అందమైన పలు వరుస కావాలంటే పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిలో జ్ఞాన దంతం ఒకటి. సాధారణంగా ఎవరికైనా జ్ఞానదంతం వచ్చేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అది స్థలంను సమకూర్చుకోవడానికి పక్క పళ్ళను లేదా లోపలి కండరాలను ముందుకు, వెనకకు నెట్టుకుంటూ పెరగడం వల్ల ప్రతి ఒక్కరిలోనూ నొప్పి సహజంగా వస్తుంటుంది. దీంతోపాటు తలనొప్పి కూడా వస్తుంది.
దవడ చివరన ఆహారాన్ని నమలడానికి మూడు పెద్ద దంతాలు ఉంటాయి. ఆ వరుసలో చివరగా వచ్చే దంతాలే జ్ఞాన దంతాలు. ఊహ తెలియక ముందే మిగిలిన దంతాలు వస్తే, ఇవి మాత్రం బాగా వయసు పెరిగాక వస్తాయి. మిగతా పళ్ళున్న వరుసలోనే అవి కూడా వచ్చి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఏ విధమైన సమస్యా ఉండదు. కానీ అవి వచ్చే లోపు నోట్లో స్థలం లేకుండా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఏ ఆటంకాలు లేకుండా జ్ఞాన దంతాలు వస్తే, నమలడానికి ఉపయోగపడతాయి. అయితే ఏవైనా కారణాల వల్ల సమస్యలు వస్తే మాత్రం వీటిని తీసేయడమే మంచిది అన్నది వైద్యుల మాట.
సాధారణంగా 17 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఇవి వస్తుంటాయి. ఆలస్యంగా రావడం వల్ల ఆ సమయంలో చిగురును చీల్చుకుని ఇవి బయకు వస్తాయి. ఫలితంగా ఆ బాగంలో నొప్పి, వాపు, ఎర్రబారడం, కొన్నిమార్లు చీము పట్టడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ నొప్పి కారణంగా మెడ దగ్గర ఉండే లింఫ్ గ్రంథులు వాచి, జ్వరం, ఆహారం మింగడంలో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. చాలా మందిలో జ్ఞాన దంతం మార్గం మార్చుకుని బయటకు చొచ్చుకుని రావడం వల్ల ఇబ్బందు ఏర్పడతాయి. అందుకే జ్ఞానదంతం చాలా మందిలో సమస్యలు కలిగిస్తుంటుంది.
జ్ఞానదంతం పలు వరుసలోన్న దవడలో ముందు వైపునకు తోసుకు వస్తూ ఇబ్బంది కలిగిస్తే దాన్ని మెసియో యాంగ్యులర్ సమస్యగా పేర్కొంటారు. దాదాపు 44 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. అదే విధంగా దవడ నుంచి పూర్తిగా కాకుండా కొద్ది భాగం మాత్రమే బయటకు వస్తే వర్టికల్ ఇంఫాక్షన్ గా దీన్ని పిలుస్తారు. 38 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. జ్ఞానదంతం నోటిలో వెనుకకు పెరుగుతుంటే దాన్ని డిస్టో యాంగ్యులర్ ఇంఫాక్షన్ గా పిలుస్తారు. ఇది ఆరు శాతం మందిలో ఎదురౌతుంది.
జ్ఞాన దంతం దవడకు 90 డిగ్రీల కోణంలో కాకుండా, పూర్తిగా లోపలి వైపునకు పెరిగితే దాన్ని హారిజాంటల్ ఇంఫాక్షన్ అంటారు. ఇది 3 శాతం మందిలో కనిపిస్తుంది. జ్ఞానదంత విషయంలో సరైన స్థలం లేక ఇలా అనేక మార్గాల్లో అవి పెరుగుతాయి గనుక, అది ఇబ్బందులు సృష్టిస్తుంది. ఇటీవల మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు కూడా జ్ఞానదంతాల సమస్యలకు కారణం అవుతోంది. ఒకప్పుడు మనం మంచి ఆహారాన్ని బాగా నమిలి తినేవాళ్ళం. దానికి తగ్గ్టు మన దవడ మీద స్థలం విశాలంగా ఉండేది. ప్రస్తుతం బాగా మృదువుగా ఉండేవి, తేలిగ్గా చప్పరించి తినగలిగినవి మాత్రమే తీసుకుంటున్నాం. దీనివల్ల దవడ కూడా సున్నితంగా మారి సమస్యలను సృష్టిస్తోంది. ఫలితంగా జ్ఞానదంత వచ్చే సమయానికి ఇబ్బందులు మొదలౌతున్నాయి.
ఒక్కో సారి జ్ఞానదంతం బలవంతగా పెరగడం వల్ల మామూలు పళ్ళు పుచ్చి పోవడం, రంథ్రాలు పడడం, చిగురుకు నొప్పి రావడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. ఒక్కోసారి మిగతా దంతాలు నొక్కుకు పోయి క్రౌడింగ్ సమస్యలు కూడా ఏర్పడతాయి. దీనివల్ల చిగుళ్ళ సమస్యలు కూడా ఏర్పడవచ్చు.
జ్ఞానదంతం సమస్యలు సృష్టిస్తోందంటే దాన్ని తొలగించడమే మంచి పరిష్కారం. చాలా మంది జ్ఞాన దంతాన్ని తొలగిస్తే, జ్ఞానం పోతుందని భ్రమపడుతుంటారు. దానికి, దీనికి ఏ విధమైన సంబంధం లేదు. మరి కొంత మందిలో జ్ఞానదంతం కచ్చితంగా తొలగించాల్సిందేనన్న అపోహ కూడా ఉంది. నిజానికి జ్ఞానదంతం ఆరోగ్యంగా పెరిగి, అది పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తొలగించడం సరి కాదు. పైగా ఆహారాన్ని నమలడం మరింత సులభం అవుతుంది. కొంత మందిలో వెనుక దంతం మొలవదు. అలాంటి వారిలో ఆహారం నమిలేందుకు జ్ఞానదంతం ఎంతో ఉపయోగపడుతుంది.
జ్ఞానదంతం పూర్తిగా దవడ నుంచి బయటకు రాకుండా, నమలడానికి నోటి ఆరోగ్యానికి ఇబ్బందిగా మారినప్పుడు దాన్ని కచ్చితంగా తొలగించాల్సిందే. అడ్డదిడ్డంగా పెరుగుతూ పంటి వేళ్ళను దెబ్బ తీసినా, నరాలను దెబ్బ తీస్తున్నా, దవడ ముందు భాగంలో తిత్తులకు కారణమైనా వెంటనే దాన్ని తొలగించాలి. 30 నిముషాలు మాత్రమే నిడివి కలిగిన ఈ శస్త్ర చికిత్స వల్ల పెద్ద సమస్యలు ఏవీ ఉండవు. ఒకటి, రెండు రోజులు మాత్రమే గట్టి వస్తువులు తీసుకోకుండా ఉంటే చాలు. పూర్తిగా సురక్షితమైన ఈ చికిత్స ద్వారా అనేక సమస్యలు తొలగిపోతాయి. వైద్యులు చెప్పిన సూచనలను పూర్తిగా పాటించాలి.
జ్ఞానదంతాల నొప్పి నివారించడంలో కొన్ని గృహ చిక్త్కాలు చక్కగా పనిచేస్తాయి. అలాగని పూర్తిగా ఇంటి వైద్యానికే పరిమితం కాకుండా సమీపంలో ఉన్న దంత వైద్యున్ని సంప్రదిస్తే మన దంతాలను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దంత ఆరోగ్యంతో మన శరీర సంపూర్ణ ఆరోగ్యం ముడిపడి ఉన్నదని గుర్తుంచుకోవాలి.