Joint pains: కీళ్ల నొప్పులను తగ్గించే చిట్కాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Joint pains

ఆధునిక జీవనం కీళ్లపై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నది. ఎక్కువ సమయం పాటు కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి ఎన్నో కారణాలు, పరోక్షంగా కీళ్లనొప్పులకు దోహదం చేస్తున్నాయి. మ‌రి కీళ్లు గట్టిప‌డ‌కుండా ఏంచేయాలి..? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..?

కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి. కీళ్లనొప్పులు సాధారణంగా వృద్ధాప్యంలో ఎవరికైనా వస్తాయి. మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు తదితర భాగాల్లో ఉండే కీళ్లు నొప్పులకు గురవుతాయి. మన శరీరంలోని కదలికలకు వెన్నెముక, మోకాలి కీలు, తుంటి కీలు ­చాల ముఖ్యమైనవి. కీళ్లు బలంగా ఉండాలంటే, కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు బలంగా ఉండాలి. కీళ్లల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మోకాళ్లు, ఇతర కీళ్లల్లో విపరీతమైన నొప్పి, వాపు, బిగుసుకుపోవడం, నడవడంలో ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్లు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలు ఆకృతిలో నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. కీళ్ల అరుగుదల బాగా ఎక్కువైపోయిన తర్వాత కీళ్ల కదలిక కూడా తగ్గిపోతుంది. కండరాలు పటుత్వం కోల్పోయి వ్యవస్థలో అసమానతలు ఏర్పడతాయి. కీళ్ల‌లో ఉండే కార్టిలేజ్ ప‌లుచ‌బ‌డ‌టం వ‌ల్ల ఇలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతుంటాయి.

కదలికల అవసరాన్ని బట్టి కీళ్ళు శక్తిని పొందడమా లేదా కోల్పోవడం జ‌రుగుతుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్ కార‌ణంగా కీళ్లు వాచి, గట్టిపడి నొప్పి పెడతాయి. ఈ వ్యాధి స్త్రీలలో సాధారణంగా కనిపిస్తుంది. ఆస్టియో ఆర్థ‌రైటిస్‌ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన చోట కాకుండా, వేరే చోట ఏర్పడతాయి. తద్వారా ఆస్టియోఫైట్స్‌ కీళ్లను రాపిడికి గురిచేస్తాయి. ఫ‌లితంగా కీళ్లు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ల లోపలి ద్రవం సన్నటి రంద్రాల ద్వారా ఎముకల మధ్యలోకి వెళ్లి గడ్డలుగా తయారవుతాయి. ఈ కారణంగా ఎముకల్లోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం కలుగుతుంది. క్రమంగా కీళ్లలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్లు గట్టిగా మారి కదలికల్లోని ఇబ్బంది ఎక్కువ అవుతుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల కీళ్లు మాత్రమే కాకుండా, చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు కూడా ప్రభావితమవుతాయి. గుండె,మెదడు, రోగ నిరోధక కణాలపై కూడా ప్రభావం పడవచ్చు.

కీళ్లు గ‌ట్టిపోవ‌డం కార‌ణంగా చిన్న చిన్న పనులు కూడా చేయలేని స్థితి ఏర్పడుతుంది. కూర్చుని లేవడం, మెట్లు ఎక్కడం, దిగడం, వంటివి ఇబ్బందికరంగా మారతాయి. నీరసం, బరువు తగ్గిపోవడం, జ్వరం, ఆకలి లేకపోవడంలాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు స్థిరంగా ఉండవు. కీళ్ల నొప్పులు వాటికవే తగ్గిపోయే అవ‌కాశాలు కూడా ఉంటాయి. యోగ సాధ‌న ద్వారా కీళ్ల‌పై ఒత్తిడి త‌గ్గించుకోవ‌చ్చు. లక్షణాలు తీవ్రతంగా ఉంటే చేతి కర్ర సహాయంతో కాని, వాకర్స్‌ ద్వారా కాని నడవాలి. స్ట్రెచింగ్‌, స్ట్రెంతనింగ్‌, కండిషనింగ్‌ వ్యాయామాలు చేయాలి. మోకాళ్లు, మడమలు, పాదాల్లో సమస్య ఉన్నప్పుడు ఈత మంచి వ్యాయామం. కాల్షియం అధికంగా ల‌భించే పాలు, పెరుగు, అత్తి పండ్లు, సాల్మన్ చేపలు ఆహారంలో భాగం చేసుకోవాలి. విట‌మిన్ C అధికంగా ల‌భించే సిట్ర‌స్ జాతి పండ్ల‌తో పాటు విట‌మిన్ బీ3, ఈ దొరికే ఆహారాల‌తోపాటు నీరు అధికంగా తీసుకోవాలి. విట‌మిన్ డీ ల‌భించేలా ఉద‌యం నీరెండ‌లో కొద్దిసేపు గ‌డ‌పాలి.

Leave a Comment