Ayodhya Ram Mandir : జనవరి 22న ‘‘జై జై రామ్’’ అని 108 సార్లు పఠిస్తూ శంఖం పూరించి, గంటలు మోగించాలి

By manavaradhi.com

Updated on:

Follow Us

ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా దేవాలయాల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవంలో భాగంగా అయోధ్యలో నిర్వహించే మహాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.

భవ్యమైన రామమందిరాన్ని సాంప్రదాయ ‘‘నాగర’’ శైలిలో మూడు అంతస్థులుగా నిర్మించినట్లు ట్రస్ట్ తెలిపింది. ప్రతి అంతస్తు 20 అడుగులతో, 392 స్తంభాలు మరియు 44 ద్వారాలు కలిగి ఉంటుంది. ఆలయ పొడవు తూర్పు నుండి పడమర వరకు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని గర్భగుడిలో బాల రాముడి విగ్రహ రూపం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీ రామ దర్బార్ ఉంటుంది. అలాగే వివిధ కార్యక్రమాల కోసం ఐదు మండపాలు ఉంటాయి. ఇక తూర్పు ద్వారం వద్ద 32 మెట్లు ఎక్కిన తర్వాత సింహ ద్వారం నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది. వికలాంగుల కోసం ర్యాంప్ మరియు ఎలివేటర్ సౌకర్యాన్ని కల్పించారు. నాలుగు మూలల్లో సూర్య భగవానుడు, శంకరుడు, గణపతి, భగవతి దేవతలకు నాలుగు ఆలయాలు ఉంటాయి. దక్షిణం వైపున హనుమాన్ దేవాలయం, ఉత్తరాన అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది.

మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాదరాజ్, మాతా శబరి, అహల్య ఆలయాలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంకా నైరుతి వైపున ఒక శివాలయం ఉన్న చోట ఆలయం పునరుద్ధరించబడుతుంది. అలాగే ప్రణాళిక ప్రకారం అక్కడ ‘‘జటాయు’’ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. మరోవైపు అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఇండియన్ రైల్వే పునరుద్ధరిస్తోంది. అయోధ్య రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జనవరి 22వ తేదీన జరగనుండగా..దానికి వారం రోజుల ముందుగానే అంటే జనవరి 15వ తేదీ నాటికి అయోధ్య రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఇండియన్ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆకారంలోనే ఈ పునర్నిర్మించిన రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు.

Leave a Comment