మన ఆరోగ్యాన్ని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే… మనం ఎం తింటున్నాం, ఎలాంటి ఆహారం తింటున్నాం అనే విషయాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అందుకనే పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అంటే నచ్చిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా వైవిధ్యమైన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో భోజనం కాస్తా మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది. దాంతో పోషకాహారం అందక పలు రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. సరైన ఆహారాన్ని ఎంపిక చేయడానికి అనేక కారణాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రుచి, శుచితో బాటు పౌష్టికాహార విలువలు, సౌకర్యవంతం, వ్యక్తిగత ఇష్టాలు ఇలా ఎన్నో అంశాలు ఆహారంతో ముడిపడి ఉంటాయి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. నాలుకకు రుచిగా ఉన్నవి ఆరోగ్యానికి మంచిది కాదు అనేది వాస్తవం కాదు. ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి.
మన రోజువారీ డైట్‌లో కొన్ని రకాల మంచి ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఉండగలుగుతామని తెల్సుకోవాలి. సోడియం, కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదవి. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌తో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడ్ మీట్, వెన్న, డెయిరీ ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. రోజును ఉత్తేజంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే అధిక పోషకాలు ఉండే పండ్లు, స్నాక్స్ తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి.
ఏ ఆహారాలను ఎంత మోతాదులో తీసుకోవాలి..?
మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. ప‌్రతిరోజు ఆహారం తీసుకోవడానికి రెస్టారెంట్లు సరైన ఎంపిక కాదు. ఇంట్లోనే ఆహారం తయారుచేసుకొని తీసుకోవడం చాలా మంచిది. ప్రతీసారి వేడిగా ఉండే భోజనం కలిగి ఉండటం ఆరోగ్యకరం. ఓట్‌మీల్ గానీ, ఫ్రూట్స్ గానీ రాత్రి భోజనంలోకి తీసుకోవడం ఉత్తమం. జంక్ పుడ్స్ తీసుకోవడం మానుకోవాలి.
ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. భోజనం చేస్తున్న సమయంలో టీవీ ముందుగానీ, కంప్యూటర్ ముందుగానీ కూర్చోకూడదు. దీనివల్ల మనకు తెలియకుండానే ఎక్కువ పనికిరాని ఆహారాన్ని తీసుకోంటాం. ప్యాక్ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది.
డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మన శరీరం రోజంతా ఉత్తేజంగా ఉండేందుకు ఆహారం అవసరమని అదేపనిగా తీసుకోవడం మంచిది కాదు. ఆఫీసులో ఉన్నప్పుడు టైమ్ పాస్ కోసం స్నాక్స్ తీసుకోవద్దు. నిత్యం ఒకే సమయంలో లంచ్, డిన్నర్ చేయడం అలవర్చుకోవాలి. పిల్లలతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాల్సివచ్చినప్పుడు వారికి ఇష్టమైనవే ఆర్డర్ ఇవ్వాలి. నలుగురు కలిసి ఒక వంటకాన్ని షేర్ చేసుకోవడం అలవర్చుకోవాలి. రెస్టారెంట్ కు వెళ్లిన సమయాల్లో తక్కువ మొత్తంలో భుజించడం పిల్లలకు నేర్పాలి.
ఎనర్జీ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉండే జ్యూస్‌లు తీసుకోవద్దు. తీసుకొనే ఆహారం ప్లానింగ్‌గా ఉండేలా చూసుకోవాలి ఫలితంగా శక్తినివ్వని ఆహారాలను పక్కనపెట్టే వీలుంటుంది. పార్టీలకు వెళ్లినప్పుడు తక్కువగా తినడం అందునా పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా మన తింటున్న ఆహారాల జాబితా తయారుచేసుకొంటే ఏది ఉపయోగమో.. ఏది పక్కనపెట్టాలో తెలిసివస్తుంది.
ఒక సమయంలో ఒక చిన్న, నిర్దిష్ట ఆరోగ్యకరమైన ఆహార లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకోండి. ఒకేసారి చాలా మార్పులు చేయడానికి ప్రయత్నించవద్దు. ఆహారం విషయంలో అప్రమత్తత అవసరం. సరైన పోషకాలు అందలేదంటే ఆరోగ్యం క్షీణిస్తోంది. అందుకే డైట్‌పై దృష్టిపెట్టాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతారు.