ఉప్పు .. ఎక్కువగా తింటే ఏమవుతుంది.. మహా అయితే కాస్త విషమవుతుందని లైట్ గా తీసుకోవద్దు. దీని వల్ల ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఏటా లక్షా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉప్పు వల్ల మనం ఎదుర్కునే దుష్పరిణామాలేంటి? రోజూ ఉప్పు ఎంత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?
ఉప్పు .. సాధారణంగా మనం ఇంట్లో వాడే రసాయనం. ఆ మాటకొస్తే .. ఉప్పు లేని కూర .. రుచికి ఆమడ దూరమని అందరికీ తెలుసు. ఐతే ఉప్పు ఎంత పరిమాణంలో వేయాలో అంత వేస్తేనే రుచి పెరుగుతుంది. లేకపోతే విషమై కూరను పాడు చేస్తుంది. అంతే కాదు .. ఉప్పు ఎక్కువగా వేసుకుంటే అనారోగ్య సమస్యలతో ప్రాణాల మీదకు వచ్చే అవకాశమూ ఉందంటున్నారు పరిశోధకులు. అవును .. ఉప్పు ఎక్కువ తినడం వల్ల గుండె సమస్యలు, రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఆహారం పదార్థాల్లో మొత్తానికే ఉప్పు వాడకం మంచిది కాదా అనే డౌట్ రావచ్చు. ఉప్పు వాడకం మంచిదే. ఐతే తగిన మోతాదులో వాడుకోవాలి. ఆహార పదార్థాల్లో ఉప్పును ఉపయోగించడం వల్ల శరీరంలో రక్తపోటు నిలకడగా ఉంచుతుంది. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండెలో ఎలక్ట్రో సంకేతాలు సరిగ్గా ఉత్పత్తి అయ్యేందుకు ఉప్పు తోడ్పడుతుంది. ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకుంటుంది. అందుకే ఉప్పు తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజూ 2 వేల 300 మిల్లీ గ్రాముల వరకు సోడియం క్లోరైడ్ తీసుకోవచ్చు. ఒకవేళ రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడే వారు రోజుకు 1500 మిల్లీ గ్రాముల కంటే తక్కువ తీసుకుంటే మంచిది. ఐతే ఇది మనిషి మనిషికి వయసు, బరువును బట్టి మారవచ్చు. కానీ సరాసరి ప్రమాణంగా రోజూ తీసుకునే పరిమాణాన్ని పరిశోధకులు నిర్ణయించారు.
సరాసరి పరిమాణం కంటే ఎక్కువ ఉప్పు తీసుకున్న వారు కచ్చితంగా రక్తపోటు సమస్యను ఎదుర్కునే అవకాశం ఉంది. తద్వారా కరోనరీ ఆర్టరీ, హార్ట్ స్ట్రోక్, డెమెన్షియా, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైతే మరణానికి దగ్గరవుతున్నట్లే లెక్క. కాబట్టి ఉప్పు వాడకం తగ్గించాలని వైద్యులు డాక్టర్ సురేందర్ రెడ్డి నెరవెట్ల సురేందర్ రెడ్డి సూచిస్తున్నారు. తాజా పండ్లు , కూరగాయలు తీసుకుంటే ఉప్పు వాడకం తగ్గుతుంది. చాలా మంది ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్ లేదా ప్యాకేజ్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. దీని వల్ల వారు .. వారికి తెలియకుండానే ఉప్పును ఎక్కువ తమ శరీరంలోకి చేరవేస్తున్నారు. ప్యాకేజ్ లేదా ఫాస్ట్ ఫుడ్స్ .. ఎక్కువ నిల్వ ఉంచేందుకు ఉప్పును ఎక్కువగా వాడతారు. అలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు మోతాదు కంటే ఉప్పు శరీరంలోకి వెళ్లిపోతుందంటున్నారు.
మార్కెట్లో ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న సమయంలోనే సోడియం తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. మనం ఇంట్లో వండుకునే కూరల్లోనూ ఉప్పు తగినంత మేర తగ్గించుకోవాలి. అలాగే డైనింగ్ టేబుల్ పై ఉప్పు డబ్బాను తీసేయడం మేలు. మార్కెట్లో దొరికే సాస్, కెచప్, రెలిష్ లాంటి ఉత్పత్తులను వీలైనంత వరకు కొనుక్కోవద్దు. ఉప్పు వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నప్పుడు.. వాటి స్థానంలో వీలైనంత మేర కూరగాయలు వాడుకోవచ్చు. కూరగాయల్లో కొంత మేర ఉప్పు ఉంటుంది. దానితో సరి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.
మార్కెట్లో దొరికే బ్రెడ్ లో నూ సోడియం అధికంగానే ఉంటుంది. చాలా మంది హోల్ గ్రెయిన్ బ్రెడ్ .. ఆరోగ్యకరమని తీసుకుంటూ ఉంటారు. కానీ దానిలోనూ ఉప్పు శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి బ్రెడ్ ప్యాకెట్ లు తీసుకునే ముందు.. లేబుల్ కచ్చితంగా చూడాలి. తక్కువ సోడియం శాతం ఉన్న బ్రెడ్ నే కొనుగోలు చేయడం మంచిది. ఒక్కోసారి ఒక్కో బ్రెడ్ ముక్కలో 100 మిల్లీ గ్రాముల ఉప్పు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది శరీరానికి అస్సలు మంచిది కాదు. మార్కెట్లో దొరికే ఉత్పత్తుల్లో సోడియం తక్కువగా ఉన్న వాటిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవాలి. 5 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉంటే ఉప్పు రహితంగా వ్యవహరిస్తారు. 35 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉన్న దానిని .. అతి తక్కువ సోడియం ఉన్న వస్తువుగా పరిగణిస్తారు. 140 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉన్న దానిలో సోడియం తక్కువగా ఉన్నట్లు లెక్క.
మనం సాధారణంగా రోజూ ఇంట్లో వాడుకునే ఉప్పు వెనుక ఉన్న కథాకమామిషు. ఉప్పు ఎక్కువ తింటే ప్రాణాలకే ప్రమాదమని తెలుసుకున్నారుగా. కాబట్టి .. వీలైనంత వరకు సరాసరి ప్రమాణాలకు తగినట్లుగా ఉప్పు వాడకంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేసుకోండి.