బియ్యం.. మన సంస్కృతిలో ఒక ప్రధానమైన ఆహారం. కొన్నేళ్ల క్రితం ప్రతి ఊర్లో దంపుడు బియ్యం దర్శనమిచ్చేవి. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ బియ్యం తినడం మంచిది..? బ్రౌన్ రైస్ మంచిదా లేకా వైట్ రైస్ మంచిదా..?
దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఎక్కువగా తినే ముఖ్యమైన ఆహారం వరి బియ్యం. అందంగా, తెల్లగా, విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే అని అందరూ సాధారణంగా చూస్తుంటారు. బ్రౌన్ రైస్ తినడం ఎప్పుడో మానేసాం. అసలు బ్రౌన్ రైస్ అంటూ ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. కంటికి ఇంపుగా అన్నాన్ని తయారుచేస్తే అందులో ఉన్న పోషక విలువలు పోతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. తెల్లగా, సన్నగా ఉండే రైస్ తయారుకావాలంటే ముతక బియ్యాన్ని చాలా సార్లు పాలిష్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అందులోని జీవ పదార్థం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు అన్ని తవుడు రూపంలో బయటకు వెళ్లిపోయి.. మనకు కేవలం పనికిరాని పదార్థం మిగిలి ఉంటుందని గ్రహించలేక పోతున్నాం.
మనం అన్నం తినగానే కడుపు నిండినట్టుగా అనిపిస్తుండటానికి ప్రధాన కారణం బియ్యంలో ఎక్కువగా ఉండే క్యాలరీలు. కప్పు వండిన తెల్ల బియ్యంలో 242 క్యాలరీలు ఉంటే, అదే ఒక కప్పు బ్రౌన్ రైస్ వండితే 218 క్యాలరీలు దొరుకుతాయి. క్యాలరీలు కరిగేలా కష్టపడుతున్నవారు వైట్ రైస్ తింటే పర్లేదు. అదే ఒకేచోట కూర్చొని పనిచేసేవారు తెల్లబియ్యం తినడం ద్వారా క్యాలరీలు కరుగకుండా బరువు పెరిగిపోతారు. జింక్ 4%, ఐరన్ 2% , మెగ్నీషియం 11% , మాంగనీస్ 45% , ఫాస్ఫరస్ 4% , విటమిన్ బి 6 7%, థయామిన్ 6%, నియాసిన్ 8 శాతంతోపాటు యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్, ఇతర విటమిన్స్ ఎన్నో ఉంటాయి. వీటిలోని ఫైటోన్యూట్రియెంట్స్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది.
ముడిబియ్యంలో పీచు సమృద్ధిగా ఉన్నందున అదనపు క్యాలరీలు తీసుకోకుండా ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్నట్లుగా అనిపించేట్టు చేస్తుంది. వీటిలోని పీచు.. రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించి టైపు 2 రకం డయాబెటిస్ ను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. ముఖ్యంగా వీటిలో ఉండే సెలీనియం ఉబ్బసంకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా, మలబద్దకం రాకుండా నివారిస్తుంది. బ్రౌన్ రైస్ లో గుండెజబ్బుల నుంచి రక్షించే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇకపోతే, ఇందులో ఉండే థయామిన్, రైబోఫ్లేవిన్, సయనకోబాల్మిన్ అనే విటమిన్లు నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రతి ½ కప్పు ముడిబియ్యం ఈ మూడు కప్పులకు సమానం అవుతున్నందున ముడిబియ్యం తినడం రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చేందుకు మంచి మార్గమౌతుందని గుర్తుంచుకోండి.
అన్నం ద్వారా పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి. అయితే పరిమితి మించకుండా రైస్ తింటే వచ్చే నష్టం ఏమీ లేదు. పాలిష్ అసలే చేయని ముతక బియ్యం తింటే ఆరోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చని నిపుణులు సెలవిస్తున్నందున ఇకనైనా బ్రౌన్ రైస్‌పై దృష్టిపెడదాం. ఆరోగ్యంగా ఉందాం.







