Heart Health Tips – చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే మార్గాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Heart Risk in Winter

చల్లటి వాతావారణం.., చిక్కగా పరుచుకున్న మంచు దుప్పటి… లేలేత సూర్యకిరణాలు.., ఆస్వాదించడానికో కప్పు కాఫీ.. అబ్బా శీతాకాలపు ఉదయం వేళలు చెప్పుకోవడానికి ఎంత బాగున్నాయి కదా. నిజమే…, వాతావరణం అనుకూలించేంతవరకు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఉష్ణోగ్రతలు మన శరీరం తట్టుకోలేనంత పడిపోతేనే ఇబ్బందులు మొదలవుతాయి. చల్లటి గాలులు పెరిగేకొద్దీ జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న సమస్యలే కాదు.. గుండెకు ముప్పు పొంచి ఉంటుంది. నిజానికి హార్ట్ఎటాక్తో మరణాలు శీతాకాలంలోనే ఎక్కువ.

చలికాలం ఎంత ఆహ్లాదకరమో.. అంత ప్రమాదకరం కూడా. నిర్ణీత ఉష్ణోగ్రత కంటే పెరిగినా.. తగ్గినా మన శరీరం తట్టుకోలేదు. ఈ సమయంలో శరీరం బాగా ఇబ్బందిపడుతుంది. నిద్రాణంగా శరీరంలో ఉండిపోయిన అలర్జీలు, వైరస్లు విజృంభిస్తాయి. పడిపోయిన ఉష్ణోగ్రతలు రక్తప్రసరణ వేగాన్ని దెబ్బతీసి గుండెపోటుకు కారణం కావచ్చు.

సాధారణ రోజుల్లో కంటే శీతాకాలంలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. దుప్పటి ముసుగుతన్ని నిద్రపోవడం మినహా ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది. ఇక వ్యాయామాల్లాంటివే అసలే ఉండవు. దీంతో శరీరంలో కండరాలు, నరాలు పట్టేసినట్టు ఉంటాయి. అలాగే ఈ సీజన్లో శ్వాసకోశ ఇబ్బందులు సైతం సహజంగానే వస్తుంటాయి. జలుబు లాంటి చిన్న చిన్న ఇబ్బంది నుంచి ఆస్తమా, బ్రాంకైటిస్ వరకు తీవ్ర సమస్యలు వెన్నాడుతాయి. మానసికంగా కూడా కాస్త డిప్రెషన్ భావన ఉండవచ్చు. ఇవన్నీ కలగలసి గుండె జబ్బులు పెరిగేలా చేస్తాయి. ఈ శీతాకాలంలో సున్నా డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు గుండె ప్రమాదం ఎక్కువ.

చలికి వణకడం సహజం. అయితే గుండె సమస్యలున్నవారిలో ఈ వణుకుడు ఎక్కువ ఉంటుంది. బయట ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను బట్టి శరీరంలో హార్మోన్ల విడుదల అసంబద్ధంగా మారవచ్చు. అడ్రినలిన్‌, నారటలిన్‌ హార్మోన్ల ఉత్పత్తి హఠాత్తుగా పెరిగే అవకాశం ఉంది. దీంతో రక్తనాళాల్లో పేరుకున్న క్రొవ్వు ఒక్కసారిగా పగిలిపోతుంది. ఇలా పగిలిన క్రొవ్వు కణాలు రక్తనాళాల్లో అడ్డుపడి రక్తప్రసారం సాఫీగా జరగనివ్వవు. దీంతో గుండెకు అందాల్సినంత రక్తం అందక గుండె పోటు వస్తుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగదు కాబట్టే వణుకుడు ఎక్కువ ఉంటుంది. ఇక బీపీ ఉన్నవారికి కూడా ఇది కష్టకాలమే. రక్తపోటు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. దీంతో గుండెపోటు రావచ్చు. ఇక శ్వాసకోశ సంబంధ సమస్యలు కూడా గుండెపోటుకు పరోక్ష కారణం అవుతాయి.

ఈ కాలంలో ఊపిరితిత్తులకు కూడా సరిపడా గాలి అందదు. శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి గుండెపోటు రావచ్చు. చలికాలంలో ఆహారపు అలవాట్లు కూడా గుండెకు ముప్పును తెచ్చి పెడతాయి. శీతాకాలంలో సాధారణంగా తీసుకునే ఆహారం కంటే కాస్త స్పైసీ ఆహారాలు తినడానికి ఇష్టపడతారు. మసాలాలు, మాంసాహారాలు తరచూ తింటారు. నిజానికి శారీరక శ్రమ తగ్గే రోజులివి. ఇలాంటి కాలంలో త్వరగా జీర్ణమయ్యేవి తినాలి తప్ప.. జీర్ణవ్యవస్థను ఇబ్బందిపెట్టేవి తినకూడదు. కానీ వెచ్చగా ఉంటుందని, రుచిగా ఉందన్న సాకుతో క్రొవ్వు ఎక్కువ ఉండే ఆహారాలు లాగించేస్తారు. దీంతో గుండెపై ఒత్తిడి పెరిగి క్రమంగా హార్ట్‌ఎటాక్‌కు దారితీయవచ్చు.

చలికాలంలో గుండెపోటు మరణాలు పెరగడానికి అవగాహన లేమి కూడా ఓ కారణం. చాలా మందికి తమకు హృద్రోగ సమస్యలున్నట్టు గుర్తించలేరు. నిజానికి అలాంటి లక్షణాలు కూడా అంతకుమునుపు కనిపించవు. దీంతో శీతాకాలంలో తమకు నచ్చిన ఆహారం తింటూ, వ్యాయామం లేకుండా గడిపేస్తారు. ఇలాంటివారు గుండెపోటు వచ్చిందనే సంగతి గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి సన్నద్ధంగా ఉండరు. గుండెపోటు మరణాలు పెరగడానికి ఇదీ ఒక కారణం. కాబట్టి శీతాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారు చలికాలం ప్రారంభం నుంచే అప్రమత్తంగా ఉండాలి. తాము రోజువారీ వాడే మందుల్ని దగ్గరపెట్టుకోవాలి. చలిగాలులకు ఆరుబయట తిరగకపోవడం మంచిది. తీవ్రంగా గాలులు వీస్తున్నప్పుడు పనులు వాయిదా వేసుకోవడమే ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే మఫ్లర్, స్వెట్టర్ లాంటివాటిని ఉపయోగించాల్సిందే. వెచ్చని దుస్తులు ధరించాలి. అలాగే వ్యాయామం చేయడం మానకూడదు. చలిగాలులు తీవ్రంగా ఉంటే కనీసం ఇంట్లోనయినా 20 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. కార్డియో ఎక్సర్సైజ్లు, తేలికపాటి వ్యాయామాలు, యోగా లాంటివి శరీరంలో ఫ్లెక్సిబులిటీ పెంచుతాయి.శరీరానికి రోజూ కనీసం పదిహేను నిమిషాలయినా ఎండ తగిలేలా చూసుకోవాలి.

ఆహారం విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలి. సమతుల ఆహారమే అన్నివేళలా మంచిది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చికెన్, మటన్ కంటే చేపలు, గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవడం శ్రేయస్కరం. ఇక ఎవరి శరీరానికి సంబంధించిన అవగాహన వారికి ఉండాలి. రక్తసంబంధీకుల్లో ఎవరికైనా హృద్రోగ సమస్యలున్నాయా, వారికి ఏ వయసులో బయటపడ్డాయి లాంటి విషయాలను తెలుసుకోవాలి. ఇక బిఎంఐకు తగ్గట్టు బరువు అదుపులో ఉంచుకోవాలి. నలభై ఏళ్ల పైబడినవారు రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలున్నాయేమో తెలుసుకుని జాగ్రత్తలు పాటించాలి.

వేసవి కాలంలో అతివేడి,చెమట… వాతావరణాన్ని ఆస్వాదించలేం. వర్షాకాలంలో కాలు బయటపెట్టడమే కష్టం. ఇక ప్రకృతిని ఆస్వాదించాలంటే చలికాలమే బెటర్ అని చాలామంది భావిస్తారు. అది నిజమే, అయితే అందుకు షరతులు కూడా ఉన్నాయి. ఆరోగ్యం బాగున్నప్పుడు, తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే శీతాకాలంలో ప్రకృతిని ఆస్వాదించగలం. కాబట్టి ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలే కాదు.. ఈ కాలంలో హృద్రోగాలు కూడా బాధించవు.

Leave a Comment