగా టీ, కాఫీలు తీసుకోవడం కూడా మంచిది కాదు. రోజూ వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.