ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. అంటే సమపాళ్లలో కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే . . శరీరానికి అన్ని పోషకాలు అంది ఆరోగ్యకరంగా ఉంటారు.
పిండి పదార్థాలు , ప్రొటీన్ల కోసం రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ప్రొటీన్ల కోసం ఐతే చాలా ఎక్కువగా మాంసాహారంపైనే ఆధారపడతాం. ఐతే అన్ని రకాల విటమిన్లు , ఖనిజ లవణాలు , ప్రొటీన్లు కలిగి ఉన్న ఆహారం లభిస్తే అందరికీ లాభమే. అవును అవే గింజ ధాన్యాలు . వీటిలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు.
బీన్స్ లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా గింజ ధాన్యాలను తమ మెనూలో చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. ఎందుకంటే గింజ ధాన్యాలు కొంత తీసుకోగానే పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు. అంతే కాదు ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. అంతే కాకుండా బీన్స్ లో పీచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణప్రక్రియ సులభమవుతుంది.
మాంసాహరం వల్ల లభించే ప్రొటీన్ కంటే శాకాహారం ద్వారం లభించే ప్రొటీన్ల ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువని తెలిపారు. ఐతే మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్ లభించినా ఒక్కోసారి కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. కానీ శాకాహారంలో గింజ ధాన్యాల ద్వారా .. జీరో కొలెస్ట్రాల్ అందుతుంది. అలాగే ఒక గ్లాస్ పాల ద్వారా లభించే క్యాల్షియం కూడా బీన్స్ ద్వారా లభిస్తుంది. అంతే కాకుండా బీన్స్ లో అమినో యాసిడ్స్ , అధిక శక్తి కలిగిన యాంటీఆక్సిడెంట్స్ పాలీపెనాల్స్ ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.. ఫలితంగా డయాబేటీస్ వచ్చే అవకాశం తక్కువ .
గింజ ధాన్యాలు అంటే పప్పులు, చిక్కుళ్లు , సోయా లాంటివి అన్నమాట. అలాగే నట్స్ .. బాదం, జీడిపప్పు, వాల్నట్స్, ఆప్రికాట్స్, డేట్స్ ఇవన్నింటినీ నట్స్ అంటారు. వీటన్నింటినీ తీసుకుంటే శరీరానికి అధిక ప్రోటీన్స్ అందుతాయి. ఇవన్నీ శాకాహారంతో లభించే ప్రొటీన్లు కాబట్టి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. గింజధాన్యాల్లో లభించే క్యాల్షియం ద్వారా ఎముకలు, పళ్లు బలంగా తయారవుతాయి. అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని , గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. మానసిక సమస్యలు రాకుండా డిప్రెషన్ని దరిచేరనివ్వకుండా చూస్తాయి.
తరచూ గింజ ధాన్యాలు తీసుకోవడం వల్ల రక్తంలో చేరిన టాక్సిన్లు, హానికరమైన మలినాలను ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా గింజ ధాన్యాలు 16 వేల రకాలుగా లభిస్తాయి. వివిధ ఆకారాలు, వివిధ రంగుల్లో లభిస్తాయి. వీటన్నింటిని ఎలా తీసుకున్నా శరీరానికి ప్రయోజనం కలుగుతుంది. కొన్నిసార్లు నానబెట్టుకుని తినొచ్చు. ఉరుకులు.. పరుగుల మీద ఉద్యోగం చేసే వారు .. డ్రైగా వీటిని తీసుకోవచ్చు. ఉద్యోగం చేసేటప్పుడు విరామ సమయాల్లో డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటే . . . అదనపు శక్తి లభిస్తుంది.









