చాలామంది మాంసాహారం మాత్రమే అధిక శక్తిని అందిస్తుందని నమ్ముతూ ఉంటారు. మాంసాహారం, శాకాహారం అనే తేడా లేకుండా ప్రతి ఆహారం శక్తిని అందిస్తుంది. మాంసకృతులు అందించే శాకాహారాలు ఎన్నో ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో ప్రొటీన్ మరియు శక్తిని పొందవచ్చు. మాంసాహారంతో సమానమైన పోషక విలువలు అందించే ప్రోటీన్స్ ఏమిటో తెలుసుకుందాం
ప్రొటీన్లు కండరాల నిర్మాణానికి ఎంతో అవసరం. వయసు పెరిగే కొలదీ, వయసుతో పాటు ప్రొటీన్ కూడా అవసరమైన మేర అందాల్సిందే. ఎవరి శరీరానికి ఎంత మేర ప్రొటీన్ అవసరమో తెలుసుకోవాలి. మహిళలు తమ వయసుని బట్టి, శరీరాన్ని బట్టి రోజుకు సరాసరిన 46 గ్రాముల ప్రొటీన్ పొందాలి. అదే విధంగా పురుషులకు 56 గ్రాముల ప్రొటీన్ అవసరాలు ఉంటాయి. మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి ఈ ప్రొటీన్ కాస్త తక్కువే అందాలి. అదే విధంగా రోజంతా మనం తీసుకునే ఆహారంలో కేలరీల కంటే ప్రొటీన్లు బాగా ఉండేలా చూసుకోవాలి. దీని మీద ఆధారపడే శరీరానికి ప్రొటీన్ అందించే ప్రయత్నం చేయాలి. కార్బోహైడ్రేట్లూ, కొవ్వుని నిల్వ చేసుకున్నట్టుగా శరీరం ప్రొటీన్లు నిల్వ చేసుకోదు. దాంతో ఏ రోజుకారోజు మనం ప్రొటీన్ నిండిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అలా తీసుకోకపోతే మన శరీరం మన కండరాల నుంచి వాడుకుంటుంది. అదే జరిగితే శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది.
ప్రొటీన్ అధికంగా లభించే ఆహారాలు ఏవి….?
పాల ఉత్పత్తులు సంపూర్ణంగా ప్రొటీన్ లతో నిండి ఉంటాయి. రక్తపోటు ఉన్న వారికి కూడా ఇవి ఎంతో ఉపయోగకరమైన ఆహారంగా చెప్పుకోవాలి. డయాబెటిస్ వారు సైతం నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చు. ఒక కప్పు పాలలో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అదే విధంగా కొవ్వు లేని పెరుగును కూడా ప్రొటీన్స్ కోసం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెరుగులో 18 నుంచి 20 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అయితే సంప్రదాయ పెరుగుతో ప్రొటీన్ తో పాటు కొవ్వు కూడా ఉంటుంది గనుక, సరైన స్థాయిలో మాత్రమే తీసుకోవాలి. అదే విధంగా లాక్టోజ్ ఉండే పాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సోయా బీన్స్ లోనూ పుష్కలంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఒక కప్పు వండిన సోయాబీన్స్ లో 29 గ్రాముల మాంసకృతులు ఉంటాయి. ఎవరైనా సరే వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. హార్మోన్ చికిత్స మరియు రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయించుకుంటున్న వారు వైద్యుని సలహా మేరకు దీన్ని తీసుకోవాలి. అన్ని రకాల కూరగాయల నుంచి సహజంగానే పూర్తి స్థాయిలో పోషకాలు లభిస్తాయి. వీటిలో 15 గ్రాముల వరకూ ప్రొటీన్స్ ఉంటాయి. వండిన బఠానీల్లో 9 గ్రాములు, కాల్చిన బంగాళదుంపలో 4 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
ప్రొటీన్ తీసుకునే విషయంలో ఎలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి…?
గుమ్మడి కాయ లేదా పొద్దు తిరుగుడు విత్తనాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వారంలో కనీసం ఒక రోజు ఈ గింజలు తినడం వల్ల గుండెపోటు అవకాశాలు తగ్గిపోతాయి. సలాడ్లు మరియు ఉడికించిన కూరగాయల ద్వారానూ ఇది బాగా లభిస్తుంది. అయితే వీటిలో కేలరీలు అధికంగా ఉండడం వల్ల వీటిని ఆచితూచి తీసుకోవడం అవసరం. వీటితో పాటు వేరు శెనగ నుంచి కావలసిన ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటిని ఏ విధంగా తీసుకోవాలి, ఎంత మేర తీసుకోవాలనే అంశం మన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అధికంగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి పోషణతో కూడిన ప్రొటీన్లు లభిస్తాయి.
ఏదేమైనా ప్రొటీన్ ఉండే ఆహారంలో ప్రొటీన్ తో పాటు కొలెస్ట్రాల్ కూడా అదే స్థాయిలో ఉంటాయి గనుక, వేటిని ఎంత మేర తీసుకుంటున్నామనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని తీసుకోవాలి. శరీరానికి సరిపడా ప్రొటీన్లు తీసుకోవటం ఎంతో అవసరం. అయితే ఖర్చయ్యే క్యాలరీల ఆధారంగా ప్రొటీన్ల పరిమాణాన్ని అంచనా వేసి తీసుకోవాలి. అవగాహన ఏర్పరుచుకోకుండా అవసరానికి మించి ప్రొటీన్లు తీసుకుంటే ఈ నష్టాల్ని భరించాల్సి వస్తుంది.