శాఖాహారం ఇది ఒక పోషకాల గని .. ఆరోగ్యకర జీవితానికి శాఖాహారం ఎంతగానో సహాయపడుతుంది. పుష్కలమైన విటమిన్లతో అనారోగ్యాన్ని దరి చేరనీయదు. మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శాఖాహారంతో జీర్ణశక్తి రెట్టింపవుతుంది. వెజిటేరియన్ డైట్ వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు..!
మనిషి ఆరోగ్యానికి శాఖాహారమే శ్రేష్ఠం. శాఖాహార పదార్థాల్లో అన్ని రకాల పోషక విలువలు లభ్యమవుతాయి. వెజిటేరియన్ డైట్ తో సాత్విక లక్షణాలు వస్తాయి. అంతే కాదు మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆయువు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా పండే కూరగాయలు, ఆకుకూరల్లో మంచి పోషక విలువలు ఉంటాయని, మాంసాహారంతో అనారోగ్యం పాలవుతారని వారు వివరిస్తున్నారు. అల్సర్, కొవ్వు పెరుగడం, గ్యాస్ ట్రబుల్, గుండెజబ్బులకు ప్రధాన కారణం మాంసాహారమే అని వైద్యులు చెబుతున్నారు. మసాలాలు, నూనెలతో తయారు చేసే మాంసాహారం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి అనారోగ్యం కలుగుతుంది. శాఖాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు.
ఎవరైతే శాఖాహారులుగా ఉంటారో వాళ్లు ఖచ్చితంగా ఎక్కువకాలం సంతోషంగా బతుకుతారు. ఎందుకంటే.. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి.. ఎక్కువకాలం జీవిస్తారు. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సరిగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కూరగాయల్లో ఐరన్, పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చు. బీపీ కంట్రోల్ శాఖాహారం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ గా ఉంటుంది. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మధుమేహం రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.శాఖాహారంలో కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల మనిషికి అవసరమయ్యే శక్తి సమకూరుతుంది. పప్పుధాన్యాలతో పాటు బాదం, జీడిపప్పు, సోయాబీన్, వేరుశనగ తదితర వాటిల్లో ప్రొటీన్స్ అధికంగా లభిస్తాయి. ప్రొటీన్లు అత్యధికంగా ఉండే శాఖాహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీర నిర్మాణంతో పాటు దేహదారుఢ్యానికి తోడ్పడుతుంది.
సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో అత్యధికంగా విటమిన్లు ఉంటాయి. సిట్రస్ జాతికి చెందిన పండ్లలో సీ- విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మునగ, బొప్పాయిల్లో ఏ-విటమిన్, సూర్యరశ్మి ద్వారా డీ-విటమిన్, మొలకెత్తిన విత్తనాలు, క్యారెట్‌లో ఈ-విటమిన్, చిలగడ దుంపల్లో బయోటిన్ వంటి పోషక విలువలు లభ్యమవుతాయి.
ఆకుకూరలు, చిక్కుళ్లు వంటి వాటిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థాల్లో సెల్యూలోజ్ అధికంగా ఉండి రక్తనాళాల్లో కొవ్వును కరిగించడం, మలబద్ద నివారణకు ఉపయోగపడుతుంది. సమపాళ్లలో క్యాల్షియం లభించకపోతే దంత, ఎముకలలో బలహీనం పెరిగి వ్యాధులు పెరిగే ఆస్కారం ఏర్పడుతుంది. కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాల్లో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. నువ్వులు, పాలకూర, పాలల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీని ద్వారా మానవదేహంలో ఎముకలు పటిష్ఠమవుతాయి.
మారుతున్న కాలానుగుణంగా భోజన ప్రియులు సైతం శాఖాహారం వైపు దృష్టిసారిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు. పప్పుధాన్యాలు, జొన్నలు, గోధుమలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు మనిషి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.