Ginger Benefits: అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Ginger Benefits

వంటింట్లో ఉండే అన్ని ఔషదాల్లో కెల్లా గొప్ప ఔషదం అల్లం. వంటిట్లో ఎప్పడూ అందుబాటులో ఉండే అల్లాన్ని తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయంటున్నారు పోష‌కాహార నిపుణులు. అల్లం తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

అల్లం అంటే తెలియనివారుండరు. ఎన్నో సంవత్సరాలుగా అల్లంను వంటల్లోనే కాక, అనేక మందుల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. అలాంటి అల్లాన్ని ఆహారంలో.. తప్పనిసరిగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరంలోని జీవ‌క్రియ‌ల‌కు అత్య‌వ‌స‌ర‌మైన‌ విటమిన్స్‌, మాంగనీస్‌, కాపర్‌ వంటి విలువైన పోషకాలు ఎన్నో అల్లంలో దాగున్నాయి. అల్లంలో పిండిపదార్థాలతోపాటు డైటరీ ఫైబర్‌, పోషకాలు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌ వంటి ఖనిజాలు, విటమిన్‌-సి, ఫోలేట్‌, విటమిన్‌ బి6, రిబోఫ్లావిన్లు కూడా ఉన్నాయి. యాంటాక్సిడెంట్‌, యాంటిఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు కూడా ఉన్నాయి.

అల్లం అన్నిరకాల నొప్పులను నివారిస్తుంది. మైగ్రేన్‌ వంటి తలనొప్పులను మటుమాయం చేస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది. రక్త శుద్దికి తోడ్పడుతుంది. రక్త నాళాల్లో ర‌క్తం గడ్డకట్టనీయకుండా సహాయ పడుతుంది. అల్లం కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో అల్సర్లు ఏర్పడవు. అల్లంలో క్యాన్సర్‌ని నిరోధించే లక్షణాలున్నాయి. నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదక బ్యాక్టీరియలను న‌శింప‌జేసి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కండరాలను పటిష్టం చేయడంతోపాటు కీళ్ల స‌మ‌స్య‌లు, ఆస్త‌మా నుంచి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌డంలో గొప్ప‌గా ప‌నిచేస్తుంది.

నిత్యం తీసుకునే ఆహారంలో అల్లం మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. డెమన్షియా, పార్కిన్‌సన్‌, అల్జమీర్‌ వంటి న్యూరోడీజెనరేటివ్‌ జబ్బుల పాలపడకుండా అల్లం కాపాడుతుంది. అలాగే ఒత్తిడి, ఇఫ్లమేషన్లని కూడా తగ్గిస్తుంది. మెదడు పనితీరు ఉత్తేజకరంగా ఉంటుంది. వర్షాకాలంలో కప్పు అల్లం టీ తాగితే ఎంతో సాంత్వన చేకూరుతుంది. వర్షాల వల్ల వచ్చే జలుబు, దగ్గు, వికారం, మలబద్ధకం వంటి ఎన్నో సీజనల్‌ రోగాలకు ఇది మంచి ఔషధం. అల్లం తీసుకోవడం వల్ల చెమట ద్వారా శరీరంలోని మలినపదార్థాలు బయటకుపోతాయి. చర్మంపై ఎగ్జిమా లక్షణాలను నివారిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల చర్మానికి సంబంధించిన డెర్మటైటిస్‌, యాక్నే, సొరియాసిస్ లాంటి వాటికి చెక్‌ పెట్టొచ్చు.

ఆహారానికి రుచికి ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరంగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకి నిత్యం మ‌న‌కు అందుబాటులో ఉండే ఈ దివ్య ఔష్యదంతో చెక్ పెట్టవచ్చంటున్న నిపుణుల మాట‌ను విని అల్లంను అన్ని వంట‌కాల్లో తీసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.

Leave a Comment