Health tips : వయసు పెరిగే కొద్ది వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి?

By manavaradhi.com

Published on:

Follow Us

50 ఏళ్ల వ‌య‌సులో ఆహారనియమాలు, అలవాట్లు కూడా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఈ వయస్సులో ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టడం మొదలవుతుంది. అందుకే ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పెరుగుతున్న వయసు ఆరోగ్య విషయంలో మనకు ఒక హెచ్చరికగా భావించవచ్చు.

యాభై దాటాక శరీరంలో ఏవైనా బాధలు నొప్పులు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయవద్దంటారు వైద్యులు. ఈ వయసులో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఛాతీలో నొప్పి, ఆయాసం, వెన్ను భుజాలు మెడలో నొప్పి, చెమటలు పట్టటం, మగతగా ఉండటం లాంటి లక్షణాలు కనబడితే ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే గుండెపోటు విషయంలోనూ ఇలాంటి సూచనలే ఉంటాయి.

సరైన బరువుని మెయింటైన్ చేస్తూ, సిగరెట్, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనిని నివారించాలంటే కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఒత్తిడికి గురికాకూడదు.

మెడ వీపు కింది భాగాల్లో నొప్పులు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించాలి . వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సమస్యలు మొదలుకావచ్చు. మహిళల్లో ఎముకల సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ పరిస్థితినుండి తప్పించుకోవాలంటే క్యాల్షియం విటమిన్ డి తగినంతగా శరీరానికి అందాలి. వయసు పెరుగుతున్న కొద్దీ కంటి సమస్యలు పెరుగుతుంటాయి.

ముఖ్యంగా మన చూపుకి ఆధారమైన రెటీనా తన స్థానం నుండి పక్కకు తొలిగి కంటిచూపుకి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు పైబడుతున్నపుడు పీడించే సమస్యల్లో న్యూమోనియా కూడా ఒకటి. యాభై దాటాక వచ్చే న్యూమోనియాకు బ్యాక్టీరియా ఎక్కువగా కారణం అవుతుంది.

వయసు పెరుగుతున్నకొద్దీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వలన ఇలా జరుగుతుంది. అయితే దీనిని నివారించడానికి వ్యాక్సిన్ ఉంది. వయసు పెరుగుతున్నపుడు వచ్చే అనారోగ్యాల్లోగౌట్ కూడా ఒకటి. హఠాత్తుగా శరీరంలోని ఏదో ఒక జాయింట్ వద్ద వాపు, నొప్పితో ఇది మొదలవుతుంది. ఎక్కువగా బొటన వేలివద్ద కనబడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగటం వలన వచ్చే ఆర్థరైటిస్ ఇది. ఇలాంటి నొప్పి వాపు ఉంటే వెంటనే వైద్యునికి చూపించి తగిన చికిత్స తీసుకోవాలి.

సంతృప్త కొవ్వు అధికంగా ఉండే వెన్న, ప్రాసెస్డ్ ఫుడ్స్, డిజర్ట్స్ వంటి ఆహారాలను దూరం పెట్టాలి. కూల్ డ్రింక్స్, తీయని డెయిరీ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మాంసాహారులైతే స్కిన్‌లెస్‌ చికెన్‌, చేపలు అప్పుడప్పుడూ తీసుకోవచ్చు.

కనీసం నెలకు ఒకసారైనా బీపీ పరీక్షించి చూసుకోవడం అల‌వాటుగా చేసుకోవాలి.అర్ధ గంటకు తక్కువ కాకుండా ఉండేలా వ్యాయామాలు చేయాలి. వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉంటే 50 ఏళ్ల వయసులో కూడా ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.

Leave a Comment