Health tips : వెక్కిళ్లు వ‌స్తే ఏంచేయాలి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Reduce To Hiccups

మ‌నం కారంగానీ, మ‌సాలాగానీ ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్నితీసుకొన్న‌ప్పుడు వెక్కిళ్లు రావ‌డం… దాంతో పాటు కంట్లోనుంచి నీరు కార‌డంచూస్తుంటాం. వెక్కిళ్లు రాగానే ఎవ‌రో త‌లుచుకుంటున్నారు అని కూడా పెద్ద‌వాళ్ల అనుకుంటు ఉంటారు. అస‌లింత‌కీ వెక్కిళ్లు ఎందుకు వ‌స్తాయి..? వెక్కిళ్లు వ‌స్తే ఏంచేయాలి..?

మ‌నుషుల్లో వెక్కిళ్లు రావ‌డం అనేది స‌ర్వ‌సాధార‌ణ విష‌యం. నిత్య‌జీవితంలో ప్రతి ఒక్క‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో వెక్కిళ్ల‌ను అనుభ‌వించే ఉంటారు. ఎక్కిళ్లు వ‌చ్చిన‌ప్పుడు మ‌నం చాలా ఇబ్బంది ప‌డిపోతుంటాం. అందునా తినే స‌మ‌యంలో వ‌స్తే మ‌రింత ఇబ్బందికి గుర‌వుతుంటాం. కొన్ని పరిస్థితుల్లో గాలి పీల్చుకునే స్వరపేటిక మూసుకు పోవ‌డం వ‌ల్ల‌ ఎక్కిళ్లు అనేవి వస్తాయి. మెద‌డు నుంచి ఫ్రెనిక్ నాడి డ‌యాఫ్రం వ‌ర‌కు ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ, డయాఫ్రం గానీ క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో ‘హిక్‌ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రం సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనినే ఎక్కిళ్లు అంటారు.

మూత్ర పిండాల్లో సమస్యలు ఉండటం వల్ల, స్వరపేటిక మూసుకు పోవడం వల్ల, విష పదార్థాలు తీసుకోవడం వల్ల, ఎక్కువగా మసాలా పదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా పొగ తాగడం, నోటి పూత ఇబ్బందులు ఉన్న వారికి, కామెర్ల వ్యాదితో బాధపడుతున్న వారికి ఎక్కువగా ఎక్కిళ్లు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మెద‌డులో ప‌క్ష‌వాతం, క‌ణ‌తుల పెరుగుద‌ల వ‌ల్ల కూడా వెక్కిళ్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. వెక్కిళ్లు ఎక్కువగా వస్తే ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. ఊపిరి సరిగా తీసుకోలేం. దాంతో రక్త ప్రసరన తగ్గుతుంది. ఏ పనిపై కూడా శ్రద్ద పెట్టలేం. నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడాలంటే వెక్కిళ్లు ఇబ్బందిని పెడతాయి.

సాధార‌ణంగా చిన్న‌పిల్లల్లో ఎక్కిళ్లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. అశ్ర‌ద్ధ చేయ‌కుండా వెక్కిళ్లు రాగానే బోర్లాప‌డుకోబెట్టి వెన్ను భాగంపై మెల్ల‌గా త‌ట్ట‌డంవ‌ల్ల త‌గ్గిపోతాయి. వెక్కిళ్లు తగ్గాలంటే మంచి నీరు తాగాలని చెబుతూ ఉంటారు. మంచి నీటిపై శ్రద్ద పెట్టి ఎలా తాగుతున్నాం, ఎన్ని తాగుతున్నాం అనే విషయాన్ని గమనిస్తే వెక్కిళ్లు అనేవి పోతాయి. ఇక షాకింగ్‌ విషయం లేదా భయం కలిగించే విషయం వల్ల కూడా వెక్కిళ్లు పోతాయి. అయితే ఇవన్ని కాకుండా అల్లంతో వెక్కిళ్లకు చెక్‌ చెప్పవచ్చు. అల్లం ముక్కను బుగ్గలో పెట్టుకుని చప్పరించడం వల్ల వెక్కిళ్లు పోతాయి. నీటిలో చ‌క్కెర వేసుకొని క‌లిపి తాగ‌డం వ‌ల్ల కూడా వెక్కిళ్ల‌ను నియంత్రించుకోవ‌చ్చు. ఊపిరిని గట్టిగా పీల్చి కొంతసేపు బిగబట్టి తరువాత వదల‌టం వలన కూడా ఎక్కిళ్లు పోతాయి.

ఎక్కిళ్లు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్లు దీర్ఘకాలంగా ఉన్నా ప్రమాదం లేదు. అయితే ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది. వెక్కిళ్లు రాగానే కొన్ని మంచినీరు తాగి దీర్ఘంగా శ్వాస‌తీసుకొంటూ వ‌దిలితే కొంత ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Leave a Comment