శరీరంలో అనారోగ్యం ఎదైనా ఉంటే . . కొన్ని అవయవాలు . . అనారోగ్యాన్ని సూచించే విధంగా సంకేతాలు పంపిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు రానున్నాయనే సంకేతాలను కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. చేతి వేళ్లు, కాలి వేళ్లకు ఉండే గోళ్లు కూడా ఇందులో తక్కువేమీ కాదు. రకరకాల దీర్ఘకాలిక రోగాలను ముందుగానే ఇవి సూచిస్తాయి.
గోరంత గోరు.. కొండంత వ్యాధులకు సంకేతంగా నిలుస్తుంది. అవును ఇది నిజం. సాధారణంగా గోళ్లను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సమస్త ఆరోగ్యానికి సంబంధించిన సంకేతాలను గోళ్లు తెలియజేస్తాయి. గోళ్లు .. వాటి రంగును బట్టి .. ఆయా అనారోగ్యాలను గుర్తించవచ్చు. అంటే తెల్ల, గులాబీ, పసుపు రంగులతోపాటు పాలిపోయినట్లుగా ఉండే గోళ్లను బట్టి రకరకాల అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు. అక్కడక్కడ తెల్లగా… అక్కడక్కడ గులాబీ రంగులో ఉండే గోళ్లు.. కాలేయం, ఊపిరితిత్తులు, గుండెల్లో ఏదో సమస్య ఉన్నట్లు సూచిస్తాయి. కాబట్టి గోళ్లు ఇలా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించాలి. కొంతమందిలో పాలిపోయినట్లుగా గోళ్లు కనిపిస్తాయి. అలాంటి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉందని గ్రహించాలి. ఎనీమియా, రక్తప్రసరణ లేకుండా గుండె ఆగిపోవడం .. , కాలేయ వ్యాధులు, పోషకాహార లోపం సమస్య వంటివి ఉన్నాయని తెలుసుకోవచ్చు.
గోళ్లు పూర్తిగా తెల్లబడినట్లుగా ఉంటే కూడా అనారోగ్యం ఉన్నట్లే లెక్క. పూర్తిగా గోళ్లు తెల్లబడితే కాలేయ సమస్యలు వచ్చినట్లు సంకేతమన్నమాట. అంటే హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. గోళ్లు పసుపు రంగులో ఉంటే శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం . శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నకొద్దీ గోళ్ల ఉపరితలంపై పసుపు రంగు అంత ఎక్కువగా కనిపిస్తుంది. పైగా గోళ్లు మందంగా పెలుసుగా తయారవుతాయి. గోళ్లపై పసుపు రంగును బట్టి థైరాయిడ్, ఊపిరితిత్తుల సమస్యలు, చక్కెర వ్యాధి, సోరియాసిస్ లాంటి అనారోగ్య సమస్యలకు సంకేతంగా గుర్తిస్తారు. ఐతే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కొంతమందిలో గోళ్లు నీలి రంగులో ఉండడం గమనించవచ్చు. అలా నీలి రంగులో గోళ్లు ఉంటే .. వారి శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని అర్థం . ఇది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఎంఫసీమా అనే సమస్యకు ఇది సంకేతం కావచ్చు.
కొన్ని రకాల గుండె సమస్యలు కూడా నీలి రంగు గోళ్ల ద్వారా గుర్తించవచ్చు. గోరు ఉపరితలం అలలు… అలలుగా లేదా గుంట పడినట్లుగా ఉంటే అది సోరియాసిస్ లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కు ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చు. గోరు రంగు పాలిపోవటం చాలా సాధారణమైన విషయం. కానీ దాని కింద ఉన్న చర్మం ఎర్రటి గోధుమ రంగులో కనిపిస్తే సమస్య ఉన్నట్లు గుర్తించాలి. పొడి లేదా పెలుసైన గోర్లు తరచుగా పగుళ్లు లేదా చీలికలతో కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే .. దీన్ని థైరాయిడ్ వ్యాధికి సంకేతంగా గుర్తించవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా పసుపు రంగుతో కలిసిన పగుళ్లు గోళ్ల మీద కనిపిస్తాయి.
గోళ్లను సాధారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఐతే గోళ్ల ద్వారా అనారోగ్య సమస్యలను గుర్తించడం కూడా సులువైన పని కాదు. గోళ్లు రంగుమారినా .. అవి అసాధారణ స్థితిలో ఉన్నా .. అనారోగ్య సమస్యలకు తొలి సంకేతంగానే పరిగణిస్తారు. అంటే ఇది ఒక సూచన మాత్రమే అన్నమాట. కాబట్టి.. దీన్ని ముందుగానే గుర్తించి తగిన పరీక్షలు చేయించుకుంటే అనారోగ్య సమస్యలను త్వరగా గుర్తించి చికిత్స తీసుకునేందుకు వీలు పడుతుంది.








