చాలా మందిని అధికంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో సైనసైటిస్ కూడా ఒకటి. ఒక్క సారి ఈ సమస్య మొదలైందంటే… ఒక పట్టాన పరిష్కారం లభించదు. ఇది తగ్గని సమస్యగా భావించి, చాలా మంది శారీరకంగానే గాక, మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైనసైటిస్ ను అదుపు చేయవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..!
సైనసైటిస్ సమస్య వయోభేదం లేకుండా ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఇది వర్షాకాలం, శీతలకాలంలోనే ఎక్కువగా వస్తుంది. మనిషి పుర్రె లోపల కొన్ని ఖాళీలుంటాయి. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగాల్లోని ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ గా పిలుస్తారు. సైనస్ లోపలి భాగాలు జిగురు పొరతో కప్పబడి ఉంటాయి. ఇవి నాసికా రంధ్రాల లోపలికి తెరుచుకుంటాయి. ప్రతి మనిషికి నాలుగు జతల సైనస్‌లు ఉంటాయి. సైనస్‌లు ముఖ్యంగా పుర్రె ఎముక బరువు తగ్గించటం, మెడపై మోయాల్సిన భారాన్ని సమతుల్యంగా ఉంచడం, పీల్చే గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలను, క్రీములను ఊపిరితిత్తులలోకి పోకుండా చూడటానికి ఉపకరిస్తాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడల్లా సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. ఇది 90 శాతం మందిలో కనిపించే సాధారణ సమస్య. మనిషి జీవితకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇన్‌ఫెక్షన్‌తోనే కాకుండా వైరస్, బ్యాక్టీరియా వలన కూడా వస్తుంది. ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్‌ఫ్లుయెంజాలతో వస్తుంది. సైనసైటిస్ సమస్య వయోభేదం లేకుండా ఎవరికైనా రావచ్చు.అలర్జీతత్వం ఉన్నవారిలోనూ, కాలుష్యం మధ్య పనిచేసే వారిలోనూ ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.
సైనసైటిస్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి…?
సైనసైటిస్ ముఖ్యంగా అక్యూట్, క్రానిక్ సైనసైటిస్‌గా చెప్పుకొనవచ్చు. సూక్ష్మ క్రిముల వలన సంక్రమించే ఇన్‌ఫెక్షన్, ఫ్లూ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత దంతాలు ఇన్‌ఫెక్షన్‌కు గురికావటం వలన అక్యూట్ సైనసైటీస్‌కు గురవుతారు. ఇది సుమారు రెండు వారాల్లో తగ్గుతుంది. ఎలర్జీ వ్యాధులతో తరుచూ బాధపడుతున్న వారిలో, తరుచుగా జలుబుకు గురయ్యేవారిలో, ఉద్వేగపరమైన ఒత్తిడికి గురవుతుండే వారిలోనూ ఎక్కువగా గుర్తించవచ్చు. ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం సైనసైటిస్ ప్రాథమిక లక్షణం. ఈ దశలో సరైన చికిత్స తీసుకోకపోతే తరువాత ఇది మందులకు కూడా లొంగదు. ముక్కులు బిగదీసుకుపోతాయి. తరచూ తలనొప్పి, తలంతా బరువుగా ఉండటం, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద, నీరు కారడం, గొంతులోకి ద్రవాలు కారడం, దగ్గు, జలుబు, చెవిలో చీము వంటి రావడం వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఈ వ్యాధి ముదిరేదాకా చూడకుండా ముందే చికిత్స తీసుకోవడం వల్ల వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు.
సైనసైటిస్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
సైనసైటిస్ సమస్య నివారణకు నోటిని తరచుగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. ఎక్కువ సమయం ఈత కొట్టడం చేయకూడదు. చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండాలి. పిల్లలకు శీతల పానీయాలు, చల్లటి పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, కేక్స్ కొనివ్వకూడదు.దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వెళ్లవలసి వస్తే మాస్కు ధరించాలి. ఆవిరిపట్టడం చేయడం వల్ల సైనసైటిస్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. మరోవైపు నిరంతరం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కూడా సైనస్ బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు. కెఫిన్, ఆల్కహాల్ కలిగివున్న పానీయాలకు దూరంగా ఉండాలి. నిత్యం 2 లీటర్లకు తక్కువ కాకుండా మంచినీరు తాగాలి. చికెన్, వెజ్ సూపుల్ని ఎక్కువగా తీసుకోవాలి. వారం కన్నా ఎక్కువ రోజులు నొప్పి, జ్వరంతో బాధపడుతుంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి సలహాలు తీసుకోవాలి.