మనం ఎంత బాగా మాట్లాడుతున్నా.. మన నోటి నుంచి వచ్చే దుర్వాసన మన మాటల్ని ఎదుటివారు వినకుండా చేస్తుంది. నోటి దుర్వాసన ఎదుటివారిని ఇబ్బంది పెట్టే బాధాకరమైన విషయం. ఇంతటి ఇబ్బదికర సమస్య పోవాలంటే ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
నోటి దుర్వాసన.. చాల మందిని వేధిస్తున్న సమస్య. మార్నింగ్ బ్రష్ చేసినప్పటికీ కొందరిలో నోటి నుంచి వాసన వస్తుంటుంది. ఇలాంటి వారు మరొకరితో మాట్లాడానికి కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. నోట్లో నుంచి వెలువడే వాసన కారణంగా నలుగురిలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. పక్కనున్న వారితో దగ్గరగా కూర్చోని మాట్లాడాలన్నా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. మధుమేహం, చిగుళ్ల సమస్యలు, దంతాల ఇన్ఫెక్షన్, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం తదితర సమస్యల కారణంగా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిగుళ్లు, దంతాల వ్యాధుల కారణంగా నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తగినన్ని నీళ్లు తాగకపోయినా, కొన్ని రకాల మందుల కారణంగా నోరు పొడిబారిపోయి నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
అన్నాశయంలో పూర్తిగా జీర్ణం కాని ఆహారం కొంత కాలం తర్వాత కుళ్లిపోయి దుర్వాసన కల వాయువులను ఏర్పరచి నోటినుండి బయటకు వదలబడుతాయి. అలాగే గొంతు నందలి ఇన్ఫెక్షన్ , పళ్ళ యందలి వాపు కారణంగా ఏర్పడిన చీము, రక్తం అక్కడ నిలిచి, కుళ్ళి ధుర్గంధమైన వాసనను కలిగిస్తుంది. లివర్ సమస్యలు, మూత్రపిండాల్లో సమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన కనిపిస్తుంది. నిద్రపోతున్నప్పుడు నోరు తెరుచుకుని ఉండే వారిలో కూడా నోటి దుర్వాసన సమస్య ఉంటుంది.
బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే లాలాజలం తగ్గిపోతే నోట్లో నుంచి వాసన వస్తుంది. లాలాజలం నాలుకపై ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. హార్మోన్ ఇన్స్యూలిన్ తక్కువ స్రవించే వారిలో కూడా నోటి దుర్వాసన కనిపిస్తుంది. హె.పైలోరి బ్యాక్టీరియా నోట్లో ప్రవేశించడం వలన, శ్వాససంబంధ సమస్యలు ఉన్నప్పుడు, కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
మనం తినే ఆహారం టాన్సిల్స్‌కు అతుక్కొని సూక్ష్మక్రిములతో కలిసి కాల్షియం తయారై టాన్సిల్ రాళ్లు తయారవుతున్నప్పుడు కూడా నోటి దుర్వాసన వెదజల్లుతుంది. టాన్సిల్ రాళ్లను ఎప్పటికప్పుడు బ్రష్ లేదా దూది ఉండలతో తొలగించుకోవాలి. ఆహారం తీసుకొన్న ప్రతిసారి నోటిని నీటితో బాగా పుకిలించడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో ద్రవపదార్థాలు తక్కువ కాకుండా ఉండేందుకు ఎక్కువగా నీటిని తాగుతుండాలి. నోటిపూత, నోట్లో గాయాలైన సందర్బాల్లో కూడా వాసన వస్తుంది. దీనిని నివారించేందుకు ఇన్‌పెక్షన్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.
చిగుళ్ల నుంచి రక్తం కారకుండా చూసుకోవాలి. అధిక ప్రొటీన్లు ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. నోటి దుర్వాసన కేవలం బ్రషింగ్, మౌత్‌వాష్‌లు వాడటం వల్ల మాత్రమే తగ్గిపోవు. వైద్యుడ్ని సంప్రదించి తగు కారణాలను ఆన్వేషించి చికిత్స పొందడం ద్వారా మాత్రమే నోటి దుర్వాసన నుంచి బయటపడొచ్చు.
నలుగురిలో నవ్వలేక నగుబాటుకు గురయ్యే నోటి దుర్వాసనను గుర్తించిన వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. నోట్లో లాలాజలం ఎండిపోకుండా చూసుకొంటూ పోషకాహారాలు తీసుకోవాలి.








