ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు చేతులతో చాలా పనులు చేస్తుంటాం. ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల చాలా సూక్ష్మక్రిములు చేతులకు అంటుకొని మనకు వ్యాధులను కలిగింపజేస్తాయి. చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అంతటి ప్రాముఖ్యం గల చేతులను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి..?
చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక మంచి అలవాటు. చేతుల ద్వారానే అనేక రకాల వ్యాధి కారక సూక్ష్మక్రిములు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఉదయం నుంచి అన్ని రకాల దినచర్యలను చేతుల ద్వారానే చేస్తుంటాం. రకరకాల పనులు చేసేప్పుడు ఆ పనికి సంబంధించిన కొన్ని మలినాలు చేతికి అంటుకుంటాయి. చేతులను శుభ్రం చేసుకోకుండా ఉండటం వల్ల చేతికి అంటిన క్రిములన్నీ మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. భోజనం తినే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం వలన క్రిములు శరీరం లోనికి ప్రవేశించకుండా ఉంటాయి. క్రిములను శరీరంలోనికి రానివ్వకుండా అడ్డుకొనే చర్మంపై ఏవైన గాయాలు అయినప్పుడు బాక్టీరియా చర్మం లోపలికి ప్రవేశించడానికి, అలాగే చేతులు ద్వారా రోగాలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడానికి అవకాశం ఉంది.
చేతులను శుభ్రం చేసుకోకపోవడం వలన హెపటైటిస్ ఏ, జీర్ణవ్యవస్థ సమస్యలు, జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్యలు వంటివి మనల్ని చుట్టుముడతాయి. చేతులు అపరిశుభ్రత కారణంగా అతిసారం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు సంభవిస్తాయి. అలాగే స్వైన్ ఫ్లూ వ్యాప్తికి కూడా చేతుల అపరిశుభ్రతే కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మపు గాయలు అయినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కు చీదినప్పుడు, పెంపుడు జంతువులను తాకినప్పుడు, వాటిని కడిగినప్పుడు, ప్రయాణం చేసిన తర్వాత, చిన్నపిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తరువాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. పిల్లలు మట్టిలో ఆడుకోని ఇంట్లోకి వచ్చిన ప్రతిసారీ చేతులు కడుక్కునేలా వారిని ప్రోత్సహించాలి. తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు విధిగా చేతులు శుభ్రం చేసుకోవాలని పిల్లల్ని పురమాయించడం ద్వారా వారి శరీరంలోకి వ్యాధికారక సూక్ష్మక్రిములు ప్రవేశించకుండా అడ్డుకోగలుగుతారు.
చేతులను నీళ్ళు, సబ్బు, శానిటైజర్లను ఉపయోగించడం వలన బాక్టీరియా, క్రిములను 60 % వరకు తొలగించవచ్చు. చేతి గోళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించుకొంటూ మట్టి చేరకుండా చూసుకోవాలి. మనకు తెలియకుండానే ఇంట్లో, బయట పలు రకాల వస్తువులను చేతులతో పట్టకుంటుంటాం. ఎక్కువగా చేతులు మారే కరెన్సీ నోట్లలో కూడా క్రిములు ఉండే అవకాశం ఉంది. నోట్లు లెక్కించే సమయాల్లో చేతులకు అంటుకుని క్రిములు శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆఫీసులో మన టేబుల్‌పై ఫైళ్లు, కంప్యూటర్, ఇతర వస్తువులపై సూక్ష్మక్రిములు తిష్ఠవేసుకొని ఉంటాయి. అందుకని ఉద్యోగులు భోజన విరామంలో క్యాంటీన్‌కు వెళ్లగానే విధిగా చేతుల్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బయటకి వెళ్లినప్పుడు హ్యాండ్ వాష్ శానిటైజర్‌లను వెంట తీసుకెళ్లాలి. యాంటీ బాక్టీరియల్ తడి టిష్యూ కాగితాలు ఎప్పుడూ వెంట ఉంచుకోవడం చాలా అవసరం.
వ్యక్తిగత పరిశుభ్రతలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యమైనది. కంటికి కనిపించని సూక్ష్మక్రిములు శరీరంలోకి పోకుండా ఇక్కడే నిరోధించవచ్చు. సో.. చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. వ్యాధులు రాకుండా చూసుకోండి.








