Tips for bad breath:నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..ఇలా చేయండి.

By manavaradhi.com

Published on:

Follow Us
Tips for bad breath

నోటి దుర్వాసన చాలా సాధారణమైన సమస్య. మనసారా మాట్లాడుతున్నపుడు ఎదుటి మనిషి ఈ సమస్య కారణంగా వెనక్కి వెళుతుంటాడు. అంతేకాదు సంభాషణలో మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోతాడు. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం మొదలు, దంత, చిగుళ్ళ సమస్యలు, తినే ఆహారం మొదలు స్మోకింగ్ దాకా ఎన్నో కారణాలు ఈ సమస్యకు దారితీస్తాయి. మరి నోటి దుర్వాసను సంబంధించిన మరింత సమాచారం.

నోటి దుర్వాసనను వైద్య పరిభాషలో హ్యాలిటోసిస్ అంటారు. నోటి లోపల భాగాలైన దంతాలు, చిగుళ్ళు, నాలుకను శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. దంతాలను సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడంతో పాటు దంతాల మధ్య ఇరుక్కొనే ఆహారాలను శుభ్రం చేయకుండా వదిలేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది నోటి దుర్వాసన తీసుకొస్తాయి.

కేవలం దంత, చిగుళ్ళ సమస్యలు మాత్రమే కాకుండా కొన్ని ఇతర కారణాలు కూడా నోటి దుర్వాసన తీసుకొని రాగలవు. వీటిలో ముఖ్యమైనది డ్రై మౌత్ . ఈ సమస్య ఉన్న వారిలో నోటిని శుభ్రంగా ఉంచే లాలాజల గ్రంధులు సరిగ్గా పని చేయకపోవడం వల్ల .. కొందరు ఒకే చోట కూర్చుని ఏకధాటిగా మధ్యలో ఆహారం, నీరు లేకుండా పని చేస్తూ ఉండడం వల్ల కూడా నోరు పొడారిపోయి.. పని అయిన కొద్ది గంటల తరువాత నోటి దుర్వాసన రావచ్చు.

ఎసిడిటీ, కడుపుబ్బరం, రిఫ్లక్స్ డీసీస్ ఉన్నవారిలో నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు అధికం. కేవలం నోటికి సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు గొంతు, ముక్కు సంబంధ సమస్యల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలకి మందులు వాడుతున్న వారిలో కూడా నోటి దుర్వాసన రావడానికి అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ దంతాలు అమర్చుకున్న వారిలో కూడా నోటి దుర్వాసన వస్తుంది.

నోటి కి సంబంధించని సమస్యల్లో ముఖ్యమైనది రిఫ్లక్స్ డిసీస్. వీరిలో తిన్న ఆహారం కడుపులో నుంచి తిరిగి అన్నవాహిక దాకా ఎగదన్నడం కారణంగా నోట్లోకి జీర్ణ ఆమ్లాలు చేరి, అవి పుల్లటి త్రేపులను అలాగే ఎసిడిటీ ని కలుగ చేస్తాయి, దీని వల్ల నోటి దుర్వాసన రావచ్చు. నోటి దుర్వాసనకు కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కొందరిలో కేవలం కొన్ని ఓరల్ హెల్త్ రూల్స్ పాటించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. వీటిలో భాగంగా వైద్యులు సూచించే టూత్ పేస్ట్ , మౌత్ వాష్ వాడుకోవడం మంచిది.

నోటి దుర్వాసనను నివారించుకోవడానికి ముందుగా చేయాల్సింది ప్రతిరోజూ ఉదయం, రాత్రి… రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. బ్రషింగ్ తర్వాత టంగ్ క్లీనర్తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. టీత్ బ్రష్ చేసేందుకు కూడా ఒక నిర్ణీత పద్దతి ఉంది. చిగుళ్ళు, పళ్ళు కలిసే ప్రదేశం లో బ్రష్ ని ఏటవాలుగా ఉంచి బ్రష్ చేయాలి. మృదువుగా గా ఉండే బ్రిసిల్స్ ఉన్నబ్రష్ వాడుకోవాలి. సెన్సిటివిటీ సమస్య ఉన్న వారు మెడికేటెడ్ టూత్ పేస్ట్ వాడుకోవచ్చు. ఇక దంతాల మధ్య చిక్కుకొనే ఆహార పదార్ధాలను ఫ్లాసింగ్ అనే పద్ధతి ద్వారా క్లీన్ చేసుకోవాలి. ఫ్లాసింగ్ కి ప్రత్యేకించి తయారు చేయపడే మేడికేటెడ్ త్రెడ్ ని మాత్రమే ఉపయోగించాలి. ఆహారం సరిగా జీర్ణం కాకుండా గ్యాస్ వస్తున్నప్పుడు, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

ప్రపంచ జనాభా లో దాదాపు 30% మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారని అంచనా. ఈ సమస్యను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బ్యాడ్ బ్రేత్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. మరి మీరంతా ఓరల్ హెల్త్ పట్ల తగిన శ్రద్ధ వహిస్తారు కదూ!

Leave a Comment