Lung Health : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Lung health

నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ప్రజలు సిగరెట్లకు అలవాటుపడి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు ఇతర వ్యాధులబారిన పడుతున్నారు. ధూమపానం వల్లే ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అమెరికన్ లంగ్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఊపిరితిత్తులు అనేక రకాల ఇన్ఫెక్షన్లు, ధూమపానం, గాలి కాలుష్యం కారణంగా దెబ్బతిని ఆస్తమా, సి‌ఓ‌పి‌డి వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. తగిన న జాగ్రత్తలు తీసుకుంటేనే ఇలాంటి సమస్యలను దూరంగా ఉంచవచ్చు.

ఆస్తమా బారినపడిన వారి ఊపిరితిత్తుల్లోని వాయు మార్గాలు ఎర్రబడి కుచించుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలో విటమిన్-డీ తక్కువగా ఉంటే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శిశువుల్లో జన్యు లోపం వల్ల కూడా ఇది రావచ్చు. అందువల్ల ఆస్తమాతో బాధపడుతున్నవారు తమ సమస్య ఏమిటన్నది ముందుగా తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమాకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పెద్దయ్యేకొద్దీ వారిలో ఆస్తమా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వారు చలికి గురికావడం, దుమ్ము, కాలుష్యం వంటి వాటికి దూరంగా ఉంటే ఎంతో మంచిది.

ఊపిరితిత్తులు దెబ్బతినడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మన ఇంట్లోని కాలుష్యం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది. ఇంట్లో మనం ఉపయోగించే పరదాలు, కార్పెట్లలో చాలా దుమ్ము పేరుకుపోతుంది. అందువల్ల వీటిని తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. అలాగే కిచెన్‌ లో ఉపయోగించే టవల్ ను కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎక్కువగా అగర్‌బత్తీలను వెలిగించడం వల్ల ఆ పొగ ఊపిరితిత్తులలోకి చేరి శ్వాస ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది.

ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవారిని ఈ పొగ మరింతగా ఇబ్బంది పెడుతుంది. అందువల్ల అగరువత్తులను ఎక్కువగా వెలిగించకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లోని ఏసి ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వీటిని కూడా తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. గ్యాస్ ను ఉత్పత్తిని చేసేచోట పిల్లలు, పెద్దలు తిరగడం వల్ల శ్వాస సమస్యలు, దగ్గు, అలర్జీ వంటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ప్రదేశాల్లో తిరగకుండా జాగ్రత్తపడాలి. దీంతోపాటు విష రసాయనాలు ఎక్కువగా ఉండే చోట నివసించేవారికి క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని కూడా రెగ్యులర్‌గా శుభ్రపరుస్తూ ఉండాలి.

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే సిగరెట్లు, బీడీలు తాగడం మానాలి. సిగరెట్ లు తాగడం మానేస్తే చాలావరకు క్యాన్సర్ రాకుండా నియంత్రించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మన జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే క్యాన్సర్ రాకుండా నియంత్రించవచ్చు. ఆల్కహల్ ఎక్కువగా తాగడం వల్ల కూడా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. అందువల్ల మద్యం తాగడాన్ని పూర్తిగా మానాలి. కొన్నిసార్లు ఊబకాయం వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఎత్తుకు తగినట్టుగా బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. దుమ్ము, ధూళికి లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్య భరిత ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలి. అలాగే వ్యాయామం చేయడం వల్ల కూడా శ్వాసక్రియ వేగం పెరిగి ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా నీళ్ళు ఎక్కువగా తాగాలి, చేతులను ఎప్పుడూ దుమ్ము, ధూళి లేకుండా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. హాయిగా నవ్వితే కూడా శ్వాసనాళాలు సక్రమంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తుల పనితీరు, వాటికి వచ్చే సమస్యలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఊపిరితిత్తులను రక్షించుకోవచ్చో తెలుసుకున్నారు కదూ. ఇకనుంచైనా చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీ ఊపిరితిత్తులను కాపాడుకోండి.

Leave a Comment