చక్కటి నిద్ర కోసం చిట్కాలు – Sleeping tips in Telugu

By manavaradhi.com

Published on:

Follow Us
Sleeping tips in Telugu

రోజుకు 24 గంటలు. . అందులో పని గంటలు సాధారణంగా 8 నుంచి 9 గంటలు . మిగతాదంతా వివిధ పనులతోపాటు విశ్రాంతికి కేటాయించాలి. ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం 6 గంటల నుంచి 7 గంటలు సమయం కేటాయించాలి. దీనివల్ల మరో రోజు ఉత్సాహంగా పనిచేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఐతే పని ఒత్తిడి కారణంగానే ఇతరత్రా అలవాట్లు , జీవన విధానం వల్ల చాలామంది ఈ రోజుల్లో నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తున్నారు. పైగా చేజేతులా నిద్రపోయే అలవాటును తమకు తామే భంగం కలిగించుకుంటున్నారు.

రాత్రి భోజనం తర్వాతా చాలా మంది టీ, కాఫీ, చాక్లెట్లు, కూల్ డ్రింక్ లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. దీని వల్ల నిద్రాభంగం కలుగుతుంది. టీ, కాఫీ ఇతర పదార్థాల్లో ఉండే కెఫిన్ . . కారణంగా శరీరంలో నరాలు మరింత ఉత్తేజితంగా తయారవుతాయి. దీని వల్ల నిద్ర రాకుండా మేల్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాత్రి పడకునే ముందు కెఫిన్ కలిగిన పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు . ..

రాత్రిపూట మద్యం తీసుకోవడం వల్ల కూడా నిద్రాభంగం అవుతుంది. నిజానికి మద్యం తీసుకుంటే శరీరం మత్తులోకి వెళ్లిపోయి మగతగా నిద్ర వస్తుంది. కానీ ఇది కొన్ని గంటలపాటు మాత్రమే పని చేస్తుంది. పూర్తిగా అలసట చెందిన నిద్రలా కాకుండా ఇది కృత్రిమంగా ఉంటుంది. దీనివల్ల అర్ధరాత్రి పూట తిరిగి మేల్కునే పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ మద్యం తీసుకునే అలవాటు ఉన్నవారు మితంగానే తీసుకోవాలి. అది కూడా సాయంత్రం వరకే ముగిస్తే మంచిది. రాత్రిపూట ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఉపయోగించడం వల్ల కూడా నిద్ర పట్టడం కష్టమవుతుంది.

టీవీ, కంప్యూటర్ , ట్యాబ్లెట్ , స్మార్ట్ ఫోన్ లో ఎల్ఈడీ బ్లూ లైట్లు నిద్రా భంగానికి కారణమవుతాయి. ఎల్ఈడీ బ్లూలైట్ రాత్రి పూట ఎక్కువసేపు చూడడం వల్ల మెదడులో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సాధారణంగా సూర్యాస్తమయం అయిన తర్వాత సూర్యోదయానికి ముందు వరకు ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ కారణంగా నిద్రపడుతుంది. ఐతే ఈ బ్లూ లైట్ కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో నిద్ర పట్టని పరిస్థితి నెలకొంటుంది. అందుకే రాత్రిపూట పడక గది చేరే సమయం కంటే 2 నుంచి 3 గంటల ముందుగానే టీవీ , స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్ లాంటి పరికరాలను వీలైనంత దూరం పెట్టాలి….

మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవడం వల్ల కూడా రాత్రి పూట పడుకునే సమయం తగ్గిపోతుంది. పగటిపూట భోజనం తర్వాత కాసేపు పడుకోవాలని చాలా మందికి ఉంటుంది. కొంతమంది దీన్ని ఆచరిస్తారు కూడా. ఐతే మధ్యాహ్నం సమయంలో తీసే ఈ కునుకు వల్ల రాత్రిపూట నిద్రాభంగం కలుగుతుందని అధ్యయనాలు చెబున్నాయి. ఫలితంగా రాత్రంతా చాలా సేపు మేల్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. అందుకే మధ్యాహ్నం 3 గంటల తర్వాత చిన్న కునుకు తీయడం .. కాఫీలు తాగడం చేయకుండా .. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని మళ్లీ పనిలో పడిపోవాలి.

రాత్రి పడుకునే ముందు తీసుకునే ఆహారం.. తినే సమయం పైనా నిద్ర ఆధారపడి ఉంటుంది. అంటే రాత్రి పూట పడుకునే ముందు అంటే దాదాపు 3 గంటల ముందే .. భోజనం పూర్తి చేయాలి . రాత్రి పూట ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. అలాగే త్వరగా జీర్ణం కాని ఆహారాల జోలికి వెళ్లవద్దు. చిరుతిళ్ల జోలికి అస్సలు వెళ్లవద్దు. ఇవి శరీరంలోని మెటబాలిజమ్ ను దెబ్బ తీస్తాయి. ఆహారం జీర్ణం కాకుండా నిద్ర రాకుండా చేస్తాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు తేలికైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే పడుకునే కంటే మూడు గంటలు ముందుగానే ఆహారం తీసుకోవాలి. తిన్న తర్వాత ఆహారం జీర్ణం కావడానికి కాసేపు నడిస్తే మంచిది..

మంచి నిద్ర ఉంటే కొత్త శక్తి వస్తుంది. నిద్రపోవడానికి ప్రాధాన్యమిస్తేనే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. ఐతే నిద్ర రావడానికి రోజంతా శ్రమించడంతోపాటు తేలికపాటి వ్యాయామాలు కూడా క్రమం తప్పకుండా చేయాలి. రోజూ సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పడకగది వాతావరణం కూడా గందరగోళం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే .. నిద్రపోయే సమయంలో వీలైనంత వరకు వేడి లేకుండా చల్లాగా ఉండేలా చూసుకోవాలి.

Leave a Comment