దాల్చిన చెక్క.. చాలా మందికి ఓ సుగంధ ద్రవ్యంగానే పరిచయం . కానీ ఇది ఓ ఔషధ మొక్క కూడా . పురాతన కాలం నుంచి భారత సంప్రదాయంలో ఔషధంగా దీన్ని వాడుతున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
భారతీయ సంప్రదాయ ఔెషధ మొక్క .. దాల్చిన చెక్క. సుగంధ ద్రవ్యంగానే కాదు ఎన్నో రకాల వ్యాధులకు మూలికగా ఇది పని చేస్తోంది. దాల్చిన చెక్క కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా పరిశోధనలు వెల్లడించాయి. దాల్చిన చెక్క నుంచి తీసిన నూనెను సిన్నమాల్దిహైడ్ అంటారు. ఇది శరీరంలో ఫ్యాట్ సెల్స్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అంటే స్థూలకాయాన్ని తగ్గించుకునే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఫ్యాట్ సెల్స్ ను బర్న్ చేసి శక్తిని కలగిస్తుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి మార్గం సుగమమవుతుంది. చర్మ సౌందర్యాన్ని కలిగించడంలో దాల్చిన చెక్క కీలకపాత్ర పోషిస్తుంది. మొటిమలు కలిగించే బ్యాక్టీరియా ఇది నాశనం చేస్తుంది. కొల్లెజన్ ఉత్పత్తిలోనూ దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ కొల్లాజన్ ఉత్పత్తి పెరగడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
క్యాన్సర్ చికిత్సలోనూ దాల్చిన చెక్క ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దాల్చిన చెక్క నుంచి తీసిన ఔషధం క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతోంది. ఇప్పటికే జంతువులతోపాటు ల్యాబ్ లో కృత్రిమంగా సృష్టించిన కేన్సర్ కణాలపై ఈ ప్రయోగాలు చేశారు. ఐతే కేన్సర్ ట్యూమర్ సెల్స్ ను ఏ మేరకు తగ్గిస్తుందనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. దాల్చిన చెక్క రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోజూ దాల్చిన చెక్కను మూడు నెలలపాటు తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే అల్జీమర్స్ రాకుండా దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే ఓ ప్రొటీన్ మెదడులో ఉత్పత్తి అవుతుంది. ఐతే రోజూ దాల్చిన చెక్క తీసుకుంటే ఈ ప్రోటీన్ ఉత్పత్తి ఆగిపోతుందని పరిశోధనల్లో వెల్లడైంది.

శరీరంలో వాపులు ఏర్పడకుండా కాపాడుతుంది. రుమటైడ్ ఆర్ధ్రైటిస్ ఉన్న వారిలో సహజంగానే వాపులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఐతే దాల్చిన చెక్కను క్రమంగా తీసుకుంటే వాపులు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిని కూడా దాల్చిన చెక్క నియంత్రణలో ఉంచుతుంది. 60 ఏళ్లు పైబడిన వారు రోజూ పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి తీసుకుంటే .. వారి ఎల్ డీఎల్ స్థాయి తగ్గిపోతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాదు .. సాల్మొనెల్లా, ఈ.కొలీ, స్టఫ్.. లాంటి బ్యాక్టీరియాలతో పోరాడడంలోనూ దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. మహిళల్లో PCOS సమస్య రాకుండా రక్షిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. ఐతే ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
దాల్చిన చెక్కలో విటమిన్స్ , ఖనిజ లవణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంటు వ్యాధుల నుంచి శరీరారాన్ని కాపాడడంతో దాల్చిన చెక్క ఎంతో సహాయం చేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ మైక్రోబియల్ ప్రభావాల కారణంగా చర్మంపై ఎలాంటి దద్దుర్లు , అలర్జీలు రాకుండా ఉంటాయి. కాబట్టి .. నిత్యం ఆహారంలో ఏదో రూపంలో దాల్చిన చెక్కను తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది