Sleep Apnea: నిద్రపోతున్నప్పుడు గురక పెడుతున్నారా… శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారా..!

By manavaradhi.com

Published on:

Follow Us

నిద్రపోతున్నప్పుడు కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇలా ఒక్కసారి కాదు వందలసార్లు జరుగుతుంది. శ్వాసలో ఇలా వచ్చే అవరోధాన్నే ‘స్లీప్‌అప్నియా’ అంటారు. దీని కారణంగా మెదడులో ఆక్సిజన్‌నిల్వ పడిపోతుంది. దీంతో నిద్రాభంగం కలుగుతుంది. దానివల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండలేరు. ఈ స్లీప్‌ ఆప్నియా సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ఇబ్బంది పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. చాలా మందికి తమకీ సమస్య ఉన్నట్లు తెలియదు. దాంతో నిద్ర మధ్యలో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోయి, మళ్లీ మామూలైపోతుంది. పగటి పూట ఎక్కువగా నిద్రించడం, పెద్దగా గురక పెట్టడం, శ్వాస తీసుకోవడం కష్టమై హఠాత్తుగా మెలకువ రావడం, మేల్కొన్నప్పుడు గొంతు ఎండిపోవడం లేదా గొంతు నొప్పిగా ఉండడం, ఛాతీ నొప్పితో మెలకువ రావడం, ఉదయం లేవగానే తలనొప్పి అనిపించడం, ఏ విషయంపైనా మనసు లగ్నం చేయలేకపోవడం, డిప్రెషన్‌ లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. స్లీప్‌అప్నియా అనేది అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా, సెంట్రల్‌ స్లీప్‌ అప్నియా, మిక్స్‌డ్‌ స్లీప్‌ అప్నియా అని మూడు రకాలుగా ఉంటుంది. అబ్‌స్ట్రక్టివ్‌స్లీప్‌ ఆప్నియా లో ముక్కు లేదా నోరు లేదా గొంతు గాలిగొట్టాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. సెంట్రల్‌ స్లీప్‌ ఆప్నియా కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ గాలి గొట్టాల్లో అడ్డంకులు ఉండవు. కొందరికి ఈ రెండు రకాల సమస్యలు ఉంటాయి. దీన్ని మిక్స్‌డ్‌ స్లీప్‌ అప్నియా అంటారు.

స్లీప్‌ ఆప్నియా గురైతే శరీరానికి అందే ఆక్సిజన్‌ పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా కొన్ని దీర్ఘకాల రుగ్మతలు దాడి చేస్తాయి. హైపర్‌టెన్షన్‌, రక్తపోటు, మధుమేహం, హృద్రోగాలు, గుండె కొట్టుకునే తీరులో తేడాలు, పక్షవాతం, హార్మోన్లలో అవకతవకలులాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు జీవితకాలం వేధిస్తాయి. స్లీప్‌ ఆప్నియాలో భాగంగా శరీరంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పరిమాణం పెరగటం వల్ల కొన్ని రకాల రుగ్మతలు బాధిస్తాయి. స్లీప్ ఆప్నియా స‌మ‌స్య ఉన్న‌వారికి కంటికి సంబంధించిన గ్ల‌కోమా వ్యాధికి గురయ్యే ప్ర‌మాదం పెరుగుతుంద‌ని ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మత్తుగా ఉండటం, తలనొప్పి, ఉత్సాహం లోపించటంలాంటి సమస్యలు కలుగుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌కు కూడా దారితీయొచ్చు. ఓఎస్ఎ ఉన్న వ్యక్తుల్లో గురక, పగటి నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గడం, సరిగ్గా నేర్చుకోకపోవడం, ఏకాగ్రతలోపించడం, ఉదయం తలనొప్పి, చికాకు,మానసిక ఆందోళన , మతిమరుపు, నిద్ర లేవగానే గొంతు బొంగురుపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళలతో పోలిస్తే పురుషులు మూడు రెట్లు అధికంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. గురక ఉన్నవారంతా ఒఎస్‌ఎతో బాధపడుతున్నట్టు కాదు. ఒఎస్‌ఎ ఉన్న వారంతా గురకతో మాత్రం బాధపడతారు.

ఒకసారి ఒఎస్‌ఎ ఉన్నట్లు అనుమానిస్తే స్లీప్‌ సెంటర్‌ వద్ద రాత్రంతా స్లీప్‌స్టడీ (పాలిసొమ్నోగ్రఫీ) చేయాల్సి ఉంటుంది. మెదడు తరంగాలు, గుండె కొట్టుకోవడం, ఆక్సిజన్‌ నిల్వలు, శ్వాస తీసుకోవడం మీద స్లీప్‌స్టడీ చేస్తారు. గురక సమయంలో వీడియో, ఆడియో రికార్డ్ చేసి వైద్యులకు చూపిస్తే సమస్యలను గుర్తించడం సులువవుతుంది. కొన్ని సార్లు స్లీప్ ఎండో స్కోపీ పరీక్షలు కూడా అవసరమవుతాయి. పరీక్షల తర్వాత ఎలాంటి చికిత్స మంచిదనే నిర్ధారణకు వస్తారు వైద్యులు. స్లీప్ ఆప్నియా సమస్యను అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రోజూ ఒకే వేళకు నిద్రపోవాలి. ఎక్కువ మసాలాతో కూడిన ఆహారాలు తీసుకోకూడదు. పగటి నిద్ర మానుకోవాలి. నిద్రించే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. నిద్రకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. ధూమపానం, మద్యపాలనం అవలాట్లుకు దూరంగా ఉండాలి.

Leave a Comment