Amniotic fluid : ఉమ్మనీరు హెచ్చుతగ్గులు బిడ్డపై ప్రభావం చూపుతుందా…?

By manavaradhi.com

Published on:

Follow Us
Amniotic fluid Information

అమ్మ కడుపులో తొమ్మిది నెలలు… గర్భస్థ శిశువులో ఎన్నో మార్పులు. ఈ క్రమంలో శిశువు ఎదుగుదలకు తగ్గట్టు… సౌకర్యాన్ని అందిస్తూ… పిండాన్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యతను ఉమ్మనీరు తీసుకుంటుంది. బిడ్డకు పలువిధాల మేలుచేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయి కంటే పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. సాధారణంగా అయితే… గర్భం ధరించినప్పటి నుంచి ఈ ఉమ్మనీటి శాతం పెరగాలి. రెండున్నర నెలలకు ఉమ్మనీరు 30 ML ఉంటే… తొమ్మిదో నెల నాటికి ఇది 1000 ML వరకూ చేరవచ్చు. గర్భంలో ఉండే శిశువు ఇందులో కదలడం మాత్రమే కాదు… అప్పుడప్పుడూ దాన్ని స్వీకరించడం, మళ్ళీ మూత్రం ద్వారా వదిలేయడం… ఇలా అన్నీ బిడ్డ ఎదుగుదలలో భాగమే.

గర్భంలో బిడ్డ సౌకర్యంగా ఉండేందుకు ఉమ్మనీరు ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బిడ్డచుట్టూ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా సాగుతుంది. వేడి తగ్గనప్పుడు ఇది రక్షణకవచంలా పని చేస్తుంది. బిడ్డకు రక్షణ కవచంలా ఉంటూ, శిశువుకు బయట నుంచి గాయాలు కాకుండా కాపాడే బాధ్యత తీసుకుంటుంది.

కడుపులో బిడ్డకు రక్షణ కవచంలా పని చేసే ఉమ్మనీరులో అప్పుడప్పుడు హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఉమ్మనీరు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండడాన్ని ఓలిగో హైడ్రామ్నిస్ అంటారు. శిశువు స్వీకరించిన ఉమ్మనీటిని విసర్జించకపోవడం వల్ల ఈ స్థాయి తగ్గుతుంది. బిడ్డకు రక్తసరఫరా సరిగా అందకపోయినా, శిశువు మూత్రపిండాల పనితీరులో సమస్యలు ఉన్నా, ఇలాంటివి తలెత్తవచ్చు. తల్లి వాడే కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలతో పాటు… నెలలు నిండినా ప్రసవం కాకపోవడం లాంటి కారణాల వల్ల ఉమ్మనీరు తగ్గిపోతుంది. ఉండాల్సిన దానికంటే… బిడ్డచుట్టూ అధికంగా ఉమ్మనీరు ఉండడాన్ని పాలీహైడ్రామ్నియోస్ అంటారు. గర్భస్థ శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా… అసలు స్వీకరించకపోయినా, శిశువు ఉదరసంబంధం పేగు మూసుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఎక్కువ మంది శిశువులు కడుపులు ఉండడం, లేదా శిశువుకు నాడీ వ్యవస్థ సమస్యలు ఉండడం దీనికి కారణం.

గర్భిణీల్లో ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు పుట్టబోయే శిశువుపై ఆ ప్రభావం పడుతుంది. వారికే పుట్టే పిల్లలు అవయవ లోపాలతో జన్మించవచ్చు. పిల్లలకు వెన్నెముక, తలలో సమస్యలు ఉండవచ్చు. శిశువు పేగులు కూడా మూసుకుపోయి ఉండే ప్రమాదం ఉంది. తల్లికి షుగర్ ఉంటే ఉమ్మనీరు ఎక్కువగా ఏర్పడుతుంది. కాలేయం, గుండె సమస్యలు ఉన్నవాళ్ళకి కూడా పాలిహైడ్రామినెస్ రావచ్చు. అంతే కాకుండా నెలలు నిండకుండానే నొప్పులు రావచ్చు. ప్రసవానికి ముందుగానే మాయ వేరయ్యే ఆవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ ఉండాల్సిన స్థితిలో కాకుండా, అసాధారణ స్థితిలో ఉండవచ్చు. ఒక్కోసారి అధికరక్తస్రావం, బొడ్డుతాడు జారిపోవడం లాంటి సమస్యలు ఏర్పడి సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.

ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు గర్భిణీ స్త్రీలలలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. పొట్ట సాగడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. గుండెల్లో దడ కూడా ఉంటుంది. కాళ్ళ వాపులు, కాళ్ళనరాలు ఉబ్బడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఉమ్మనీరు పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చక్కని పరిష్కారం. అదే విధంగా బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, గుండె సంబంధింత సమస్యలు ఏమన్నా ఉన్నాయా లాంటి విషయాలను కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే బిడ్డకు రక్తసరఫరా తీరుతెన్నులు పరీక్షించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో అధికంగా ఉన్న ఉమ్మనీటిని తగ్గించడానికి తల్లికి మందులు కూడా సిఫారసు చేస్తారు. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే కాన్పు సమయంలో తల్లికి ఫిట్స్, బి.పి వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు బిడ్డ అడ్డం తిరగడం, తలపైకి ఉండడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. శిశువు అవయవ లోపాలతో పుట్టే ప్రమాదం కూడా ఉంది.

ఉమ్మనీరు సమస్య సాధారణంగానే ఉన్నప్పటికీ… ఒక్కోసారి మరింత ప్రమాదకరంగా మారుతుంది. డాక్టర్ ను సంప్రదించి… ఆస్పత్రిలో చేరాలి. ఈ సమస్యలు ఉన్న వారికి వీలైనంత విశ్రాంతి అవసరం. షుగర్, బి.పి. లాంటివి కంట్రోల్ చేయాలి. ఈ సమస్యలకు ఇప్పుడు చక్కని పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి.

Leave a Comment