కోరింత దగ్గు అన్ని వయసుల వారిని వేధించే సమస్య. శ్వాసకోశాల్లోగానీ, ఊపిరితిత్తుల్లో గానీ ఇన్ఫెక్షన్ కారణంగా కోరింత దగ్గు వేధిస్తుంది. పెద్దవారిలో కోరింత దగ్గు వచ్చినప్పుడు ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
కోరింత దగ్గు అనేది బొర్డ్‌టెల్లా పెర్ట్యుసిస్ అనే సూక్ష్మ క్రిమి వల్ల ఈవ్యాధి వస్తుంది. ఇది ఏ వయస్సులోనైనా రావచ్చు కాని, ఇది ఏడాది లోపు పసి పిల్లలకి వస్తే బాగా ఉధృతంగా వస్తుంది. పెద్దవాళ్లలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ వ్యాధిలో రోగి దగ్గుతున్నప్పుడు ‘వూఫ్ అనే శబ్దం వెలువడుతుంది. ఈ వ్యాధికి గురైన సందర్భాల్లో శ్వాసమార్గాన్ని బాధించి తెరలుతెరలుగా దగ్గు వస్తుంది. ప్రారంభదశలో ముక్కు కారుతుంది. తర్వాత జ్వరం, దగ్గు బాధిస్తాయి. సాధారణంగా కాకుండా జలుబు రోజురోజుకు పెరుగుతుంది. పొడి దగ్గు, తుమ్ములు ఎక్కువవుతాయి. కొన్నిసార్లు శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి ముఖం నీలి రంగులోకి మారిపోతుంటుంది.
కోరింత దగ్గు తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు రోగి విపరీతంగా దగ్గుతాడు. ఊపిరి తిత్తులలోని గాలి మొత్తం నిశ్వాస రూపంలో వెళ్లిపోతుంది. తరువాత సుదీర్ఘంగా శ్వాస తీసు కుంటాడు.దగ్గుతోపాటు వాంతులు కూడా సంభవించవచ్చు. నోరు తెరచుకోవడం, నాలిక బైట పడడం, కనుగుడ్లు బైటికి పొడుచుకు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రి వేళల్లో దగ్గు మరింత ఎక్కువగా బాధిస్తుంటుంది. కోరింత దగ్గు రాగానే బాగా గాలి వచ్చే గదిలో విశ్రాంతి కల్పించాలి. కుటుంబసభ్యులను దగ్గరికి రానివ్వకూడదు. నోటివెంట, ముక్కు వెంట వచ్చే స్రావాలను కాగితం, పాత గుడ్డతోనో తుడిచి తగులబెట్టాలి. ఈ జబ్బుతో బాధ పడుతున్న వారు ఉపయోగించే దుస్తులు, పాత్రలు, వస్తువులు ఇతరులు వాడకూడదు.
పెర్ట్యుసిస్, టెటనస్, డీప్తీరియా వ్యాక్సిన్లను చిన్నవయసులో తీసుకోని వారిని ఎక్కువగా సమస్య బాధిస్తుంటుంది. కోరింత దగ్గుగా నిర్దారించేందుకు వైద్యుడు పలు పరీక్షలు నిర్వహిస్తారు. న్యుమోనియా, ఫ్లూ, టీబీ వంటి వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉంటున్నందున ప్రత్యేక పరీక్షలు చేయిస్తారు. రోగిని చలి నుంచి కాపాడాలి. తద్వారా బ్రాంకో న్యుమోనియా రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఉత్తేజితం చేసే ఆహార పదార్థాలు ఇవ్వకూడదు. ఫిట్స్, కోపం వంటి ఉద్రేకాలకు గురి కాకుండా చూసుకోవాలి. యాంటీ బయాటిక్స్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి.
పిల్లల్లో ఎక్కువగా కనిపించే కోరింత దగ్గు.. పెద్ద వాళ్లలో అరుదుగా కనిపిస్తుంది. కోరింత దగ్గుకు వ్యాక్సిన్ టీకాలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ప్రభలకుండా జాగ్రత్తపడొచ్చు. కోరింత దగ్గు లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగు చికిత్స పొందడం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి.








