Digestive Health – ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? ఈ సింపుల్ టిప్స్ మీకోసం

By manavaradhi.com

Published on:

Follow Us
Foods to Improve Your Digestion

చిరుధాన్యాల్లో ఇనుము, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా వుంటాయి. ఒక కప్పు చిరుధాన్యాల నుండి ఒక రోజుకు అవసరమైన మాంగనీస్ 33 శాతం, ట్రిప్టోఫాన్ 32 శాతం, మెగ్నీషియం 27 శాతం, ఫాస్పరస్ 24 శాతం లభిస్తాయి. వరి, గోధుమల కన్నా ఎన్నో రెట్లు అధికమైన పోషక విలువలు వీటిల్లో వుంటాయి. చిరుధాన్యాల్లో పీచు పదార్థం అధికంగా వుండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై, శోషించబడకుండా చేయడం ద్వారా ఆహారంలో చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదల చేస్తాయి. చిరుధాన్యాలలో కాల్షియం అధికంగా వుండటం వల్ల చిన్నపిల్లల ఎదుగుదలకు, వృద్ధులు, మహిళల్లో ఎముకల బలానికి, దంతాల వృద్ధికి చాలా మంచి ఆహారం. ముఖ్యంగా రాగులలో ఎక్కువ కాల్షియం వుంటుంది.

శరీరం పెరుగుదలకు, అరిగిపోయిన భాగాలను భర్తీ చేయడానికి మాంసకృత్తులు అధికంగా ఉన్న పప్పు దినుసులు, నూనె గింజలు, పాలు ఆహారంగా తీసుకోవాలి. మాంసాహారులైతే గ్రుడ్లు, మాంసం, చేపలు తీసుకోవాలి. మొలకెత్తించిన పప్పులు ఇంకా శ్రేష్ఠం. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు భోజనంలో ఆకుకూరలు సహా ఒకటి, రెండు రకాల కూరగాయలు, ఆయా సీజన్లలో దొరికే ఫలాలను తప్పక చేర్చుకోవాలి. బెల్లం, ఖర్జూరం తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఇనుము లభిస్తుంది. జీర్ణ సమస్యలను చాలా సులభంగా నయం చేసే గుణాలు పాలు, పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. నీటితో పాటు నీటి కంటెంట్‌ అధికంగా ఉండే పండ్లు, జ్యూసులను తీసుకోవాలి. జీర్ణ సమస్యలున్నప్పుడు వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన సూపులను ఎంపిక చేసుకోవాలి.

ఉదయం వేళ తీసుకునే అల్పాహారంలో… ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీలు, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, బ్రెడ్‌, తాజాపళ్ళను తీసుకోవడం ఆరోగ్యకరం. తాజా కూరగాయల రసాలను కూడా తీసుకోవచ్చు. ఓట్స్‌తో చేసిన పదార్థాలను తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం భోజనంలో అన్నం లేదా గోధుమ రొట్టెలు, తాజా ఆకుకూరలు, కూరగాయలతో చేసిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పోషక విలువలు పుష్కలంగా లభించే పదార్థాలు, శరీరపు బరువును అతిగా పెంచని పదార్థాలను తీసుకోవాలి. మీగడ తీసేసిన పెరుగు లేదా వెన్న తీసేసిన చిక్కని మజ్జిగతో ఆహారాన్ని భుజించాలి. ఆహారపదార్థాల తయారీలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, నిమ్మరసం వాడాలి. వీటి వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. తీపి, నూనె, ఉప్పు, మసాలాపదార్థాలు తగ్గించి వాడాలి. వేళా పాళా లేకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆహారం తీసుకోవడమన్నది ఆరోగ్యకరం కాదు. ఆహారం తీసుకున్న తర్వాత 4 గంటల వ్యవధి తర్వాతనే ఏదయినా తినాలి. రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

అధిక రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మసాలా దినుసుల్లో ఒకటైన దాల్చిన చెక్కలోని వృక్ష రసాయనాలు రక్తపోటును అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి. బంగాళాదుంపల్లో ఉండే పొటాషియం, క్లోరోజెనిక్‌ ఆమ్లం, ట్రీప్టోఫాన్‌… రక్తనాళాలు వదులుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. అయితే బంగాళాదుంపలోని పోషకాలు చాలావరకు పొట్టులోనే ఉంటాయి. కాబట్టి పొట్టు తీయకుండా తినటం మంచిది.

కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు తమ రోజు వారి ఆహారంలో వెల్లుల్లిని , స్ట్రాబెర్రీ, క్రాన్‌ బెర్రీస్‌, రాస్పెరీస్‌, బ్లూబెర్రీస్‌ లను భాగంగా చేసుకోవాలి. చిరుధాన్యాలు మొలకెత్తించి తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాల డ్యామేజ్‌ను అరికట్టడానికి, మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగపడే క్యాబేజీని ఆహారంగా తీసుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, ఆపిల్స్‌ వంటివి మూత్రపిండాలు నిర్విషీకరణం, శుభ్రపరచడానికి బాగా సహాయపడుతాయి. ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే యాంటీ ఇన్‌‌ప్లమేటరీ ఫాటీ యాసిడ్స్‌ కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. రెడ్ గ్రేప్స్, చెర్రీస్ లను కూడా తీసుకోవడం మంచిది. చేపల్లో ఒమేగా 3, ప్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండి, శరీర శోషణకు బాగా సహకరిస్తుంది.

డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు నిత్యం టీ స్పూన్ మెంతులను 100 ఎంఎల్ నీటిలో రాత్రంతా నానబెట్టి…. ఆ నీటిని ఉదయం తాగడం వల్ల డయాబెటిక్‌ను కంట్రోల్లో ఉంచడానికి వీలుపడుతుంది. తేలికగా జీర్ణమయ్యేలా ఉండేందుకు… అలాగే ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకునేందుకు మన జీవన శైలిలో మార్పులు చేర్పులు ఎంతో అవసరం.

  • ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి.
  • ఆహారాన్ని మెల్లగా నమిలి తినాలి.
  • మసాలా పదార్థాలను తరచూ ఆహారంలో తీసుకోకూడదు.
  • నిలవ ఊరగాయలను మితంగా తీసుకోవాలి.
  • ఆకలిగా లేనప్పుడు ఆహారాన్ని తినకపోవడమే మంచిది.

మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంతో ముఖ్యం. శరీరానికి శక్తినిచ్చేవిగా కూడా ఉండేలా చూసుకోవాలి. వాటితో పాటు ఆరోగ్యసమస్యలను దూరం చేసేవిగా కూడా ఉండాలి. అప్పుడే మనం తీసుకునే ఆహారానికి సార్ధకత ఉంటుంది.

Leave a Comment