Generic Medicines : బ్రాండెడ్, జనరిక్‌ మందుల మధ్య తేడా తెలుసుకోండి

By manavaradhi.com

Published on:

Follow Us

సాధారణంగా వ్యాధిని తగ్గించడానికి ఉపయోగడపడే మూలపదార్థాన్ని వైద్య పరిభాషలో జనరిక్ గా వ్యవహరిస్తారు. ఏ మందులైనా ఇదే ఫార్ములాతో తయారు అవుతాయి. వీటిని కంపెనీ పేరుతో అమ్మితే వాటిని బ్రాండెడ్ అంటారు. కంపెనీ పేరు లేకుండా అమ్మితే జనరిక్ మందులుగా వ్యవహరిస్తారు. ఈ జనరిక్ మందులకు బ్రాండింగ్ లాంటివి ఉండకపోవడం వల్ల వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. వాడే జనరిక్ అదే, కానీ ధరను చూస్తే మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ప్రస్తుతం దాదాపు అన్ని జబ్బులకు సంబంధించిన జనరిక్ మందులు మార్కెట్లో లభిస్తున్నాయి.

ఇతర కంపెనీల మందులతో పోలిస్తే జనరిక్ మందుల ధరలో చాలా తేడా ఉంటుంది. ఈ రెండు మందుల మధ్య వ్యత్యాసం వ్యాధిని బట్టి 30 నుంచి 80 శాతం కచ్చితంగా ఉంటుంది. అంటే ఎలాంటి సమస్య అయినా సరే వేలకు వేలు పోసి మందులు కొనాల్సిన పనిలేదు. జనరిక్ మందులు తీసుకుంటే వందల్లోనే మందులు లభిస్తాయి. వాడేది ఒకే విధమైన జనరిక్ కనుక వ్యాధిని తగ్గించే విషయంలో ఇవేం తక్కువ కాదు. వేలు పోసి కొన్న బ్రాండెడ్ మందులు ఎలా పనిచేస్తాయో, వందల్లో వెచ్చించి కొనుగోలు చేసిన జనరిక్ మందులు కూడా అలానే పని చేస్తాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక దుకాణాల్లో జనరిక్ మందులు లభిస్తున్నాయి.

బ్రాండెడ్ మందులు వాడడం వల్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంది. జనరిక్ మందులు వాడితే వ్యాధి తగ్గడానికి చాలా సమయం పడుతుందనుకునే వారు లేకపోలేదు. దీనికి తోడు భారత్ లో ఎక్కువ మంది వాడే సొంత వైద్యం కూడా దీనికి ప్రధాన కారణం. జనరిక్ మందులు తీసుకోవాలంటే కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అలా గాక తలనొప్పికో, ఒళ్ళు నొప్పులకే బ్రాండింగ్ మందులు అందరికీ ప్రకటన ద్వారా తెలిసిపోయి ఉంటాయి. అలాంటప్పుడు జనరిక్ మందుల జోలికి ఎందుకు వెళతారు. పైపెచ్చు వైద్యులు కూడా సమస్యకు కావలసిన జనరిక్ రాయడం లేదు. ప్రిస్క్రిప్షన్ లో ఏ కంపెనీ మందు అనే విషయాన్ని మాత్రమే రాస్తున్నారు.

ప్రిస్క్రిప్షన్ లో జనరిక్ వివరాలు రాస్తేనే ఈ మందులు తీసుకోవడం సాధ్యం అవుతుంది. దీంతో పాటుగా మందులు కొనుగోలు చేసే వారికి సైతం వారికి కావలసిన జనరిక్ మీద పూర్తి అవగాహన ఉండడం తప్పనిసరి. అలా లేనప్పుడు వేరే వేరే వ్యాధులకు వేరే వేరే మందులు వాడి కొత్త సమస్యల్లో పడే ఆస్కారం ఉంది. జనరిక్ మందులు కొనడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సరైనదేనా, మనం మందులు కొంటున్న షాపులో ఉన్న వారు నిపుణులేనా అనే విషయాన్ని బేరీజు వేసుకుని మందులు కొనుగోలు చేయాలి. అంతే తప్ప వైద్యుని సంప్రదించకుండా, వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే జనరిక్ మందులే కాదు, బ్రాండింగ్ మందులు సైతం ఎన్నో సమస్యలు సృష్టిస్తాయి.

ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు జనరిక్ మందుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పేద ప్రజల ఆర్థిక భారాన్ని చాలా వరకూ తగ్గిస్తున్నాయి. దీనికి తోడు ఆన్ లైన్ లో మందులు అమ్మే పద్ధతి రావడం వల్ల జనరిక్ మెడిసిన్ సులభంగా లభిస్తున్నాయి. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన భారత్ లాంటి దేశాల్లోని పేదలకు వైద్యులు ఏ మందులు రాశారో తెలియడం చాలా కష్టం. వైద్యులపై ఉన్న నమ్మకం, విశ్వాసం కారణంగా వైద్యునిపైనే భారం వేసి, అతను ఏవి రాసిస్తే అవే కొనుగోలు చేస్తున్నారు.

భారత్ లో జనరిక్ మెడిసిన్ వాడకం పెరగాలంటే, ముందు రోగులకు వాడుతున్న మందుల జనరిక్ పై అవగాహన రావాలి. కేవలం అప్పుడు మాత్రమే ధైర్యంగా జనరిక్ మెడిసిన్ వాడతారు. మంచి కంపెనీవి వాడితేనే త్వరగా తగ్గుతుందనే అపోహ కూడా ప్రజల్లో ఉంది. ఇది ఉన్నంత కాలం జనరిక్ మెడిస్ సామాన్యులకు చేరువ కావు. ముందు ప్రజల ఆలోచన మార్పు వచ్చి వైద్యుల ప్రిస్క్రిప్షన్ వాడే పరిస్థితి రావాలి. వైద్యులు కూడా జనరిక్ రాసేలా చేయాలి. ధర తక్కువైనంత మాత్రాన ఇవి బ్రాండెడ్ వాటికి ఏ మాత్రం తక్కువ కావు. దీని పట్ల అవగాహన కలిగి ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Leave a Comment