కమ్మనైన అమ్మతనం కోసం ప్రతి స్త్రీ పరితపిస్తూ ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. గర్భం ధరించిన నాటి నుంచి.. తన కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఆరాటపడుతుంది. మరోవైపు ఎన్నో సందేహాలు, భయాలు. ఇలాంటి సమయంలోనే ముందు జాగ్రత్త చర్యలు .. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. పోషకాహారం తీసుకుంటున్నప్పటికీ, బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన తగిన జాగ్రత్తలు పాటించినప్పటికీ… కాన్పు సమయం వరకు రకరకాల అరోగ్య సమస్యలకు గురికాక తప్పదు.
సృష్టిలోనే మధురమైనది మాతృత్వం… మాతృత్వం పొందాలని… పండంటి బిడ్డకు జన్మనివ్వాలని వివాహమైన ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. మహిళ తల్లిగా మారే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కుంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులుగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే టైమ్ లేదనో… విధినిర్వహణలో బిజీగా ఉండటం వల్లనో… రకరకాల నమ్మకాల వల్లనో… చాలా మంది ప్రెగ్నెన్సీని కొంత కాలం పాటు వాయిదా వేసుకుంటుంటారు. ఇవి దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తాయనే విషయం తెలిసినా… పెడచెవిన పెడుతున్నారు.
గర్భీణీల్లో రక్తపోటు పెరగకుండా చూసుకోవడం అవసరం. 5,6,7 నెలల్లో కనుక బీపీ పెరిగితే సమస్యగా తయారవుతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోని పక్షంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని నివారణకు ఆంటీ నేటల్ చెకప్స్ రెగ్యులర్‌గా చేయించుకోవాలి. జెష్టేషనల్ హైపర్‌టెన్షన్‌లో కేవలం బీపీ మాత్రమే పెరుగుతుంది. ఫ్రి ఎక్‌లాంప్సియాలో బీపీతో పాటు మూత్రంలో ఆల్బుమిన్ పోవడం, ఒంట్లో నీరు చేయడం వంటివి జరుగుతాయి. ఇక క్రానిక్ హైపర్ టెన్షన్‌లో గర్భం రాకముందు నుంచే బీపీ అధికంగా ఉంటుంది. ఇది హార్మోన్లలో మార్పులు, జన్యుపరమైన కారణాలు, రక్తనాళాలు సంకోచించడం, బీపీ పెరగడం వల్ల అవయవాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా ప్రధాన అవయవాలు క్రమంగా దెబ్బతిని, ప్రాణాపాయస్థితి ఏర్పడే అవకాశముంటుంది. ప్రి ఎక్లాంప్సియా ఉన్న మహిళల్లో తరచూ కాళ్లు, చేతులు ఉబ్బుతాయి. సాధారణ రక్తపోటు ఉండే మహిళల్లో సాధారణంగా 20 నెలల గర్భధారణ తర్వాత ప్రి ఎక్లాంప్సియా వస్తుంది. ప్రీయెక్లాంప్సియాకు ఉన్న ఏకైక నివారణ కాన్పు జరగడమే. ప్రీయెక్లాంప్సియాని సరిగ్గా నియంత్రించకపోతే నెలలు నిండకుండానే ప్రసవం.. పిండం సరిగ్గా ఎదగకపోవడం వంటివి సంభవించవచ్చు. సాధారణంగా గర్భం దాల్చాక కలిగే హార్మోనల్ తేడాల వల్ల ఒంటిలో చక్కెర పాళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జస్టెషనల్ డయాబెటిస్‌కు దారితీయవచ్చు. ప్రెగ్నెన్సీపై డయాబెటిస్ కారణంగా పిండంపై దుష్ర్పభావాలు పడి పిండం ఎదిగే దశలో అంటే… అవయవలోపాలు జరగవచ్చు. దీనికి టిఫా పరీక్షతో పాటు ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ కూడా చేయించి వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి.
గర్భాశయం వెలుపల గర్భం సంభవించడాన్ని… ఎక్టాపిక్ గర్భధారణ అంటారు. చాలా సందర్భాల్లో ఇది స్త్రీ బీజ వాహికలో సంభవిస్తుంది. అరుదుగా, పిండం స్త్రీ బీజకోశాలు, కటి వలయం, దిగువ ఉదరంలో ఏర్పడవచ్చు. ఎక్టాపిక్ గర్భధారణలను కొనసాగించడం కన్నా తొలగించడమే ఉత్తమం. పెరుగుతున్న పిండం తల్లి ప్రాణాలకే ప్రమాదంగా మారగలదు. అది ఎదగడానికి తగినంత ప్రదేశం అందుబాటులో లేకపోవడం వలన, అది తానున్న ప్రదేశాన్ని చీల్చడం వల్ల, తీవ్రమైన నొప్పి ఏర్పడి, ప్రాణాలకే ముప్పు తెచ్చే సమస్యలకు దారి తీయవచ్చు. ప్రాధమిక దశలోనే గుర్తించి, చికిత్స చేయడం వల్ల, భవిష్యత్తులో సాధారణ గర్భధారణ జరిగే అవకాశాలు మెరుగుపడతాయి.
గర్భాశయం గోడలకు ఒకటిగా గానీ సమూహంగా గానీ ఫైబ్రాయిడ్స్ తయారవుతాయి. మహిళలు 50 ఏళ్ళకు చేరుకునేటప్పటికి దాదాపు 20 నుంచి 80 శాతం మందిలో ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయి. అందరిలో ఫైబ్రాయిడ్స్ లక్షణాలు కనిపించాలని లేదు. కొంతమందిలో నొప్పి ప్రధాన లక్షణమైతే మరికొంతమందిలో అధిక రుతుస్రావం ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రకోశం, మలాశయంపై ఒత్తిడి పడుతుంది. వంశపారంపర్యంగా కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఎడీమా లేదా నీరు చేరడం అనేది ఎదుగుతున్న బిడ్డకు, ప్రసవానికి అనుకూలంగా గర్భణీ శరీరాన్ని సిద్ధం చేసే ప్రకృతి చర్య . గర్భధారణ సమయంలో కొద్దికొద్దిగా శరీరం ఉబ్బే పరిస్థితి సర్వసాధారణంగా పరిగణించబడుతుంది. గర్భధారణ సమయంలో నీరు చేరిక వలన బరువు ఎక్కువగా పెరుగుతారు. గర్భధారణ, బిడ్డ పోషణ సజావుగా సాగడానికి సాధారణ గర్భధారణకు శరీరంలో అదనపు ద్రవాలు అవసరమవుతాయి. గర్భిణీల ఉదరం.. శరీర ద్రవాల ప్రసరణకు ముఖ్యంగా దిగువ శరీరంలో ప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా శరీర దిగువ భాగాల్లో నీరు చేరుకుంటుంది. శరీరంలో నిరంతరంగా పని చేసే పలు హార్మోన్లు.. గర్భిణీల్లో ఎడీమాకు మరో కారణంగా చెప్పవచ్చు. నీరు చేరడంను సమస్యగా భావించనవసరం లేదు.
సరైన సమయంలో రుతుక్రమం రావటం వలన అండోత్సర్గ సమయాన్ని సరిగ్గా అంచనా వేయవచ్చు. అండం విడుదలైన సమయంలో భాగస్వామితో రతిలో పాల్గొనటం వలన గర్భం దాల్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. క్రమరహిత రుతుక్రమాల వలన గర్భం దాల్చటానికి అవకాశం ఉండదు. కావున వైద్యుడిని కలిసి సరైన సూచనలు తీసుకోవాలి. అదేవిధంగా అధిక బరువు, బరువు తక్కువగా ఉండటం వలన కూడా గర్భధారణలో సమస్యలు కలగవచ్చు. అధిక బరువు ఉన్న స్త్రీలలో, రుతుక్రమ సమస్యలు ఏర్పడి, అండం విడుదల సమయంపై అవగాహన లేక అండం ఫలదీకరణలో సమస్యలు కలిగే అవకాశం ఉంది. తక్కువగా బరువు ఉన్న స్త్రీలలో ఐరన్, కాల్షియం వంటి ములకాలలో లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి వలన అనీమియా లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అలాగే స్త్రీలలో వయసు పెరిగే కొద్ది ఫలదీకరణ సమస్యలు తగ్గడమే కాకుండా అండాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇలాంటి సమస్యల వలన స్త్రీలలో గర్భాన్ని పొందటం కూడా కష్టమే. 40 ఏల్ల వయసు ఉన్న స్త్రీలు… గర్భాన్ని దాల్చే అవకాశాలు 50 శాతం మాత్రమే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఉద్యోగరీత్యా మహిళలు గర్భధారణను వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా సరైన సమయానికి అండం విడుదల కాకుండా ఉండే సమస్య ఉత్పన్నమవుతుంది. గర్భం ధరించాలని అనుకున్నప్పుడు అండాలు విడుదల కాకపోవడం, గర్భాశయం జారిపోవడం వంటి సమస్యలతో గర్భం దాల్చడం ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్నాయి
గర్భం దాల్చింది మొదలు పండంటి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు గర్భిణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
- మూడో నెలలోపు టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి.
- నాలుగో నెలలో రెండోది, 9వ నెలలో కాన్పుకు ముందు మూడో టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి.
- ఆకుకూరలు, పాలు, పండ్లు, మాంసకృత్తులు లభించే పప్పుధాన్యాలు చిరుధాన్యాలు తీసుకోవాలి.
- రోజూ ఆహారంలో ఒక గుడ్డును తీసుకోవాలి.
- కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ పౌడరు నీరు, మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలి.
- రక్తహీనతను తగ్గించుకునేందుకు నిమ్మ, దానిమ్మ, జామ, కమల వంటి సి-మిటమిన్ పండ్లరసాలు తీసుకోవాలి. ఇవి ఐరన్‌ను తోందరగా గ్రహిస్తాయి.
- రక్తహీనతను తగ్గించేందుకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను రోజుకు రెండు చొప్పున కాన్పు వరకు, కాన్పు అనంతరం తీసుకోవాలి.
గర్భవతి అని నిర్థారణ అయిన ప్రతీ మహిళ… వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రతి నెల క్రమం తప్పకుండా డాక్టర్ సలహాలు, సూచనలు పాటించాలి. తగిన పౌష్టికాహారం, విశ్రాంతి తీసుకోవలసి వుంటుంది. జలుబు, జ్వరం వంటి చిన్న రుగ్మతలకు కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలి.