Healthy Teeth : దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే..?

By manavaradhi.com

Published on:

Follow Us
Healthy Teeth

మనలో చాలామంది దంతాల ఆరోగ్యం పట్ల అస్సలు శ్రద్ధ ఉండదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత పేరుకు బ్రష్ చేసేసే అలవాటే ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇది మినహా పంటి ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు. పంటి సంరక్షణ గురించి అవగాహన కూడా ఉండదు. కానీ, దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలరు. నోటి ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంలో దంతాలు కూడా అత్యంత ప్రధానమైనవి. కొందరి దంతాలు తెల్లగా తళతళ మెరుస్తూ ఉంటాయి. కొందరి దంతాలు పాచి పట్టి ఉంటాయి. కొందరిలో రంగు మారిన నల్లటి దంతాలను కూడా గమనించొచ్చు. పళ్లు తెల్లగా మెరుస్తుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. అదే సమయంలో పళ్లు రంగు మారి ఉంటే అనుమానించాల్సిందే. శరీరంలో ఇతర అవయవాల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటామో దంతాల విషయంలోనూ అది అవసరం. నిర్లక్ష్యం చేస్తే దంత సమస్యలు ఇతర సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

ఒక్కసారి దంత సమస్యలు వచ్చాయంటే తీవ్రంగా బాధిస్తుంటాయి. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాడం ద్వారా దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కొందరు ఏదైనా ఆహారాన్ని గంటల తరబడి నములుతూ ఉంటారు ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకునే సమయాలలో, మరియు గట్టిగా ఉండే పదార్ధాలు నములుతున్నప్పుడు ఇలా చేస్తుంటారు. ఇలా అధికంగా నమలడం వలన, దంతాలు ఒత్తిడికి లోనై, పళ్ల మద్య సందులు, చిగుళ్ళ వాపు, వంటి సమస్యలు అధికమవుతాయి. చాలా మందిలో గోళ్ళు కొరకడంసాధారణ అలవాటుగా ఉంటుంది. గోర్లను కొరకడం వలన దంతాలు అధిక ఒత్తిడికి లోనవడం వలన అనేక రకాల దంత సంబంధ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా దవడ కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

సిట్రస్ జాతి పండ్లు ఆరోగ్యానికి మంచిది. కానీ ఇవి తీసుకున్న వెంటనే నోరుకడిగే అలవాటు చేసుకోవాలి , లేక పోతే ఈ సిట్రస్ సమ్మేళనాలు బాక్టీరియా తో చర్య జరిపి పంటి ఏనామిల్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. దీని కారణంగా సెన్సిటివిటీ, కావిటీలు, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. కెఫీన్ దంతాలకు మంచిది కాదు, దంతాలమీద గారలు ఏర్పడడం, రంగు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కాఫీ తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోవడం మంచిది. అదేవిధంగా అధిక వేడి గల పదార్ధాలు కూడా తీసుకోవడం మంచిది కాదు. సోడా దంతాలకు అత్యంత ప్రమాదకారి. ముఖ్యంగా కార్బొనేటెడ్ చక్కెర స్థాయిలు కలిగిన సోడాలు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం మూలంగా స్వల్పకాలంలోనే అనేక దంత సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి సోడాలను , ముఖ్యంగా కృత్రిమ చక్కెరలను కలిగిన సోడాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

దంత ఆరోగ్యంలో కీలకమైనది దంతాల పరిశుభ్రత. రోజుకి రెండు సార్లు దంతధావనం తప్పనిసరిగా చేయాలి. దంతాలకు ఆహారం అతుక్కో కుండా చూసుకోవాలి. తినగానే తప్పనిసరిగా పుక్కిలించాలి. ఆరు నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి దంతాలను డాక్టర్‌చేత స్కేలింగ్‌ చేయించుకోవాలి. దీనివల్ల దుర్వాసన రాదు. దంత క్షయాన్ని నివారించ వచ్చు. పొగతాగడం, ఆల్కాహాల్‌, గుట్కా లాంటి అలవాట్లు దంతాలకు శత్రువులు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలమైన దవడలు, దంతాలు ఏర్పడతాయి. కాబట్టి మంచి ఆహారమే దంతాలకు క్షేమకరం. తాజా పండ్లు ఎక్కువగా తి నాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. చూయింగ్‌గమ్‌ మంచిదే. దంతాలకు వ్యాయామం నమలడం వల్ల, చక్కెర లేని చూయింగ్‌గమ్‌లు నమిలితే మరీ మంచిది. దంతాలు చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా దంతవైద్యుని సంప్రదిస్తూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

దురలవాట్లు మన దంతాలను దెబ్బతీస్తాయి. కాబట్టి మన దంతాలను సంరక్షించుకోవటమన్నది మన చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలి. ప్రస్తుతం చాలామంది లేనిపోని అలవాట్లతో పళ్లను చేజేతులా పాడుచేసుకుంటున్నారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాల్సిన పళ్లను 20, 30 ఏళ్లకే పోగొట్టుకుంటున్నారు. అందుకే అలవాట్ల విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలి.

Leave a Comment