Rabies : కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? రేబిస్‌ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ?

By manavaradhi.com

Published on:

Follow Us
Rabies - Symptoms & causes

విశ్వాసానికి మారుపేరైన కుక్కలు, ఇతర పెంపుడు జంతువులు రకరకాల కారణాల వల్ల జనంపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అనేకం. కుక్కల దాడిలో చనిపోయిన పిల్లల సంఖ్యా పెరుగుతోంది. కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల్లో ఉండే రేబిస్‌ వైరస్‌.. వాటి కాటు ద్వారా మనిషి శరీరంలోకి చేరుతోంది. ఒకసారి రేబిస్‌ వ్యాధి బారిన పడితే ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. కాబట్టి రేబిస్‌ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం.

రేబిస్‌ ప్రధానంగా జంతువుల నుంచి సంక్రమించే వైరస్‌తో వచ్చే వ్యాధి. రేబిస్ వ్యాధి ఎక్కువగా కుక్కలు కరవటం లేదా గీరటం వలన వస్తోంది. వ్యాధి కారక క్రిమిని ‘లిస్సా వైరస్‌’ అంటారు. ఇది జంతువుల లాలాజలంలో ఉంటుంది. ఇది మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ రేబిస్‌ వ్యాధిని కలిగిస్తుంది. ఈ వైరస్‌ ఉన్న జంతువులు, ముఖ్యంగా కుక్కలు మనుషుల్ని కరిచినా, శరీరం మీద గాయాలున్న చోట నాకినా వెంటనే శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుక్క నుంచి రేబిస్‌ వ్యాధి కారక వైరస్‌ సంక్రమించి ఉంటే ఆ వైరస్‌ నాడులను చేరుకుని గంటకు మూడు మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మెదడును చేరి క్రమేపీ రేబిస్‌ లక్షణాలు బయటపడతాయి. కాబట్టి కరిచిన తక్షణం, ఆ వైరస్‌ నాడులను చేరకముందే చికిత్స ఆరంభించడం ఉత్తమం.

కుక్క కరిచిన తర్వాత రేబిస్ వ్యాధి ఒకటి నుండి మూడునెలలలోపు రావచ్చు. ఒక్కోసారి ఒకటినుండి రెండు సంవత్సరాల లోపు కూడా రావచ్చు. అందుకే కుక్క కరిచినప్పుడు వెంటనే భయపడి గాభరా పడకుండా మొదట ప్రాథమిక చికిత్సతో మొదలు పెట్టి… వైద్యుల సలహా మేరకు పూర్తి చికిత్స తీసుకోవాలి.

రేబిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ?
వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు కరిస్తేనే రేబిస్ వ్యాధి వస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ ఒక్కోసారి పెంపుడు కుక్కల వలన కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలు బయటకు వెళ్లి ఊరకుక్కలతో కలిసి తిరిగితే వాటికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. కుక్కకు రేబిస్ ఉందా లేదా అనేది… చివరి దశలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అందుకే పెంపుడు కుక్క కరిచినా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కుక్క కరిచిన ఏడు నుంచి పది రోజుల్లో రేబిస్‌ వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చు. ప్రారంభంలో నీరసంగా ఉంటారు. ఏమీ తినాలని అన్పించదు. ఆకలి మందగిస్తుంది.జ్వరంతో కూడిన ఒళ్లునొప్పులు వంటి లక్షణాలుంటాయి.

వ్యాధి తీవ్రమై సకాలంలో వైద్యం అందకపోతే మొదట కండరాలకు, తరువాత శ్వాసకోశ నాళాలకు చేరుతుంది. వ్యాధి మరింత ముదిరితే ‘హైడ్రోఫోబియా’ లక్షణాలు అంటే కుక్కలా ప్రవర్తించడం లాంటివి బయటపడతాయి. వ్యాధి ముదిరి తీవ్రత పెరగకముందే నివారించగల మార్గాలు ఉన్నాయి. కుక్క ఎలా కరిచింది అనేదాన్ని బట్టి వైద్యులు చికిత్ప ఉంటుంది. కేవలం కోరలు తగలటం, చర్మం పైపైన గీరుకుపోవటం, కోరలు శరీరంలోకి దిగి రక్తం రావటం…ఇలా గాయాలు పలురకాలుగా ఉండవచ్చు. గాయాన్ని బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.

రేబిస్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
రేబిస్ బారిన పడకుండా ఉండాలంటే కుక్కల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. రేబిస్ వైరస్ సోకకుండా ఉండాలంటే పెంపుడు కుక్కలకు పుట్టిన ఆరు వారాల లోపు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి. తరచూ ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించాలి. ఊరకుక్కలు కరిస్తే రేబీస్‌ వ్యాదిబారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుక్క నోటి నుంచి వచ్చే లాలాజలం నీరులాంటి పదార్థం చాలా ప్రమాదకరమైంది. కుక్క కరిచిన వెంటనే సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఆవెంటనే సమీపంలోని ఆసుపత్రిలో టీకాలు వేయించుకోవాలి. కుక్కకరిచిన రక్తం రాకున్నా విధిగా టీకా వేయించుకోవాలి. కుక్క ముఖంపై, చేతులపై కరిస్తే క్షణాల్లో యాంటీరేబీస్‌ టీకా వేయించుకోవాలి సరైన చికిత్స చే యించుకోని పక్షంలో ప్రాణాలకు ముప్పు ఉంటుందని గ్రహించాలి.

కుక్కలకు సకాలంలో టీకాలు ఇప్పించకపో తే అవి కరిస్తే రేబిస్‌ వ్యాధిబారిన పడి చనిపోయే ప్రమాద ముందని వైద్యులు హెచ్చరిసున్నారు. అయితే ఈ ఒక్క వ్యాధి విషయంలోనే.. అది శరీరంలో ప్రవేశించిన తర్వాతా దానిని సమర్థంగా అడ్డుకునే టీకాలున్నాయి. కాబట్టి సకాలంలో స్పందిస్తే రేబిస్‌ని నియంత్రించడమూ సాధ్యమే.

Leave a Comment