Laparoscopic Hernia : హెర్నియాకు ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ సురక్షితమేనా…?

By manavaradhi.com

Published on:

Follow Us
Laparoscopic Hernia

ప్రపంచంలో దాదాపు 2 కోట్ల మందికి పైగా హెర్నియాతో బాధపడుతున్నారు. వీరిలో ఒకసారి హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న వారి సంఖ్యే ఎక్కువ. నిజానికి హెర్నియా అనేది వ్యాధి కాదు… కేవలం ఓ వాపు మాత్రమే. శరీరంలో ఉన్న కండర వ్యవస్థ బలహీన పడి పట్టు తప్పినప్పుడు… హెర్నియా లాంటి సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో హెర్నియాకు ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ల రూపంలో ఓ మంచి పరిష్కారం లభిస్తోంది. ఇందులోని లాభనష్టాలు గురించి తెలుసుకుందాం..

శరీరం లోపల ఉన్న అవయవం తన స్థానం నుంచి బయటకు చొచ్చుకురావటాన్నే ‘హెర్నియా’ అంటారు. ఇందులో ఎన్నో రకాలున్నా అత్యంత సాధారణంగా కనిపించే సమస్య.. ‘ఇంగ్వైనల్‌ హెర్నియా’. దీన్లో పొత్తికడుపులోని పేగులు పొట్ట దగ్గరున్న కణజాలాన్ని నెట్టుకుంటూ చర్మం అడుగున ఓ మూటలాగా బయటకు చొచ్చుకొని కనిపిస్తాయి.

ఈ రకం హెర్నియా పొత్తికడుపు, గజ్జల దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఇంగ్వైనల్‌ రీజియన్‌లో ప్రదేశాలను బట్టి డైరెక్ట్‌, ఇన్‌డైరెక్ట్‌, ఫిమరల్‌ అనే మూడు రకాల హెర్నియాలు వస్తాయి. వీటిలో ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు లేదా చేత్తో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంథ్రం పరిమాణం పెరుగుతూపోయేకొద్దీ లక్షణాలు కూడా తీవ్రమవుతుంటాయి.

పుట్టుకతోనే మన పొత్తికడుపులో ‘ఇంగ్వైనల్‌ కెనాల్‌’ అనే సహజసిద్ధమైన ఓపెనింగ్‌ ఉంటుంది. ఏడవ నెల గర్భంలో మగ పిల్లల్లోనైతే ఈ కెనాల్‌లో బీజాలు చోటు చేసుకుని ఉండి ప్రసవానికి ముందు కిందకి జారతాయి. ఆడపిల్లల్లోనైతే ఈ కెనాల్‌లో మూత్రాశయ లిగ్మెంట్లు ఉండి ప్రసవానికి కొద్ది రోజుల ముందు కిందకి జారతాయి. ఈ రకమైన శారీరక లక్షణం కారణంగా స్వతస్సిద్ధంగానే స్త్రీ పురుషుల పొత్తికడుపుల్లో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ కెనాల్స్‌ ఉన్న చోట కణజాలం కూడా కాస్త బలహీనంగా ఉంటుంది. దీనికితోడు పెరిగే వయసు, సర్జరీలు, వ్యాధుల కారణంగా పొత్తికడుపు మీద ఒత్తిడి పెరిగితే ఈ కెనాల్‌లోకి పేగులు చొచ్చుకునివచ్చి ‘హెర్నియా’ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యకు కారణాలు వ్యాధులు, వయసు, శరీర తత్వాలనుబట్టి మారుతూ ఉంటుంది.

హెర్నియా నివారణకు ఓపెన్‌ సర్జరీ, ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్‌ సర్జరీ కంటే కూడా ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీ ద్వారా చిన్న గాటుతో శస్తచ్రికిత్సను నిర్వహిస్తారు. దీంతో త్వరగా కోలుకోవడంతో పాటు, హాస్పిటల్‌లో ఉండే సమయం బాగా తగ్గుతుంది. నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్‌కు ఒకటి నుంచి రెండు గంటల సమయం పడుతుంది. తిరిగి వారంలో సాధారణ జీవితం గడిపేందుకు అవకాశముంటుంది.

నిజానికి 1990 వరకూ హెర్నియాకు పెద్ద శస్త్రచికిత్సలు చేసేవారు. తిత్తిని తొలగించి కుట్లు వేసే ‘బాసినీస్‌ రిపెయిర్‌’ పద్ధతిని అప్పట్లో అనుసరించేవారు. ఈ పద్ధతిలో కుట్లతో తిత్తి తొలగించిన అంచులను అతికించేవారు. ఈ సర్జరీ కోసం పెద్ద కోత పెట్టడం వల్ల సర్జరీ సమయంతోపాటు, రోగి కోలుకోవటానికి ఎక్కువ సమయం పట్టేది. ఇదేకాకుండా మల్టిపుల్‌ లేయర్‌ రిపెయిర్‌ పద్థతిని అనుసరించేవారు. ఆ తర్వాత షోల్డీస్‌ అనే పద్ధతిని అనుసరించారు. ఇప్పుడు సురక్షితమైన ‘మెష్‌ప్లాస్టీ’ పద్ధతిని ఎక్కువగా అనుసరిస్తున్నారు. రోగి వయసు, శరీర బరువు, హెర్నియా పరిమాణం, ఇతరత్రా వ్యాధులను పరిగణలోకి తీసుకుని అందుకు అనువైన సర్జరీలను ఎంచుకునే వెసులుబాటు ప్రస్తుతం అనుసరిస్తున్న సర్జరీ విధానాల్లో ఉంటోంది. వీటిల్లో ల్యాప్రోస్కోపీ కీలక పాత్ర పోషిస్తుంది.

లాప్రోస్కోపీ టెక్నిక్‌లో చర్మం ద్వారా హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకుని మొదట తిత్తిని కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయటంతోపాటు సాగిన చర్మపు పొరలన్నిటికీ విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్‌ను లాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్లాక మెష్‌ను పరుస్తారు. మెష్‌తో రంథ్రాన్ని మూసివేశాక కుట్లు వేయటం లేదా పిన్స్‌ కొట్టడం చేస్తారు. చిన్న సైజు హెర్నియాకైతే ఒకే ఒక రంథ్రం ద్వారా సర్జరీని పూర్తి చేస్తారు. ఒకవేళ రంథ్రం మరీ పెద్దగా ఉండి పెద్ద మెష్‌ అమర్చాల్సివస్తే రంథ్రానికి నాలుగు వైపుల్నుంచి నాలుగు రంథ్రాల ద్వారా లాప్రోస్కోపీ టెక్నిక్‌తో సర్జరీని పూర్తి చేస్తారు.

హెర్నియా రంథ్రాన్ని కుట్లు వేసి మూసివేయటంతోపాటు మరోసారి హెర్నియా రాకుండా ఆ ప్రదేశంలో మెష్‌ అమరుస్తారు. అయితే రోగి శరీర తత్వాన్నిబట్టి కొందరికి చర్మం అడుగునుంచి, పొట్ట లోపలినుంచి లేదా కండరాల మధ్యన మెష్‌లను అమరుస్తారు. మెష్‌ల్లో కూడా టెఫ్లాన్‌, పీటీఎఫ్‌ఈ, పాలీప్రొపిలీన్‌, పాలయెస్టర్‌ అనే రకరకాల మెష్‌లు ఉంటాయి. సర్జరీకి ఎంచుకున్న పద్ధతి, ప్రదేశాలనుబట్టి ఏ రకం మెష్‌ వాడాలో వైద్యులు నిర్ణయించుకుంటారు. ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గిన వారికి శరీరంలో కలిసిపోయే అబ్జార్బబుల్‌ మెష్‌, అలా కానివాళ్లకి నాన్‌ అబ్జార్బబుల్‌ మెష్‌ బిగించొచ్చు. శరీరంలో కలిసిపోయేందుకు ఫిల్మ్‌ ఉండే మెష్‌లు వాడతారు. పొట్ట లోపలి నుంచి మెష్‌ అమర్చాల్సివస్తే ఈ ఫిల్మ్‌ ఉండే మెష్‌లనే ఎంచుకోవాలి. లేదంటే పేగులు మెష్‌కు అంటుకుపోయి కొత్త సమస్యలు తలెత్తవచ్చు.

ఇంగ్వైనల్‌ హెర్నియాకి మెష్‌ అమర్చేటప్పుడు డైరెక్ట్‌, ఇన్‌డైరెక్ట్‌, ఫెమరల్‌.. ఈ మూడు హెర్నియాలు రాకుండా మూడు రంథ్రాలను కవర్‌ చేయాలి. ఏ ఒక్క రంథ్రాన్ని మూయకపోయినా దాన్నుంచి తిరిగి పక్కనుంచి హెర్నియా వచ్చే అవకాశాలుంటాయి. ఇక ఇన్‌సిషనల్‌ హెర్నియాల్లో.. అంటే పోస్ట్‌ ఆపరేటివ్‌ హెర్నియాల్లో సర్జరీ పద్ధతి వేరుగా ఉంటుంది. చర్మపు పొరల్లో, పేగుల్లో ఉన్న అతుకులన్నిటినీ సరిచేసి మెష్‌ అమరుస్తారు. హెర్నియా సర్జరీలో చర్మపు పొరల్లో వేసే కుట్లు వాటంతటవే కరిగిపోయేవై ఉంటాయి. కాబట్టి కుట్లు తొలగించాల్సిన అవసరం ఉండదు. పెద్ద బరువులను ఎత్తడం, డ్రైవ్‌ చేయడం వంటివి నెల రోజుల పాటు ఆపాల్సి ఉంటుంది. సర్జరీ సమయంలో ఉపయోగించే మెష్‌లు నాణ్యమైనవి అయి ఉండాలి. వీటితో పాటు ముఖ్యంగా ఈ సర్జరీలు చేయించుకునే వారు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో రెగ్యులర్‌గా శస్తచ్రికిత్సలు జరిగే సెంటర్‌ను ఎన్నుకోవడం చాలా ముఖ్యం.

ఒకసారి సర్జరీ చేసినా హెర్నియా తిరిగి వస్తుందనే ఓ నమ్మకం ఉంది. ఇందుకు ప్రధాన కారణం సర్జరీ టెక్నిక్‌ సరిగా పాటించకపోవటమే. సరైన పద్ధతిలో మెష్‌ను అమర్చకపోతే హెర్నియా తిరగబెడుతుంది. ఇక ఇన్‌సిషనల్‌ హెర్నియా ఫెయిల్‌ అవటానికి ప్రధాన కారణం అమర్చిన మెష్‌ కుంచించుకుపోవటమే! ఇందుకోసం హెర్నియా పరిమాణానికి తగిన మెష్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా చూసుకోగలిగితే హెర్నియా సర్జరీ ఫెయిలవకుండా ఉంటుంది. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా హెర్నియాకు బిగించిన మెష్‌ తొలగించాల్సివస్తే దాన్ని తీసి ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తగ్గాక మరో కొత్త మెష్‌ అమర్చాల్సి ఉంటుంది.

హెర్నియా రాకుండా ఉండాలంటే పొత్తికడుపు మీద ఒత్తిడి పనే పనులకు దూరంగా ఉండాలి. అలాగే సర్జరీల కోసం అనుభవఙ్ఞులైన వైద్యులను ఎంచుకోవాలి. సాధారణ ప్రసవం, సిజేరియన్‌ సర్జరీ తర్వాత తప్పనిసరిగా పొట్ట కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి.

మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మధుమేహం అదుపులో ఉంచుకోవాలి. దగ్గు తెప్పించే ధూమపానం మానేయాలి. పురుషులు ప్రొస్టేట్‌ గ్రంథి సమస్యలను సరిదిద్దుకోవాలి. బరువులెత్తేటప్పుడు క్రమపద్ధతి పాటించాలి. ఎత్తుకు తగిన బరువు మెయింటెయిన్‌ చేయాలి. అధిక బరువు తగ్గించుకోవాలి. దగ్గుకి కారణమయ్యే రుగ్మతల్ని అదుపు చేయాలి. ఇవన్నీ పాటిస్తూ ఉండడం ద్వారా హెర్నియా మళ్ళీ తిరగబెట్టకుండా జాగ్రత్తపడొచ్చు

Leave a Comment